AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

NEWYEAR: ప్రపంచమంతా పార్టీ చేసుకుంటుంటే.. ఈ దేశాల్లో మాత్రం సెలబ్రేషన్స్ ఉండవు!

ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 31 రాత్రి వచ్చిందంటే చాలు.. కోట్లాది మంది కేక్ కోసి, బాణసంచా కాల్చి కొత్త ఏడాదికి గ్రాండ్‌గా వెల్‌కమ్ చెబుతారు. టెలివిజన్ ఆన్ చేస్తే చాలు అన్ని దేశాల సెలబ్రేషన్స్ కనిపిస్తాయి. అయితే, ఇక్కడ ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే..

NEWYEAR: ప్రపంచమంతా పార్టీ చేసుకుంటుంటే.. ఈ దేశాల్లో మాత్రం సెలబ్రేషన్స్ ఉండవు!
Newyear2026
Nikhil
|

Updated on: Dec 30, 2025 | 7:00 AM

Share

ప్రపంచమంతా పండగ మూడ్‌లో ఉన్నా, కొన్ని దేశాల్లో మాత్రం ఆ రోజు కనీసం సెలవు కూడా ఉండదు. అందరూ జనవరి 1ని కొత్త ఏడాదిగా భావిస్తే, ఈ దేశాలు మాత్రం తమ సొంత క్యాలెండర్లను అనుసరిస్తూ వేరే రోజుల్లో పండగ చేసుకుంటాయి. అసలు ఈ న్యూ ఇయర్ వేడుకలకు దూరంగా ఉండే దేశాలు ఏవి? అక్కడ ఎందుకు సెలబ్రేట్ చేసుకోరో తెలుసుకుందాం..

సౌదీ అరేబియా

ముందుగా సౌదీ అరేబియా గురించి చెప్పుకోవాలి. ఇక్కడ ఇస్లామిక్ క్యాలెండర్‌ను అనుసరిస్తారు కాబట్టి, జనవరి 1న అధికారికంగా ఎలాంటి వేడుకలు జరగవు. ముస్లింల కొత్త ఏడాదిని ‘హిజ్రీ’ అని పిలుస్తారు, అది ప్రతి ఏటా మారుతూ ఉంటుంది. సౌదీలో బాహాటంగా న్యూ ఇయర్ పార్టీలు చేసుకోవడంపై గతంలో ఆంక్షలు కూడా ఉండేవి, అయితే ఇప్పుడు పరిస్థితులు కొంచెం మారుతున్నా.. ఇప్పటికీ అక్కడ జనవరి 1 అనేది ఒక సాధారణ పని దినం మాత్రమే. అదేవిధంగా ఇరాన్ దేశంలో కూడా మనకు కనిపించే న్యూ ఇయర్ హడావుడి ఉండదు. వారు ‘నౌరూజ్’ అనే పండగను కొత్త ఏడాదిగా జరుపుకుంటారు. ఇది సాధారణంగా మార్చి నెలలో వస్తుంది. ఈ పండగను వారు ఎంతో వైభవంగా నిర్వహిస్తారు కానీ జనవరి 1ని మాత్రం పెద్దగా పట్టించుకోరు.

చైనా..

మన పొరుగు దేశమైన చైనాలో కూడా పరిస్థితి ఇలాగే ఉంటుంది. ప్రపంచం కోసం వారు జనవరి 1న సెలవు ప్రకటించినప్పటికీ, చైనీయుల అసలైన కొత్త ఏడాది ‘చైనీస్ న్యూ ఇయర్’. ఇది జనవరి చివరలో లేదా ఫిబ్రవరిలో వస్తుంది. ఆ సమయంలోనే వారు సుదీర్ఘ సెలవులు తీసుకుని, కుటుంబ సభ్యులతో కలిసి పెద్ద ఎత్తున వేడుకలు జరుపుకుంటారు. జనవరి 1 వారికి కేవలం క్యాలెండర్ మారుతున్న రోజు మాత్రమే. అలాగే ఇజ్రాయెల్ దేశంలో కూడా యూదుల క్యాలెండర్ ప్రకారం ‘రోష్ హషనా’ అనే పండగను కొత్త ఏడాదిగా పాటిస్తారు. అది సెప్టెంబర్ లేదా అక్టోబర్ నెలల్లో వస్తుంది. అందుకే అక్కడ కూడా జనవరి 1న మనకు కనిపించేంత భారీ స్థాయిలో బాణసంచా వెలుగులు ఉండవు.

ఉత్తర కొరియా..

ఉత్తర కొరియాలో కూడా పరిస్థితి భిన్నంగా ఉంటుంది. అక్కడ గ్రెగోరియన్ క్యాలెండర్‌తో పాటు ‘జుచే’ క్యాలెండర్‌ను కూడా వాడుతుంటారు. అక్కడ వేడుకలు ప్రభుత్వ ఆదేశాల మేరకే జరుగుతాయి తప్ప సామాన్యులు తమ ఇష్టానుసారం పార్టీలు చేసుకోవడం కష్టం. ఇథియోపియా అనే దేశంలో అయితే మరీ వింతగా, వారి క్యాలెండర్ ప్రకారం సెప్టెంబర్ 11న కొత్త ఏడాది వస్తుంది. వీరి క్యాలెండర్ మిగిలిన ప్రపంచం కంటే ఏడున్నర ఏళ్లు వెనకబడి ఉండటం గమనార్హం. ఇలా ఒక్కో దేశం తమ మతపరమైన, సాంస్కృతిక కారణాల వల్ల జనవరి 1 వేడుకలకు దూరంగా ఉంటాయి. మొత్తానికి కొత్త ఏడాది అంటే కేవలం ఒక తేదీ మారడం మాత్రమే కాదు.. అది ఒక నమ్మకం, సంప్రదాయం.