RBI locker Rules: బ్యాంకు లాకర్లో దాచుకున్న బంగారం మాయమైందా? ఇలా చేస్తే 100 రెట్లు పరిహారం పొందొచ్చు..
Gold jewellery missing from bank locker? ఇంటి దొంగలు, కరడు గట్టిన గజ దొంగల భయంతో చాలా మంది తమ బంగారం, విలువైన డాక్యుమెంట్లను బ్యాంకు లాకర్లలో దాచుకుంటూ ఉంటారు. కానీ నేటి కాలంలో బ్యాంకు లాకర్లు కూడా సురక్షితంగా ఉంటాయనే గ్యారెంటీ ఎవ్వరూ ఇవ్వడం లేదు. అందుకు కారణం..

మనం కష్టపడి సంపాదించిన డబ్బును బంగారం, వెండి ఆభరణాల రూపంలో వాటిని దాచుకుంటాం. అయితే ఇంటి దొంగలు, కరడు గట్టిన గజ దొంగల భయంతో చాలా మంది వీటిని బ్యాంకు లాకర్లలో దాచుకుంటూ ఉంటారు. కానీ నేటి కాలంలో బ్యాంకు లాకర్లు కూడా సురక్షితంగా ఉంటాయనే గ్యారెంటీ ఎవ్వరూ ఇవ్వడం లేదు. అందుకు కారణం.. బ్యాంకు లాకర్‌లను కూడా దొంగలు దోచేస్తున్నారు. దీంతో జనాలు బ్యాంకు లాకర్లలో కూడా తమ సొత్తును దాచుకునేందుకు తటపటాయిస్తున్నారు. గతంలో బ్యాంకుల్లో దాచుకున్న బంగారం దోపిడీ చేస్తే సదరు బ్యాంకులు చేతులెత్తేసేవి. ఇలాంటి సందర్భాల్లో తాము బాధ్యత వహించమని చెప్పేవి. కానీ ఇప్పుడు భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) కస్టమర్ల ప్రయోజనం కోసం కఠినమైన నియమాలను రూపొందించింది. మీకు తెలుసా.. బ్యాంకు లాకర్లలోని బంగారం, వెండీ దొంగతనం చేస్తే ఆర్బీఐ తాజాగా కఠిన నియమాలను తీసుకువచ్చింది. అవేంటంటే..
ఆర్బీఐ తాజా నిబంధనల మేరకు బ్యాంకు నిర్లక్ష్యం కారణంగా లాకర్‌లోని వస్తువులకు నష్టం జరిగితే సదరు బ్యాంకులు సంబంధిత కస్టమర్‌కు లాకర్ వార్షిక అద్దెకు 100 రెట్లు పరిహారం చెల్లించాల్సి ఉంటుంది. సవరించిన RBI నిబంధనల ప్రకారం బ్యాంకు భవనం అగ్నిప్రమాదం లేదా కూలిపోవడం వల్ల బ్యాంకుకు నష్టం జరిగితే ఈ నియమం వర్తిస్తుంది. అదే విధంగా బ్యాంకులో దొంగతనం లేదా సాయుధ దోపిడీ లేదా బ్యాంకు ఉద్యోగి మోసం చేయడం వల్ల కస్టమర్ నష్టపోయినా కూడా ఇదే నియమం వర్తిస్తుంది. అయితే కొన్ని సహజ, సాంకేతిక కారణాల వల్ల బ్యాంకులకు ఈ నియమం నుంచి మినహాయింపు వర్తిస్తుంది. భూకంపం, వరదలు, పిడుగుపాటు వంటి ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టం జరిగినా లేదా కస్టమర్ తన పాస్‌వర్డ్/కీని సరిగ్గా నిర్వహించకపోవడం వల్ల లేదా తన స్వంత నిర్లక్ష్యం వల్ల లేదా లాకర్‌లో ఉంచిన వస్తువులు సహజంగానే రంగు మారినా లేదా అరిగిపోయినా బ్యాంకులు ఎలాంటి పరిహారం చెల్లించవు.
ఈ మేరకు దేశ వ్యాప్తంగా ఉన్న అన్ని బ్యాంకులు తమ కస్టమర్ల నుంచి కొత్త లాకర్ ఒప్పందాన్ని పొందాలని ఆర్బీఐ ఆదేశించింది. బ్యాంకు లాకర్‌లో ఖచ్చితంగా ఏమి దాచారో దాని గురించి బ్యాంకు వద్ద ఎటువంటి సమాచారం ఉండదు. అందువల్ల, వినియోగదారులు తమ ఆభరణాలు లేదా సంబంధిత బిల్లుల ఫోటోలను సురక్షితంగా ఉంచుకోవడం ప్రయోజనకరంగా ఉంటుందని ఆర్‌బీఐ పేర్కొంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి.
