Team India: శుభ్మన్ గిల్ చరిత్రకే ఎసరు పెట్టేసిన లేడీ కోహ్లీ.. మంధాన ఖాతాలో ప్రపంచ రికార్డ్?
Most Runs in a Calendar Year: భారత మహిళా క్రికెట్ స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో కొనసాగుతోంది. వెస్టిండీస్‌తో జరుగుతున్న సిరీస్‌లో అదరగొడుతున్న ఆమె, త్వరలోనే పురుషుల క్రికెట్ స్టార్ శుభ్‌మన్ గిల్ పేరిట ఉన్న ఒక భారీ ప్రపంచ రికార్డును అధిగమించే అవకాశం ఉంది. ఒక క్యాలెండర్ ఇయర్‌లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాళ్ల జాబితాలో మంధాన చరిత్ర సృష్టించేందుకు అడుగు దూరంలో ఉంది.

Most Runs in a Calendar Year: 2025లో తన అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శనతో స్మృతి మంధాన రికార్డు పుస్తకాలను తిరగరాయడానికి సిద్ధంగా ఉంది. ఈ క్యాలెండర్ ఇయర్‌లో ఆమె ఇప్పటికే అన్ని ఫార్మాట్‌లలో (వన్‌డేలు + టీ20లు) కలిపి 1,703 పరుగులు సాధించింది. దీంతో ఒకే ఏడాదిలో ఏ మహిళా క్రికెటర్ సాధించని అత్యధిక పరుగులు ఇవే కావడం గమనార్హం. మరో 62 పరుగులు చేస్తే, 2025లో అటు పురుషులు, ఇటు మహిళల అంతర్జాతీయ క్రికెట్ మొత్తంలో అత్యధిక పరుగులు చేసిన క్రీడాకారిణిగా మంధాన నిలుస్తుంది. తద్వారా శుభ్‌మన్ గిల్ (టెస్టులు + వన్‌డేలు + టీ20లు కలిపి 1,764 పరుగులు చేశాడు) రికార్డును ఆమె అధిగమిస్తుంది. ఈ సీజన్‌లో భారత మహిళల జట్టు విజయాల్లో మంధాన నిలకడైన బ్యాటింగ్ కీలక పాత్ర పోషించింది. వేగంగా పరుగులు సాధిస్తూనే, ఇన్నింగ్స్‌ను నిలకడగా ముందుకు తీసుకెళ్లే ఆమె సామర్థ్యం ప్రపంచంలోని అత్యుత్తమ బ్యాటర్లలో ఆమె ఒకరని మరోసారి నిరూపించింది. 2025లో మంధాన వన్‌డేల్లో 1,362 పరుగులు, టీ20ల్లో 341 పరుగులు చేసింది.
మంగళవారం శ్రీలంకతో జరగనున్న ఐదవ టీ20 మ్యాచ్‌లో భారత మహిళల జట్టు తలపడనుంది. అప్పటికే సిరీస్‌పై పట్టు సాధించిన భారత్, ఈ మ్యాచ్ కూడా గెలిచి 5-0తో క్లీన్ స్వీప్ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.
అంతర్జాతీయ క్రికెట్‌లో 10,000 పరుగుల మైలురాయిని చేరుకున్న రెండో భారతీయ మహిళా క్రీడాకారిణిగా, ప్రపంచవ్యాప్తంగా నాలుగో క్రీడాకారిణిగా స్మృతి మంధాన రికార్డు సృష్టించింది. ఆదివారం గ్రీన్‌ఫీల్డ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో శ్రీలంకతో జరిగిన నాలుగో టీ20 మ్యాచ్ సందర్భంగా ఆమె ఈ ఘనత సాధించింది.
మిథాలీ రాజ్, సూజీ బేట్స్, షార్లెట్ ఎడ్వర్డ్స్ తర్వాత ఈ మైలురాయిని అందుకున్న నాలుగో మహిళగా, భారత్ నుంచి మిథాలీ తర్వాత రెండో ప్లేయర్‌గా నిలిచింది. టెస్ట్ క్రికెట్‌లో మంధాన 7 మ్యాచ్‌లలో 57.18 సగటుతో 629 పరుగులు చేసింది (రెండు సెంచరీలు, మూడు హాఫ్ సెంచరీలు).
వన్‌డే ఫార్మాట్‌లో 117 మ్యాచ్‌లలో 48.38 సగటుతో 5,322 పరుగులు (14 సెంచరీలు, 34 హాఫ్ సెంచరీలు) సాధించి, అత్యధిక పరుగులు చేసిన వారిలో ఆరో స్థానంలో ఉంది. ఇక టీ20లలో 157 మ్యాచ్‌లలో 4,102 పరుగులు చేసి, ఈ ఫార్మాట్‌లో అత్యధిక పరుగులు చేసిన రెండో క్రీడాకారిణిగా కొనసాగుతోంది.
నాలుగో టీ20లో మంధాన 48 బంతుల్లో 80 పరుగులు (11 ఫోర్లు, 3 సిక్సర్లు) చేయడంతో భారత్ మహిళల టీ20 చరిత్రలోనే అత్యధిక స్కోరు (221/2) నమోదు చేసింది. అనంతరం శ్రీలంకను 30 పరుగుల తేడాతో ఓడించి, హర్మన్‌ప్రీత్ కౌర్ నేతృత్వంలోని భారత్ 4-0తో అజేయ ఆధిక్యాన్ని సాధించింది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




