AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇలా అయిపోయింది పాడు లోకం.. బిడ్డల్ని బస్సులో వదిలేసి.. ప్రియుడితో పరార్!

మహారాష్ట్రలో సభ్యసమాజం తలదించుకునేలా ఒక షాకింగ్ ఘటన వెలుగుచూసింది. అక్రమ సంబంధం తెచ్చిపెట్టిన మోజులో ఒక కన్నతల్లే కసాయిగా మారింది. కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన ఇద్దరు బిడ్డలను నడిరోడ్డుపై బస్సులోనే వదిలేసి, ప్రియుడితో కలిసి చెక్కేసింది. అంతటితో ఆగకుండా, తనను నమ్మి ఆశ్రయమిచ్చిన సొంత తండ్రికే కన్నం వేసి విస్తుపోయేలా చేసింది.

ఇలా అయిపోయింది పాడు లోకం.. బిడ్డల్ని బస్సులో వదిలేసి.. ప్రియుడితో పరార్!
Woman Abandoned Her Children In Bus
Balaraju Goud
|

Updated on: May 22, 2026 | 1:27 PM

Share

మహారాష్ట్రలో సభ్యసమాజం తలదించుకునేలా ఒక షాకింగ్ ఘటన వెలుగుచూసింది. అక్రమ సంబంధం తెచ్చిపెట్టిన మోజులో ఒక కన్నతల్లే కసాయిగా మారింది. కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన ఇద్దరు బిడ్డలను నడిరోడ్డుపై బస్సులోనే వదిలేసి, ప్రియుడితో కలిసి చెక్కేసింది. అంతటితో ఆగకుండా, తనను నమ్మి ఆశ్రయమిచ్చిన సొంత తండ్రికే కన్నం వేసి విస్తుపోయేలా చేసింది.

ఈ దారుణమైన ఘటన మహారాష్ట్రలోని బీడ్ జిల్లా యాత్వమాల్ పరిధిలో చోటుచేసుకుంది. అక్కడ నివసించే 26 ఏళ్ల ఒక వివాహితకు మరో వ్యక్తితో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఆ అక్రమ సంబంధం కాస్తా ముదరడంతో, ఎలాగైనా ప్రియుడితో వెళ్ళిపోవాలని ఆమె పథకం పన్నింది. ఈ క్రమంలోనే తన ఇద్దరు పిల్లలను తీసుకుని తుల్జాపూర్ వెళ్లే బస్సు ఎక్కింది. ప్రయాణంలో ఉండగానే, తాను ఎక్కడికి చేరుకోవాలో, ఏ స్టాప్ వద్దకు రావాలో తన ప్రియుడికి మొబైల్ ఫోన్ ద్వారా మెసేజ్ పంపింది.

ఆమె ప్లాన్ ప్రకారం ప్రియుడు స్కూటర్ తీసుకుని నిర్దేశిత ప్రాంతానికి చేరుకున్నాడు. బస్సు అక్కడ ఆగగానే, నిద్రపోతున్న ఇద్దరు బిడ్డలను సీట్లోనే వదిలేసి, ఆమె ఏమాత్రం జాలి లేకుండా బస్సు దిగి ప్రియుడితో కలిసి స్కూటీపై పారిపోయింది. కాసేపటికి నిద్రలేచిన పిల్లలు పక్కన తల్లి కనిపించకపోవడంతో గట్టిగా ఏడవడం ప్రారంభించారు. ఇది గమనించిన బస్సు కండక్టర్, తోటి ప్రయాణికులు వెంటనే స్పందించి స్థానిక పోలీసులకు సమాచారం అందించి, పిల్లలను వారికి అప్పగించారు.

పోలీసులు ఆ పిల్లలను విచారించి, వారి జేబులను వెదకగా ఒక చీటీ లభ్యమైంది. ఆ కన్నతల్లి ఎంత పక్కా ప్లాన్‌తో వచ్చిందో ఆ చీటీని చూస్తే అర్థమవుతుంది. అందులో ఆమె తన సొంత తండ్రి అడ్రస్, ఫోన్ నంబర్ రాసి పెట్టింది. “ఈ బిడ్డలను మా నాన్నకు అప్పగించండి” అని ఆ స్లిప్పులో కోరింది. పోలీసులు వెంటనే ఆ నంబర్ ఆధారంగా తండ్రిని పిలిపించి మాట్లాడారు.

అయితే ఆ వృద్ధ తండ్రి చెప్పిన విషయాలు విని పోలీసులు సైతం నివ్వెరపోయారు. ఆ కూతురు ప్రియుడితో వెళ్ళిపోవడమే కాకుండా, తన తండ్రి ఇంట్లోనే చోరీకి పాల్పడింది. ప్రియుడి చేత తండ్రి ఇంట్లోని మొబైల్ ఫోన్, డబ్బు, అలాగే స్కూటీని కూడా దొంగిలించి పారిపోయిందని తండ్రి ఆవేదన వ్యక్తం చేశాడు. తన ఆర్థిక పరిస్థితి బాగోలేదని, కూతురు సర్వస్వం దోచుకెళ్లిందని, కాబట్టి ఆ పిల్లలను తాను పోషించలేనని చేతులెత్తేశాడు. దీంతో పోలీసులు ఆ చిన్నారులను సురక్షితంగా ప్రభుత్వ బాలల సంరక్షణ కేంద్రానికి తరలించి, కేసు నమోదు చేసి ఆ కిరాతక తల్లి, ఆమె ప్రియుడి కోసం గాలిస్తున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…

Follow Us