Free LPG Cylinders: ఆ రాష్ట్ర ప్రజలకు గుడ్ న్యూస్.. సంవత్సరానికి 3 ఎల్‌పీజీ సిలిండర్లు ఫ్రీ.. షరతులు వర్తిస్తాయి..
దేశంలో నిత్యావసర వస్తువుల ధరలు నానాటికి పెరుగుతుండటంతో సామాన్యుల బతుకు సాగడమే గగనంగా మారింది. ప్రతీ నెలా ఏదో ఒక వస్తువు ధరలు పెరుగుతూనే ఉన్నాయి.
దేశంలో నిత్యావసర వస్తువుల ధరలు నానాటికి పెరుగుతుండటంతో సామాన్యుల బతుకు సాగడమే గగనంగా మారింది. ప్రతీ నెలా ఏదో ఒక వస్తువు ధరలు పెరుగుతూనే ఉన్నాయి. దాంతో ప్రజల జీవనస్థితి మరింత అధమ స్థితికి పడిపోతోంది. ఇక కరోనా దెబ్బతో కునారిల్లిపోయిన ప్రజలకు.. ప్రతీ నెలా పెరుగుతున్న వంటగ్యాస్ ధరలు ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి. దాంతో వంటగ్యాస్ కొనుగోలు చేయాలంటేనే జడుసుకునే పరిస్థితి నెలకొంది. ఇలాంటి పరిస్థితుల్లో దీపావళి వేళ ఉత్తరాఖండ్ సర్కార్, ఆ రాష్ట్ర ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పింది. అంత్యోదయ కార్డుదారులకు ప్రతీ సంవత్సరం మూడు డొమెస్టిక్ ఎల్‌పిజి సిలిండర్లను ఉచితంగా ఇవ్వాలని నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర సర్కార్ ఒక ప్రకటన విడుదల చేసింది. దీపావళి సందర్భంగా ఉత్తరాఖండ్ వాసులై, అంత్యోదయ కార్డు కలిగి ఉన్న వారు ప్రభుత్వం ప్రకటించిన ఈ ఉచిత సిలిండర్లను పొందేందుకు అర్హులు.
కరోనా దెబ్బతో ఉపాధి కోల్పోయి, తినడానికి తిండి కూడా దొరక్క దేశంలో చాలా మంది ప్రజలు అవస్థలు పడుతున్నారు. ఇలాంటి వారిని దృష్టిలో ఉంచుకునే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉచితంగా రేషన్ అందిస్తూ వస్తున్నాయి. కొంతకాలంపాటు ఆర్థిక సాయం కూడా అందించాయి. అయితే, ఓవైపు ఫ్రీ రేషన్ అందిస్తున్నప్పటికీ.. మరోవైపు వంటగ్యాస్ ధరలు, వంట నూనె ధరలు ఆకాశాన్నంటాయి. దాంతో ప్రజల పరిస్థితి ఏం కొనేటట్లు లేదు, ఏం తినేటట్లు లేదు అన్నట్లు తయారైంది. ఇలాంటి పరిస్థితుల్లో ఉత్తరాఖండ్ ప్రభుత్వం చేసిన ప్రకటన.. అక్కడి రాష్ట్ర ప్రజలకు భారీ ఊరటనిచ్చింది. పండుగ వేళ తియ్యటి వేడుక చేసుకున్నట్లుగా ఉచిత గ్యాస్ సిలిండర్ల ప్రకటన.. వారి ముఖాల్లో చిరునవ్వులు చిందించేలా చేసింది. దీపావళి నుంచి రేషన్ కార్డు ఉన్న ప్రతీ లబ్దిదారుడికి ఏడాదికి 3 సిలిండర్లు ఉచితంగా ఇవ్వనన్నట్లు చేసిన ఆ ప్రకటనపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఈ పథకానికి సంబంధించిన వివరాలివి..
2022-23 ఆర్థిక సంవత్సరంలో అంత్యోదయ రేషన్ కార్డుదారులు మూడు గ్యాస్ సిలిండర్లను రీఫిల్ చేయడానికి ఒక్క పైసా కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. అర్హులైన అంత్యోదయ రేషన్ కార్డ్ హోల్డర్లు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ఈ సదుపాయాన్ని పొందగలుగుతారు. ఉచిత గ్యాస్ సిలిండర్ పొందడానికి ప్రభుత్వం 3 షరతులు విధించింది. ఉచిత గ్యాస్ సిలిండర్ పొందాలంటే ముందుగా లబ్ధిదారుడు ఉత్తరాఖండ్ వాయి అయిఉండాలి. అలాగే అంత్యోదయ కార్డు తప్పనిసరిగా ఉండాలి. అంత్యోదయ కార్డుతో గ్యాస్‌ను లింక్ చేయాలి.
ఉచిత సిలిండర్లు ఎప్పుడిస్తారు?
ఏప్రిల్ – జులై నెలల మధ్య లబ్ధిదారులకు మొదటి సిలిండర్ ఇవ్వనున్నట్లు ఉత్తరాఖండ్ ప్రభుత్వం ప్రకటించింది. రెండవ సిలిండర్ ఆగస్టు నుండి నవంబర్ వరకు, మూడవ సిలిండర్ డిసెంబర్ నుండి మార్చి వరకు అందుబాటులో ఉంటుంది. మీకు రేషన్ కార్డుతో గ్యాస్ కనెక్షన్ లింక్ చేయకపోతే.. వెంటనే గ్యాస్ ఏజెన్సీని సంప్రదించి లింక్ చేయించుకోవాలి. కాగా, ఉత్తరాఖండ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ కొత్త పథకం ద్వారా దాదాపు 2 లక్షల మంది సామాన్యులు లబ్ధి పొందనున్నారు. ఉచిత గ్యాస్ సిలిండర్లను అందించేందుకు ఉత్తరాఖండ్ ప్రభుత్వం దాదాపు రూ.55 కోట్లు ఖర్చు చేస్తోంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..