సాంబార్ పాలిటిక్స్: తమిళపార్టీల తొక్కిసలాట.. పిచ్చెక్కిస్తున్న దళపతుల కొట్లాట!
బెంగాల్, అసోం, తమిళనాడు, కేరళ, పాండిచ్ఛేరి.. మొత్తం ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలకు కౌంట్‌డౌన్ షురువైంది. మార్చిలో షెడ్యూల్, ఏప్రిల్, మేనెలల్లో పోలింగ్.. జూన్ నెలకల్లా కొత్త ప్రభుత్వాలు కొలువుతీరతాయి. పిల్ల రాష్ట్రం పాండిచ్చేరిని పక్కకుబెడితే మిగతా నాలుగు రాష్ట్రాలకూ ఇది హైటైమ్. కానీ, ఒక్కటి గమనించారా? దేశం మొత్తం ఆ ఒక్క తమిళనాడు వైపే మేజర్‌గా ఫోకస్ చేసింది. ఆ రేంజ్‌లో ఉంది అక్కడ పొలిటికల్ డెన్సిటీ. పాత పార్టీల్లో చీలికలు, ఊహలకందని చేరికలు, కొత్త పార్టీల పెడబొబ్బలు.. ఎవ్వరి పులిహోర వాళ్లు కలుపుకుంటున్నారు. మొత్తానికి అక్కడో పెద్ద ఇలాఖతా మాఫియా నడుస్తున్నట్టుంది.

* 1987 డిసెంబర్‌లో ఎంజీఆర్ అస్తమయం, అన్నాడీఎంకేలో ఓ అమ్మ ఆగమనం.. ద్రవిడ రాజకీయాల్లో అదొక పెను సంచలనం.
* 2016 డిసెంబర్‌లో పురచ్చితలైవి జయలలిత మరణం.. అమ్మ శకం ముగిసి, చీలికలు పేలికలుగా మారి, పతనం దిశగా అన్నాడీఎంకే పయనం..
* కొత్త జెండా టీవీకే జననం.. సినిమాటిక్ పాలిటిక్స్‌కి మళ్లీ ఊపొచ్చినట్టే వచ్చి.. టోటల్ అరవ పొలిటికల్ పిక్చర్‌లో కలకలం.. కొత్తకొత్త ట్విస్టులతో ద్రవిడ రాజకీయమంతా కలగాపులగం. ఔను, అల్పపీడనం పుట్టి, వాయుగుండంగా మారి ఉప్పెనై ముంచెత్తుతోంది తమిళనాట పొలిటికల్ తుఫాన్.
1967 తర్వాత అంటే, దాదాపు అరవై ఏళ్లుగా తమిళనాడులో ద్రవిడ రాజకీయాలదే ఆధిపత్యం. డీఎంకే, అన్నాడీఎంకే పార్టీలు మారిమారి పవర్లోకొచ్చేవి. పెరియార్ భావజాలంతో ‘డ్రవిడ మోడల్ ఆఫ్ కమ్యూనలిజం’తో పుట్టిన ఆ రెండు ప్రాంతీయ పార్టీలదే తిరుగులేని హవా. బైటి పార్టీలు తమిళనాడు వైపు చూడాలంటేనే జడుసుకునేవి. జాతీయ పార్టీలైతే దశాబ్దాల తరబడి తోకపార్టీలుగానే మిగిలిపోయిన బాపతు. పదేళ్ల కిందటిదాకా తమిళనాట ఎలక్టోరల్ గ్రౌండ్‌లో ఉన్న పిచ్చ క్లారిటీ ఇది. ఇప్పుడైతే ఆ క్లారిటీ మిస్సయిందా? ఎందుకంటే.. ఇటు పురచ్చితలైవి జయలలిత, అటు కలైజ్ఞర్ కరుణానిధి… అక్కడ రెండేరెండు కటౌట్లుండేవి. పురచ్చితలైవి మరణం తర్వాత.. పడుతూలేస్తూ ఆయాసపడుతున్న అన్నాడీఎంకే.. తమ పురానా దోస్త్ బీజేపీని మళ్లీ కలుపుకుని లేచినిలబడే సాహసం చేస్తోంది. సరిగ్గా ఇక్కడే కొత్తగా చేరిన కలర్‌ఫుల్ అండ్ పాపులర్ కటౌట్ పేరు దళపతి విజయ్. కాసేపు ముఖాముఖి పోరు అని, మరికాస్సేపు ట్రయాంగిల్ ఫైట్ అని షేపులు మార్చుకుంటూ పోతున్న సాంబార్ పాలిటిక్స్‌లో పూటకో మసాలా యాడవుతోంది. పులిహోర పొట్లంలా మారింది. లేటెస్ట్ డెవలప్‌మెంట్ ఏంటంటే.. మాజీ సీఎం పన్నీర్ సెల్వం శత్రుపార్టీ డీఎంకేలో చేరడం. స్టాలిన్‌తో చేతులు కలపడం.
జయలలిత జైలుకెళ్లినప్పుడు, ఆమె కుర్చీని భర్తీ చేసిన శాల్తీగా పన్నీర్‌సెల్వంకి పెద్ద క్రెడిటే ఉంది. ఆమె చెప్పినా చెప్పకపోయినా పార్టీలో నంబర్‌టూగా చెలామణి అయ్యారు ఓపీఎస్. కట్ చేస్తే.. ఇప్పుడు డీఎంకే కండువా కప్పేసుకున్నాడు. ముఖ్యమంత్రి స్థాయి నాయకులు పార్టీ ఫిరాయించి, తోచినచోటకు వలస వెళ్లడం కొత్తేమీ కాకపోయినా, తమిళనాట పన్నీర్‌సెల్వం చేసిన జంప్ మాత్రం.. ఖతర్నాక్ అనే చెప్పొచ్చు.
అన్నాడీఎంకేలో ఓపీఎస్ ఎంతటి విశ్వాసపాత్రుడో తెలియాలంటే జార్ఖండ్ ఎగ్జాంపుల్‌ని చెప్పుకోవాల్సిందే. హేమంత్ సొరెన్ జైలుకెళ్లినప్పుడు సీనియర్ నేత చంపాయ్ సొరెన్‌ని సీఎంగా కూర్చోబెడితే, జైలునుంచి తిరిగొచ్చిన తర్వాత అడ్డం తిరిగి, కుర్చీని వాటేసుకున్నాడాయన. పన్నీర్ సెల్వం మాత్రం జయలలిత ఫోటోను పక్కన పెట్టుకుని పాలించి, ఆమె వచ్చిన తర్వాత బంగారుపళ్లెంలో సీఎం సీటును తిరిగిచ్చారు. అంతటి మోస్ట్ లాయలిస్ట్ ఇప్పుడు డీఎంకేలోకి గెంతేయడాన్ని ఎలా చూడాలి? కోటిన్నర సభ్యత్వాల బలంతో ఉన్న పార్టీ అని, ఎంజీఆర్, జయలలిత ఫోటోలే ఓట్లు కురిపిస్తాయని, ఒక్క పన్నీర్‌సెల్వం పోతే తమ ఓటు బ్యాంకుకొచ్చిన లోటేమీ లేదని వాళ్లు చెప్పుకున్నా.. దీన్ని ఎండ్ ఆఫ్ ఏడిఎంకే అని డిసైడ్ చేస్తున్నారు పొలిటికల్ ఎక్స్‌పర్ట్స్.
జయలలిత మరణించినప్పుడు అమ్మ పార్టీ నిలువునా చీలింది. అప్పట్లో శశికళ, పళనిస్వామి ఒకవైపు, పన్నీర్‌సెల్వం మరోవైపు నిలబడ్డారు. కానీ, బీజేపీ జోక్యం చేసుకుని పళనిస్వామినీ, పన్నీర్‌సెల్వంని కలిపి, అన్నాడీఎంకేకి ఊపిరి పోసింది. OPS ప్లస్ EPS… బెటర్ ఈక్వేషన్ ఔతుందని, తమకూ ఊతంగా ఉంటుందని ఆశపడింది. కానీ, ఒకే పార్టీలో రెండు పవర్‌సెంటర్లు కలిసుండడం ప్రాక్టికల్‌గా వర్కవుట్ కాదు. పైగా, పన్నీర్‌సెల్వంతో పోలిస్తే పళనిస్వామే బెటరనేది కమలం పార్టీ అంచనా. అనుకున్నదే జరిగింది. పార్టీలో కరివేపాకులా మారిపోయిన పన్నీర్ సెల్వం వేరే మార్గం లేక డీఎంకేలో చేరిపోయారు. శత్రుపక్షంలోని ఒక పవర్‌సెంటర్‌ను లాగేసిన స్టాలిన్‌వైపే ఎడ్వాంటేజ్ ఉన్నట్టు. పోటీలో గట్టిగా నిలబడాలంటే, అన్నాడీఎంకేని మళ్లీ నిటారుగా నిలబెట్టాలంటే ఇప్పుడు బీజేపీ ఏ పాచిక వేస్తుంది అనేది బిగ్గెస్ట్ క్వశ్చన్.
జబర్దస్త్‌గా జెండా ఎగరేశానన్న ఆనందమే తప్ప.. ఎజెండా దగ్గర మాత్రం డిమ్కీ కొడుతూనే ఉన్నాడు మిస్టర్ జననాయగన్. శత్రువులు పెరిగి, దెబ్బమీద దెబ్బ కొట్టడంతో ఆయన కాలిక్యులేషన్లు ఎప్పటికప్పుడు మారిపోతూనే ఉన్నాయి. పోటీ తనకూ స్టాలిన్ అంకుల్‌కీ మధ్యనే ఉందని, మిగతా పార్టీలన్నీ కామెడీ పీస్‌లేనని పదేపదే చెబుతున్నారు విజయ్. కానీ, క్లయిమాక్స్ తర్వాత మిగలబోయే వన్‌అండ్ ఓన్లీ కామెడీ క్యారెక్టర్ నువ్వే అని రివర్స్‌లో కౌంటర్లు పడుతున్నాయి. ఇప్పటికీ తన గెలుపు సూత్రమేంటన్నది క్లియర్‌గా చెప్పలేకపోతున్నారు విజయ్. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలతో కంబైన్డ్‌గా కొట్లాటకు దిగి, ఆల్టర్‌నేటివ్ అండ్ ప్రోగ్రెసివ్ పాలిటిక్స్ తనతోనే సాధ్యమని చెబుతున్న నయా దళపతికి నిజంగానే అంత సీనుందా? 16 శాతానికి కాస్త అటూఇటూ ఓటుబ్యాంకున్నట్టు అంచనా వేసుకున్న టీవీకే ఒంటరిగా పోటీ చేస్తే ఫలితం ఎలా ఉండబోతోంది? వి ఫర్ విక్టరీ అంటున్న విజయ్ ఫ్యాక్టర్, ఈ ఎన్నికల్లో ఎంతమాత్రం?
40 ఏళ్ల కెరీర్‌లో 80కి పైగా సినిమాల్లో హీరోగా చేసి, దళపతిగా కటౌట్ సైజుల్ని పెంచుకున్న విజయ్‌కి.. కేవలం ఆరునెలల్లో మూడు సినిమాలు చూపించింది తమిళనాడు రాజకీయం. పార్టీ పెట్టిన మరుసటిరోజునుంచి షాకుల మీద షాకులు. దెబ్బతగిలేకొద్దీ రాటుదేలతానంటున్న విజయ్.. ఎప్పటికప్పుడు కుంగుబాటు తప్పడం లేదు.
41 మందికి పైగా మరణించి దాదాపు100 మందిని గాయపర్చిన కరూర్ ట్రాజెడీ విజయ్ పొలిటికల్ జర్నీలో పడ్డ ఫస్ట్ సడన్ బ్రేక్. ప్రాణాలు తీయడానికే పార్టీ పెట్టాడంటూ ఇష్యూను సెంటిమెంటల్‌గా మార్చి విజయ్ ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేశాయి అపోజిషన్ పార్టీలు. విచారణ చేపట్టిన సీబీఐ విజయ్‌ని ఢిల్లీకి పిలిచి ఇంటరాగేట్ చేసింది.
కోట్ల ఖరీదైన కెరీర్‌ని గాలికొదిలి పబ్లిక్ లైఫ్‌లోకొచ్చానంటున్న హీరో విజయ్.. తన చిట్టచివరి సినిమాగా ప్రమోట్ చేసుకున్న జననాయగన్.. థియేటర్లలోకే రాలేదు. చట్టపరమైన చిక్కులతో మూలనబడింది. ఆ సినిమాతో జనంలో ఎమోషన్స్ వర్కవుట్ చేసుకుందామన్న ఆశలు అడియాసలే అయ్యాయి. విజయ్ పొలిటికల్ లైఫ్‌కి ఆక్సిజన్ లాంటి ఆయన ఫ్యాన్స్‌కి నిట్టూర్పులే మిగిలాయి.
విజయ్ వివాహేతర సంబంధం పుకారు కాదు పచ్చినిజం.. విజయ్ భార్య సంగీత చెంగల్పట్ కోర్టులో విడాకుల పిటిషన్ దాఖలు చేయడం తమిళ రాజకీయాల్ని మరో ఇంట్రస్టింగ్ మలుపు తిప్పేశాయి. విజయ్ వ్యక్తిగతాన్ని సూటిగా టార్గెట్ చేసింది. మా ఆయన నాకొద్దు.. ఆయనకు వివాహేతర సంబంధం ఉంది అని ఓపెన్‌గా చెప్పేసిన సంగీత.. విజయ్ వ్యక్తిత్వాన్నే ప్రశ్నార్థకంగా మార్చేసింది. విజయ్ రాజకీయ ప్రత్యర్ధులకు పెద్ద ఆయుధం దొరికినట్టయ్యింది. అప్పటికే ఓ సినీనటిలో విజయ్‌కు సంబంధం ఉందన్న అభియోగం.. ఆయన పర్సనల్ లైఫ్ మీద పెద్ద మచ్చ.
విడాకుల నోటీసు పూర్తిగా వ్యక్తిగత విషయం, స్పందించాల్సిన అవసరం లేదు అని తప్పించుకున్నప్పటికీ పార్టీ భవిష్యత్తును మాత్రం తీవ్రంగా ప్రభానితం చేసే ఛాన్సుంది. విజయ్ తీరుతో ఐదేళ్ల నుంచి మానసిక క్షోభ అనుభవిస్తున్నానని, ఆయన విజయ్ వేధింపులు కొనసాగితే ఆ నటి పేరు బయటపెడుతానని స్వయానా భార్యే పంచాయతీ పెట్టడం విజయ్‌కి కొత్త తలనొప్పి. తమిళనాడు ప్రజల జీవితాలను బాగు చేస్తానంటున్న విజయ్ అంతకంటే ముందు సొంత కాపురాన్ని చక్కదిద్దుకోవాలంటూ సెటైర్లు పడుతున్నాయి. ఇలా… దెబ్బమీద దెబ్బ కొట్టి పర్సనల్ లైఫ్‌ని, పబ్లిక్ లైఫ్‌ని, సినిమా లైఫ్‌ని.. టార్గెట్ చేసి విజయ్ పొలిటికల్ ఎంట్రీని సక్సెస్‌ఫుల్‌గా డ్యామేజ్ చెయ్యగలిగింది విజయ్ శత్రువర్గం.
సొంత జెండా ఎగరేసి, రాష్ట్రంలో, కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీలతో కంబైన్డ్‌గా కొట్లాటకు దిగితే.. ఈ మాత్రం షాకులు ఉండే తీరతాయి. సైద్ధాంతికంగా బీజేపీని, రాజకీయంగా డీఎంకేని శత్రువులుగా ప్రకటించిన టీవీకే చీఫ్ విజయ్, ఆ రెండు పార్టీల నుంచి ప్రత్యక్షంగానో పరోక్షంగానో దాడిని ఎదుర్కోవాల్సిన పరిస్థితి. అటు, ఒంటరి పోరుకే సైకొట్టిన TVK విజయ్ కోసం కూటమి కడదాం రా అంటూ కాంగ్రెస్ పార్టీ గాలం వేస్తోంది.
కరూర్ తొక్కిసలాటప్పుడే పార్టీ ఫ్యూచర్‌కి ఎండ్‌కార్డ్ పడిందని జోస్యాలు చెప్పారు. ఇప్పుడు భార్య విడాకులు కూడా చురకత్తుల్లా గుచ్చుకుంటున్నాయి. మరోవైపు, కాంగ్రెస్ పార్టీ ఆపరేషన్ ఆకర్ష్. ఎన్నికలకు మరో నెలన్నర రోజులైనా గ్యాప్ లేదు. విజయ్ తేల్చుకోవాల్సిన సమస్యలు మాత్రం బోలెడన్ని. రాజకీయ దళపతికి సినిమా దళపతి ఎంతమేరకు పోటీనిస్తాడో చూడాలి మరి.
కామ్రేడ్ కంటెంట్‌తో కమల్‌హాసన్ పెట్టుకున్న పార్టీ డీఎంకేలో కలిసిపోయింది. రాజ్యసభ సీటుకి బేరం పెట్టి కాంప్రమైజ్ అయ్యారని ఆయనపై అభియోగం ఉంది. కెప్టెన్ విజయ్‌కాంత్ పెట్టిన డీఎండీకే పార్టీని కూడా స్టాలిన్ చేతుల్లో పెట్టేశారు ఆయన భార్య ప్రేమలతా విజయ్‌కాంత్. విజయ్‌తో కటీఫ్ కొట్టిన ఆయన భార్య సంగీతా సోమలింగం రేపటిరోజున ప్రచారంలో ఏ జెండా పట్టుకుంటారో తెలీదు. జయలలితకు, శశికళకు దగ్గర మనిషి టీటీవీ దినకరన్ బీజేపీ కూటమిలో చేరిపోయారు. నిన్నటిదాకా అమ్మ పాట పాడిన పన్నీర్ సెల్వం అన్నా అంటూ స్టాలిన్ చంకలో దూరిపోయారు. ఇలా, ఎవరికి వారే సొంత పైత్యాలతో ఫ్యూచర్లని వెతుక్కునేసరికి, తమిళనాట రాజకీయం కలగాపులగమైంది. దేశంలోకెల్లా ఎక్కువ పార్టీలున్న రాష్ట్రంగా తమిళనాడు పేరిట ఓ రికార్డే ఉంది. ఇప్పుడు చీలికలు, చేరికలతో ఆ రికార్డు మళ్లీ బద్దలౌతోంది.
ద్రవిడ మోడల్ 2.0 నినాదంతో డీఎంకే చీఫ్ స్టాలిన్ మరోసారి అధికారాన్ని కాపాడుకోవాలని తాపత్రయ పడుతున్నారు. స్థిరమైన పాలన, సంక్షేమ పథకాల అమలు తమతోనే సాధ్యమని చెప్పుకుంటున్నారు. సెక్యులర్ ప్రోగ్రెసివ్ అలయన్స్ SPA పేరుతో తన కూటమిని కూడా బలంగా మేకోవర్ చేసుకుంటున్నారు. ప్రస్తుతానికి కాంగ్రెస్, కమ్యూనిస్టుల బలంతో టైటిల్ ఫేవరిట్‌గా ముందు వరుసలో ఉంది స్టాలిన్ పార్టీ.
నాయకత్వ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న అన్నాడీఎంకేను దగ్గరకు తీసుకుని, కూటమిని పునరుద్ధరించి, తమిళనాడు నుంచైనా సౌత్‌లో ఎంట్రీ ఇవ్వాలని తహతహలాడుతోంది బీజేపీ. మోదీ, అమిత్‌షా వరుస టూర్లేస్తూ, సమయం దొరికినప్పుడల్లా తమిళ్ సెంటిమెంట్‌ని టచ్ చేస్తున్నారు. అంతర్గతంగా చదరంగమూ ఆడుతోంది కమలం పార్టీ.
యూత్, మిడిల్ క్లాస్ ఓటును నమ్ముకుని హీరో విజయ్ పెట్టుకున్న టీవీకే పార్టీని ఆదిలో మట్టుబెట్టాలని రెండు అధికార పార్టీలూ శతవిధాలా ప్రయత్నిస్తున్నాయి. సంప్రదాయ ద్రవిడ పార్టీలకు సరైన ప్రత్యామ్నాయం తానేనని చెప్పుకోవడమే గాని, ఇంతవరకూ బలమైన కేడర్‌ని నిర్మించుకోలేక, సతమతమౌతున్నారు విజయ్. ఇలా ట్రయాంగిల్ ఫైట్ ఫిక్స్ అనుకుంటున్న తరుణంలో తగుదునమ్మా అంటూ తనూ ఓ పార్టీ జెండాను తెచ్చుకుంది వీకే శశికళ. అన్నాడీఎంకేలోకి మళ్లీ రావాలని, పార్టీని మళ్లీ చేతికి తీసుకోవాలని ఏడెనిమిదేళ్లుగా ప్రయత్నిస్తూనే ఉన్న శశికళ, తను కూడా ఓ కొత్త దుకాణం తెరిచారు.
దేవర సామాజిక వర్గాన్ని ఒకే తాటిపైకి తీసుకొచ్చి పొలిటికల్ ఎడ్వాంటేజ్ పొందాలన్నది శశికళ ఐడియా. ప్రస్తుతానికైతే బ్యాక్‌డోర్ పాలిటిక్స్‌కే పరిమితం. జయలలిత హయాంలో కింగ్‌మేకర్‌గా ఆమెకు మాంచి పేరుంది కూడా. దక్షిణ తమిళనాడులోని ఐదు జిల్లాల్లో దేవర్ సామాజికవర్గం బలంగా ఉంది. ఇక్కడ శశికళ చక్రం తిప్పే అవకాశమైతే ఉంది. స్టాలిన్‌ని మళ్లీ పవర్లోకి రానివ్వనని ఛాలెంజ్ ఐతే చేశారు గాని, ఆమె పెట్టిన కొత్త పార్టీతో పరోక్షంగా అన్నాడీఎంకే-బీజేపీ కూటమికే నష్టం వాటిల్లే అవకాశం ఉంది.
అన్నాడీఎంకే నుంచి పన్నీర్ సెల్వంను ఎట్రాక్ట్ చేయడం ద్వారా సౌత్ తమిళనాడులో ఉన్న 12 శాతం దేవర్ కులస్తులపై కన్నేసింది డీఎంకే. కానీ, శశికళ కొత్త పార్టీతో దేవర్ సామాజికవర్గంలో చీలిక రావడం పక్కా. అటు, పళనిస్వామిపైనే ఆశలు పెట్టుకున్న బీజేపీ ఆయన సామాజికవర్గం గౌండర్ ఓటుబ్యాంకును ప్రసన్నం చేసుకునే ఛాన్సుంది.
విజయ్‌ని ఒంటరి చేయాలన్న ఎత్తులు ఫలిస్తాయా? బీజేపీ ఎలక్షన్ ఇంజనీరింగ్ అన్నాడీఎంకేకి ఎడ్వాంటేజ్ ఔతుందా? విజయ్ వైవాహిక జీవితంపై పడ్డ మరకలు ఎంతమేరకు ప్రభావం చూపుతాయి? ఇప్పటివరకూ ఎటూ తేల్చని సూపర్‌స్టార్ రజనీకాంత్ ఫ్యాన్ ఫాలోయింగ్, విజయ్ సమకాలీనుడు అజిత్‌కున్న ఓటు బ్యాంకు.. ఎటువైపు మొగ్గు చూపుతుంది? ఇవన్నీ ఇప్పటికైతే అంతుబట్టని ప్రశ్నలు. కానీ, వీటన్నిటికీ మించి పార్టీలు పంచే ఉచిత తాయిలాలే ఫలితాన్ని తీవ్రంగా ప్రభావితం చేసినా ఆశ్చర్యం లేదు. ఎందుకంటే, మగవాళ్లకు సైతం బస్సుల్లో ఫ్రీజర్నీ ప్రకటించి.. ఓటు మీద కర్చీఫ్ వేసుకుంది అన్నాడీఎంకే.
ప్రాంతీయ పార్టీల హవా పరిమితం కావడం, బీజేపీ బ్యాక్‌డోర్ పాలిటిక్స్‌తో యాక్టివ్ రోల్ ప్లేచేయడం, నాయకుల ఇష్టారీతిన పార్టీలు మారడం.. టోటల్‌గా 70 ఏళ్లలో ఎన్నడూ లేనంత ఆసక్తిగా మారాయి తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు. ఇడ్లీ-సాంబార్ పాలిటిక్స్‌లో ఇది నయా లుక్.. నయా టేస్ట్.



