AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: బీఆర్ఎస్‎తో కటీఫ్.. కాంగ్రెస్ వైపు చూస్తున్న కమ్యూనిస్టు పార్టీలు

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఇప్పటికే అధికార, విపక్ష పార్టీలు తమ వ్యూహాలు రచిస్తున్నాయి. ఇటీవలే ముఖ్యమంత్రి కేసీఆర్ 119 నియోజకవర్గాలకు 115 నియోజవర్గాల అభ్యర్థుల్ని ప్రకటించేశారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీలు సైతం తమ పార్టీల కోసం అభ్యర్థుల్ని వెతికే పనిలో పడ్డాయి. అయితే గతంలో కమ్యూనిస్టుల వైపు ఉన్న కేసీఆర్ ఇప్పుడు వారికి దూరంగా జరిగారు. దీంతో కమ్యూనిస్టులు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నట్లు తెలుస్తోంది.

Telangana: బీఆర్ఎస్‎తో కటీఫ్.. కాంగ్రెస్ వైపు చూస్తున్న కమ్యూనిస్టు పార్టీలు
Cpi, Cpi(m) Flags
Aravind B
|

Updated on: Aug 24, 2023 | 9:47 AM

Share

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఇప్పటికే అధికార, విపక్ష పార్టీలు తమ వ్యూహాలు రచిస్తున్నాయి. ఇటీవలే ముఖ్యమంత్రి కేసీఆర్ 119 నియోజకవర్గాలకు 115 నియోజవర్గాల అభ్యర్థుల్ని ప్రకటించేశారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీలు సైతం తమ పార్టీల కోసం అభ్యర్థుల్ని వెతికే పనిలో పడ్డాయి. అయితే గతంలో కమ్యూనిస్టుల వైపు ఉన్న కేసీఆర్ ఇప్పుడు వారికి దూరంగా జరిగారు. దీంతో కమ్యూనిస్టులు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నట్లు తెలుస్తోంది. బీజేపీ, అలాగే బీఆర్ఎస్ పార్టీని ఓడించే సత్తా ఉన్నటువంటి ఆ పార్టీతో జత కట్టలాని భావిస్తున్నారు. ఇప్పుడు బీఆర్ఎస్‌తో పొత్తు వికటించిన నేపథ్యంలో కాంగ్రెస్‌తో కలవాలని కమ్యూనిస్టు నాయకులు నిర్ణయం తీసుకుంటున్నట్లు సమాచారం. అలాగే దేశంలో ఇండియా కూటమిలో కూడా కాంగ్రెస్, కమ్యూనిస్టులు ఉన్న సంగతి తెలిసిందే.

అయితే కాంగ్రెస్ పార్టీ స్వయంగా ఆహ్వానిస్తేనే ముందుకు సాగాలని.. అప్పటిదాకా వేచి ఉండాలని వారు సూత్రప్రాయకంగా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. పొత్తుల విషయంలో ప్రజల్లో పలచన కాకుండేలా జాగ్రతపడి హుందాగా ముందుకు వెళ్లాలనేది కమ్యూనిస్టుల అభిప్రాయం. దేశంలోనూ, రాష్ట్రంలోనూ బీజేపీని ఓడించే లక్ష్యంగా లెఫ్ట్‌ పార్టీలు పనిచేస్తున్నాయి. మరోవైపు దేశంలో మతోన్మాదం పెరుగుతున్నందు వల్ల, బీజేపీకి అడ్డుకట్ట వేసేటటువంటి పార్టీలు ఏవైనా సరే వాటితోనే ముందుకు వెళ్లాలని నిర్ణయించాయి. అయితే దాని ప్రకారమే ఎన్నికల్లో పొత్తులు పెట్టుకుంటున్నారు కమ్యూనిస్టు నేతలు. గత ఏడాది మునుగోడు ఉపఎన్నిక సందర్భంగా బీజేపీకి అడ్డుకట్ట వేసే శక్తి బీఆర్‌ఎస్‌కే ఉందని భావించి ఆ పార్టీతో సీపీఐ, సీపీఎం పార్టీలు పొత్తుపెట్టుకున్నాయి. అయితే అప్పుడు వాటి ఓట్లతోనే బీఆర్‌ఎస్‌ పార్టీ గట్టెక్కిందన్న విషయం అందరికీ తెలిసిందే.

ఇక మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా కూడా ముఖ్యమంత్రి కేసీఆర్‌ కమ్యూనిస్టులతో పొత్తు కొనసాగుతుందని అన్నారు. ఖమ్మంలో జరిగిన సభలో కూడా సీపీఐ జాతీయ ప్రధానకార్యదర్శి డి.రాజా, సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు, కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్, ఆ పార్టీల రాష్ట్ర కార్యదర్శులు కూనంనేని సాంబశివరావు, తమ్మినేని వీరభద్రం కూడా పాల్గొని తమ ఐక్యతను చాటిచెప్పారు. కానీ సీఎం కేసీఆర్‌ తమను మోసం చేశారని కమ్యూనిస్టులు మండిపడుతున్నారు. బీఆర్‌ఎస్‌తో కమ్యూనిస్టుల పొత్తుకు బ్రేక్‌ పడడంతో కాంగ్రెస్‌ పార్టీ ప్రస్తుత పరిణామాలను నిశితంగా పరిశీలిస్తోంది. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, కమ్యూనిస్టులు కలిసి పోటీ చేస్తే అధికారం ఖాయం. కాబట్టి మీరు మావైపు రండి. మీరు అడిగినన్ని సీట్లు ఇస్తామని కూడా గతంలో కాంగ్రెస్‌ నాయకులు లెఫ్ట్‌ నాయకులతో అన్నారు. అప్పుడు కాంగ్రెస్‌ ఆహ్వానాన్ని లెఫ్ట్‌ పార్టీలు పట్టించుకోలేదు. అయితే ఇప్పుడు కాంగ్రెస్‌ ఎలాంటి వైఖరి అనుసరిస్తుందో చూడాలని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఒకవేళ కమ్యూనిస్టులతో పొత్తు పెట్టుకోకుంటే.. బీఆర్‌ఎస్‌ వ్యతిరేక ఓట్లు చీలిపోతాయని, దీనివల్ల మళ్లీ బీఆర్ఎస్ పార్టీకి ప్రయోజనం కలుగుతుందని చెబుతున్నారు. ఏది ఏమైనా కూడా ఈసారి బీఆర్‌ఎస్‌ తీరును తీవ్రంగా ఎండగట్టాలని లెఫ్ట్‌ పార్టీలు భావిస్తున్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి