Summer Health Tips: రోజు రోజుకీ పెరుగుతున్న ఎండలు.. వ్యాధుల బారిన పడే ప్రమాదం.. మిమ్మల్ని మీరు ఎలా రక్షించుకోవాలంటే
వేసవి కాలం వచ్చేసింది. రోజు రోజుకీ ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. దీంతో ప్రతి ఒక్కరూ అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం ఉంది. అయితే మనం కొంచెం తెలివిగా, జాగ్రత్తగా వ్యవహరిస్తే ఎటువంటి వ్యాధుల బారిన పడకుండా నివారించుకుని వేసవిని ఎంజాయ్ చేయవచ్చు. అటువంటి పరిస్థితిలో వేసవి తాపం నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి కొన్ని చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. అవి ఏమిటంటే..

ఎండ వేడి పెరిగి సూర్యుడు ఉష్ణోగ్రత పెరిగినప్పుడు వచ్చే మొదటి ప్రమాదం వడదెబ్బ. ముఖ్యంగా మనం మధ్యాహ్నం తలను కప్పుకుని బయటకు వెళ్ళాలి. లేదంటే మన శరీర ఉష్ణోగ్రత బాగా పెరుగుతుంది. శరీర సమతుల్యత దెబ్బతింటుంది. దీని కారణంగా తలతిరగడం, తలనొప్పి, వాంతులు, బలహీనత వంటి సమస్యలు మొదలవుతాయి. దీన్ని నివారించడానికి ఉత్తమ మార్గం ఏమిటంటే మధ్యాహ్నం 12 నుంచి 4 గంటల మధ్య బయటకు వెళ్లవద్దు. తప్పని సరిగా బయటకు వెళ్లాల్సి వస్తే తలపై టోపీ లేదా టవల్ ధరించి, గొడుగు తీసుకెళ్లండి. నీరు పుష్కలంగా త్రాగండి. మజ్జిగ, నిమ్మరసం, కొబ్బరి నీరు వంటి ద్రవాలను తీసుకుంటూ ఉండండి.
డీహైడ్రేషన్ అంటే శరీరంలో నీరు లేకపోవడం
వేసవిలో ఎక్కువగా చెమట పడుతుంది. దీనివల్ల శరీరంలో నీరు, ఉప్పు లోపం ఏర్పడుతుంది. దీని ప్రభావం వలన తరచుగా దాహం వేస్తుంది. నోరు ఎండిపోతుంది. తల తిరగడం ప్రారంభమవుతుంది. కొన్నిసార్లు మూత్రం రంగు ముదురు రంగులోకి మారుతుంది లేదా మూత్రం వెళ్ళే పరిమాణం తగ్గుతుంది. ఈ సమస్యను నివారించడానికి దాహం వేయకపోయినా సరే రోజంతా కొద్ది కొద్దిగా నీరు త్రాగుతూ ఉండండి. దీనితో పాటు, మజ్జిగ, కొబ్బరి నీళ్లు, పుచ్చకాయ, కీర దోసకాయ వంటివి తినడం వల్ల శరీరానికి నీరు, చల్లదనం లభిస్తుంది.
వేసవిలో ఫుడ్ పాయిజనింగ్ కేసులు పెరుగుతాయి.
ఈ సీజన్‌లో ఫుడ్ పాయిజనింగ్ జరిగే ప్రమాదం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే వేడికి ఆహారం త్వరగా చెడిపోతుంది. బ్యాక్టీరియా వేగంగా వ్యాపిస్తుంది. పానీ పూరీ, చాట్ లేదా స్ట్రీట్ ఫుడ్ ఆహారం.. అంటే బహిరంగంగా ఉంచిన ఆహారాన్ని తినడం వల్ల కడుపు నొప్పి వస్తుంది. ఒకొక్కసారి వాంతులు, విరేచనాలు, కడుపు నొప్పి వంటి సమస్యల బారిన పడే అవకాశం కూడా ఉంది. అందువల్ల ఇంట్లో అప్పటికప్పుడు చేసిన తాజా ఆహారాన్ని మాత్రమే తినడానికి ప్రయత్నించండి. కూరగాయలు, పండ్లను బాగా కడిగిన తర్వాత మాత్రమే ఉపయోగించండి. రిఫ్రిజిరేటర్‌లో ఉంచిన నిల్వ ఆహారానికి వీలైనంత దూరంగా ఉండండి.
కొంచెం జాగ్రత్తగా ఉంటే ఈ సమస్యలను నివారించవచ్చు
పగలు పుష్కలంగా నీరు త్రాగండి. ఎండలో బయటకు వెళ్లకుండా వీలైంత వరకూ ఇంట్లోనే ఉండండి. పరిశుభ్రతపై పూర్తి శ్రద్ధ వహించండి. తేలికైన ఆహారం తినండి. శరీరానికి విశ్రాంతి ఇవ్వండి. పిల్లలు, వృద్ధుల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించండి. ఎందుకంటే వీరు త్వరగా అనారోగ్యానికి గురవుతారు. ఎండలకు భయపడాల్సిన అవసరం లేదు.. అప్రమత్తంగా ఉంటే సరిపోతుంది.
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)




