కరోనా వ్యాక్సినేషన్‌పై పార్లమెంటరీ కమిటీ కీలక సిఫార్సులు.. ప్రైవేట్ ఆస్పత్రుల తీరుపై ఆసహనం..!

దేశంలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతుంది. రెండు విడతలోనూ వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతుంది. మరోవైపు కరోనా నుంచి విముక్తి కలిగించేందుకు తుది దశ ప్రయోగాలు చివరి అంకానికి చేరుకున్నాయి

కరోనా వ్యాక్సినేషన్‌పై పార్లమెంటరీ కమిటీ కీలక సిఫార్సులు.. ప్రైవేట్ ఆస్పత్రుల తీరుపై ఆసహనం..!
Follow us
Balaraju Goud

|

Updated on: Dec 21, 2020 | 10:17 PM

దేశంలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతుంది. రెండు విడతలోనూ వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతుంది. మరోవైపు కరోనా నుంచి విముక్తి కలిగించేందుకు తుది దశ ప్రయోగాలు చివరి అంకానికి చేరుకున్నాయి. అటు, కొత్తగా బ్రిటన్ కేంద్రం స్ట్రెయిన్ వైరస్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో దేశం వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి ఒత్తిడి పెరుగుతుంది. దీంతో వ్యాక్సినేషన్‌పై ఏర్పాటైన పార్లమెంటరీ కమిటీ కేంద్ర ప్రభుత్వానికి కీలక సూచనలు చేసింది.

పూర్తిస్థాయిలో ప్రయోగాలు పూర్తయ్యాక నిశితంగా పరిశీలించి, సరైన శాంపిల్ పరిమాణంలో ఏ టీకాకైనా అత్యవసర వినియోగం ద్వారా అనుమతి ఇవ్వాలని పార్లమెంటరీ కమిటీ ప్రభుత్వానికి సూచించింది. కాంగ్రెస్‌ సీనియర్‌ నేత ఆనంద్‌ శర్మ నేతృత్వంలో ఏర్పాటైన పార్లమెంటరీ కమిటీ రూపొందించిన నివేదికలో తాజా అంశాలను ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. దేశంలో అత్యవసర వినియోగ అనుమతిని సెంట్రల్‌ డ్రగ్స్‌ స్టాండర్డ్ కంట్రోల్‌ ఆర్గనేజైషన్‌ ఇప్పటివరకు ఎవ్వరికీ అనుమతివ్వలేదని కమిటీ గుర్తుచేసింది. అయితే, అన్ని దశల క్లినికల్‌ ప్రయోగాలు పూర్తై, నిశితంగా పరిశీలన, నిపుణుల సంప్రదింపుల తర్వాతే ఏదైనా వ్యాక్సిన్‌కు అనుమతి ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరింది. అత్యంత అరుదైన సందర్భాల్లో మాత్రమే ఇలాంటి విధానాన్ని వినియోగించుకోవాలని పార్లమెంటరీ కమిటీ అభిప్రాయపడింది.

కరోనా విజృంభణ సమయంలో ప్రభుత్వ ఆసుపత్రులే ప్రజల ప్రాణాలకు రక్షణగా నిలిచారని.. ప్రైవేటు ఆసుపత్రులు మాత్రం సామాన్యులకు అందుబాటులో లేకుండాపోయాయని పార్లమెంటరీ కమిటీ నివేదికలో పేర్కొంది. వ్యాక్సిన్ అందించే సమయంలోనూ ప్రైవేటు ఆసుపత్రులపై నియంత్రణ ఉండాల్సిన అవసరముందని కమిటీ తెలిపింది. ప్రైవేటు ఆసుప్రతులపై పర్యవేక్షణ కొనసాగించడంతో పాటు మందులు బ్లాక్‌మార్కెట్‌కు తరలిపోకుండా ఉండేందుకు ఓ సమగ్ర ప్రజారోగ్య చట్టం తీసుకురావాలని రాజ్యసభ ఛైర్మన్‌, ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడుకి అందించిన నివేదికలో పార్లమెంటరీ కమిటీ వెల్లడించింది. వీటితో పాటు తక్కువ ధరలకు లభించే ఔషధాల గురించి ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించింది. అంతేకాకుండా సమాజంలో అట్టడుగు వర్గాల వారికి తక్కువ ధరకు లేదా సబ్సిడీతో కూడిన మందులను అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కమిటీ తమ నివేదికలో వెల్లడించింది.

కరోనా వ్యాక్సిన్‌ అత్యవసర వినియోగంపై ఇప్పటికే మూడు సంస్థలు కేంద్ర నియంత్రణ సంస్థలకు దరఖాస్తు చేసుకున్న సమయంలోనే తాజా నివేదిక వెల్లడి కావడం గమనార్హం. ఇప్పటికే తాము అభివృద్ధిచేసిన కరోనా వ్యాక్సిన్‌ను భారత్‌లో అత్యవసర వినియోగానికి అనుమతి ఇవ్వాలని కోరుతూ భారత్‌ బయోటెక్‌, సీరం ఇన్‌స్టిట్యూట్‌, ఫైజర్‌ సంస్థలు డ్రగ్స్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియాకు దరఖాస్తు చేసుకున్నాయి. ఇవి అందించిన టీకా ప్రయోగాల సమాచారాన్ని సెంట్రల్‌ డ్రగ్స్‌ స్టాండర్డ్ కంట్రోల్‌ ఆర్గనేజైషన్‌(సీడీఎస్‌సీఓ) విశ్లేషిస్తోంది. త్వరలోనే ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో కమిటీ నివేదికను బట్టి కేంద్ర ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందో ఇప్పడు ఆసక్తికరంగా మారింది.