Aishwarya Rai: స్టార్డమ్ ఉన్నప్పటికీ ఐశ్వర్య రాయ్ ఎందుకు వెనకబడిందో తెలుసా?
మిస్ వరల్డ్ కిరీటం మొదలు బాలీవుడ్, హాలీవుడ్ వరకు తనదైన ముద్ర వేసిన నటి ఐశ్వర్య రాయ్ బచ్చన్. మూడు దశాబ్దాలకు పైగా సినీ పరిశ్రమలో కొనసాగుతున్నా, ఆమె కెరీర్ ఎంపికలు ఎప్పుడూ ఊహించని విధంగా ఉంటాయి. భారీ కమర్షియల్ సినిమాల తర్వాత వెంటనే ..

మిస్ వరల్డ్ కిరీటం మొదలు బాలీవుడ్, హాలీవుడ్ వరకు తనదైన ముద్ర వేసిన నటి ఐశ్వర్య రాయ్ బచ్చన్. మూడు దశాబ్దాలకు పైగా సినీ పరిశ్రమలో కొనసాగుతున్నా, ఆమె కెరీర్ ఎంపికలు ఎప్పుడూ ఊహించని విధంగా ఉంటాయి. భారీ కమర్షియల్ సినిమాల తర్వాత వెంటనే ప్రయోగాత్మక చిత్రాలు చేయడం, పెద్ద గ్యాప్ తీసుకోవడం… ఇలాంటి నిర్ణయాలు ఆమె ఎందుకు తీసుకుంటారు?
కెరీర్‌లో వెనక పడిపోతామనే భయం లేదా? స్టార్ డమ్‌లో ఉన్న ఏ నటి అయినా అనుకోకుండా తీసుకునే ఇలాంటి నిర్ణయాల వెనుక దాగి ఉన్ననిజమైన మానసిక బలం ఏమిటనేది అందరిలో ఆసక్తిని పెంచే ప్రశ్న. ఈ అన్ని ఊహాగానాలకు తెరదించుతూ, ఐశ్వర్య రాయ్ బచ్చన్ ఇటీవల జరిగిన రెడ్ సీ ఫిల్మ్ ఫెస్టివల్ 2025లో తన మనసులోని మాటను బయటపెట్టారు.
అభద్రత కాదు..
రెడ్ సీ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఐశ్వర్య రాయ్ మాట్లాడుతూ, తన కెరీర్ ఎంపికల వెనుక ఉన్న ప్రధాన సూత్రాన్ని స్పష్టం చేశారు. ‘నాకు అభద్రతా భావం ఉండదు. అది నా నిజమైన వ్యక్తిత్వంలో ఒక భాగం.’అంటూ చెప్పుకొచ్చారు. తన ప్రయాణాన్ని స్పష్టత, నమ్మకంతో కూడిన వైఖరితోనే ప్రారంభించినట్లు తెలిపారు. ఇతరులు చెప్పే మాటలు, వారి అంచనాలు తన నిర్ణయాలను ఎప్పుడూ ప్రభావితం చేయలేవని ఆమె వివరించారు.
ఈ స్పష్టతకు నిదర్శనంగా, ఆమె తన కెరీర్‌లోని ఒక ముఖ్యమైన ఉదాహరణను పంచుకున్నారు. ‘దేవదాస్’ వంటి భారీ, గ్రాండ్ సక్సెస్ తర్వాత, అంతకంటే పెద్ద ప్రాజెక్టును ఎంచుకోవచ్చని అందరూ భావించారు. కానీ ఆమె వెంటనే దర్శకుడు రితుపర్ణో ఘోష్ ‘చోఖర్ బాలి’ వంటి చిన్న, కథాబలం ఉన్న ప్రయోగాత్మక సినిమాను ఎంచుకున్నారు. ‘ఆ కథలోని అందం నన్ను ఆకర్షించింది, అందుకే ఆ సినిమా చేయాలనిపించింది తప్ప, అభద్రత కారణం కాదు’ అని చెప్పుకొచ్చింది ఐశ్వర్య.
ఐశ్వర్య రాయ్ వ్యక్తిత్వం కేవలం సినిమా ఎంపికలకే పరిమితం కాలేదు. ఆమె సోషల్ మీడియాలో కూడా చాలా పరిమితమైన, సాధారణమైన ప్రెజెన్స్ మెయింటైన్ చేస్తారు. ఈ విషయంలో ఆమె తనను తాను ‘క్వైట్ రెబెల్’ గా అభివర్ణించుకున్నారు.
‘మీరు అంగీకారాన్ని పొందడానికి ఇలా ఉండాలి అని మిమ్మల్ని మీరు మోసం చేసుకోకండి. దయచేసి దాని నుంచి స్వేచ్ఛ పొందండి,’ అని ప్రేక్షకులకు ఒక ఉదాహరణగా చెప్పడానికే తాను సోషల్ మీడియాలో నిరాడంబరంగా ఉంటానంటోంది ఐష్. తన సినీ ప్రయాణంలో సాధించిన ప్రతి విజయం, ఆమె ఆత్మవిశ్వాసం, అంతర్గత స్పష్టత మరియు ఏ బాహ్య అంశాలకూ లొంగని ధైర్యం నుంచే వచ్చిందని ఐశ్వర్య మాటల ద్వారా స్పష్టమవుతోంది.




