ఈ చిన్న టిప్స్‌తో యూత్ లుక్ గ్యారెంటీగా మీ సొంతం.. ట్రై చేసి చూడండి
వయసు పెరుగుతున్న కొద్దీ చర్మం నిగారింపు తగ్గడం, ముడతలు రావడం, త్వరగా అలసిపోవడం వంటి మార్పులు సహజం. అయితే ఖరీదైన క్రీములు, చికిత్సలు, మందులు లేకుండానే వృద్ధాప్యాన్ని సహజంగా నెమ్మదింప చేయవచ్చని తాజా అధ్యయనాలు చెపుతున్నాయి. మనం ప్రతి రోజు ఉదయాన్ని ఎలా ప్రారంభిస్తామన్నదే ..

వయసు పెరుగుతున్న కొద్దీ చర్మం నిగారింపు తగ్గడం, ముడతలు రావడం, త్వరగా అలసిపోవడం వంటి మార్పులు సహజం. అయితే ఖరీదైన క్రీములు, చికిత్సలు, మందులు లేకుండానే వృద్ధాప్యాన్ని సహజంగా నెమ్మదింప చేయవచ్చని తాజా అధ్యయనాలు చెపుతున్నాయి. మనం ప్రతి రోజు ఉదయాన్ని ఎలా ప్రారంభిస్తామన్నదే మన ఆరోగ్యంపై, చర్మంపై చాలా పెద్ద మార్పును తీసుకువస్తుంది. మరి, వృద్ధాప్యాన్ని దూరం చేసి, చర్మం కాంతివంతంగా ఉండేలా చేసే చిన్నచిన్న చిట్కాలేంటో తెలుసుకుందాం..
సూర్యరశ్మితో రోజంతా శక్తి
ఉదయాన్నే లేవగానే ఫోన్ చూడటం చాలామందికి అలవాటు. కానీ దాని బదులు, లేవగానే కిటికీ తెరిచి బయట నుంచి వచ్చే సూర్యరశ్మిని మీ చర్మానికి తగిలేలా చేస్తే అది శరీరానికి చాలా మంచిది. సూర్యరశ్మి మన శరీరం యొక్క జీవ గడియారాన్నిసరిగ్గా అమరుస్తుంది. దీనివల్ల నిద్ర బాగా పడుతుంది, మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఉదయం ఐదు నిమిషాలైనా సూర్యరశ్మిని ముఖానికి తగలనివ్వడం అలవాటు చేసుకుంటే చర్మం కూడా కాంతివంతంగా ఉంటుంది.
వేడి నీళ్లు లేదా హెర్బల్ టీ
ఉదయాన్నే వేడి నీళ్లు తాగడం వల్ల వృద్ధాప్యం నెమ్మదిస్తుంది. వేడి నీళ్లు రక్తప్రసరణను మెరుగుపరుస్తాయి. శరీరంలో పేరుకుపోయిన వ్యర్థాలను బయటికి పంపిస్తాయి. అల్లం టీ, గ్రీన్ టీ, నిమ్మకాయ, తేనె కలిపిన పానీయాలు కూడా శరీరానికి శుభ్రతను, చురుకుదనాన్ని ఇస్తాయి. ఉదయం ఇలా తేలికైన ద్రవం తీసుకోవడం వల్ల కడుపుబ్బరం తగ్గి, చర్మం లోపలి నుంచి కాంతివంతంగా ఉంటుంది.
నీళ్లు తాగాక లేదా లేవగానే కేవలం ఒక్క నిమిషం పాటు శరీరాన్ని నెమ్మదిగా కదిలించడం చాలా మంచి అలవాటు. దీనిని ‘మొబిలిటీ మినిట్’ అంటారు. మోకాళ్లు, చేతులు, మెడ, వెన్ను భాగాలను నెమ్మదిగా కదుపుతూ ఉంటే, శరీరంలో బిగుతుదనం (స్టిఫ్‌నెస్) తగ్గుతుంది. కండరాలు సడలుతాయి. ఈ చిన్న కదలిక శరీరానికి తక్షణమే ఉత్సాహాన్ని ఇస్తుంది.
మాంసకృత్తులతో నిండిన అల్పాహారం
మీ రోజు ఎలా గడుస్తుందో మీ అల్పాహారంపై ఆధారపడి ఉంటుంది. ఉదయాన్నే మాంసకృత్తులు (ప్రోటీన్) ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకుంటే శరీరం రోజంతా శక్తివంతంగా ఉంటుంది. గుడ్లు, వేరుశనగ వెన్న, పెరుగు, బాదం, ఓట్స్ వంటివి మంచి ఆహారాలు. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను కూడా అదుపులో ఉంచుతాయి, తద్వారా నిస్సత్తువ రాకుండా చేస్తాయి.
లేవగానే చాలామంది చేసే అత్యంత హానికరమైన పని ఫోన్ చూడటం. నిపుణుల ప్రకారం, ఫోన్ స్క్రీన్‌ను ఉదయం చూడటం వల్ల మన జీవ గడియారానికి అంతరాయం కలుగుతుంది. మానసిక ఒత్తిడి పెరుగుతుంది, ఏకాగ్రత తగ్గుతుంది. అంతేకాక, ఇది వృద్ధాప్యాన్ని వేగంగా తీసుకొచ్చే హార్మోన్లలో అసమతుల్యతకు కారణమవుతుంది.
కాబట్టి, ఉదయం లేచిన వెంటనే కాకుండా, కనీసం 20 నిమిషాల గ్యాప్ ఇచ్చిన తర్వాత ఫోన్ చూడటం మంచిది. ఆ సమయంలో నీళ్లు తాగడం, స్వల్ప వ్యాయామం చేయడం వంటివి చేయండి. ఖరీదైన సౌందర్య సాధనాలు కాకుండా, ఈ చిన్న చిన్న అలవాట్లను ప్రతి ఉదయం క్రమంగా పాటించడం ద్వారా వృద్ధాప్య లక్షణాలను సహజంగా నియంత్రించవచ్చు. ఈ అలవాట్లు మీ ఆరోగ్యాన్ని, చర్మాన్ని దీర్ఘకాలం కాపాడుతాయి.




