Betting Apps case: ‘వారు ఫోన్ చేసి బెదిరిస్తున్నారు.. చంపేస్తామంటున్నారు’.. వీడియో రిలీజ్ చేసిన అన్వేష్
ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్స్ బాగోతాన్ని బయట పెట్ట ఒక్కసారిగా హీరోగా మారిపోయాడు ప్రపంచ యాత్రికుడు, నా అన్వేషణ ఫేమ్ అన్వేష్. వీటిని ప్రమోట్ చేసిన పలువురు సెలబ్రిటీల పేర్లను ఆధారాలతో సహా బయట పెట్టడంతో ఈ యూట్యూబర్ పేరు నెట్టింట తెగ మార్మోగిపోతోంది.

ఆన్ లైన్ బెట్టింగ్ యాప్స్ పై ఎప్పటి నుంచో పోరాటం చేస్తున్నాడు టూరిస్ట్ వ్లాగర్ అన్వేష్. అయితే ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తో అతని మీటింగ్ తర్వాతే ఈ వ్యవహారం గురించి అందరికీ తెలిసింది. దీనిపై హైదరాబాద్ పోలీసులు కూడా సీరియస్ గా వ్యవహరిస్తున్నారు. ఆన్ లైన్ బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేసిన సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్లు, యూట్యూబర్లు, సినీ ప్రముఖులపై కేసులు నమోదు చేసి విచారిస్తున్నారు. ఇప్పటికే చాలామంది సినీ సెలబ్రిటీలు విచారణకు హాజరయ్యారు. అలాగే హీరోలు, హీరోయిన్లు కూడా ఈ విషయంపై తమ వివరణ ఇచ్చారు.
.యూట్యూబర్ గా, ప్రపంచ యాత్రికుడిగా, నా అన్వేషణ అంటూ విదేశాలు తిరుగుతూ.. తన మాటలతో , కామెడీతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించడమే కాకుండా.. పలు విషయాలతో అందరినీ ఆలోచింపచేసే యూట్యూబర్ అన్వేష్ గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ చేస్తున్న వారిపై విమర్శలు గుప్పిస్తూ.. మరింత పాపులారిటీ సొంతం చేసుకున్నారు. ఇలాంటి ఈయనకు ఇప్పుడు చంపేస్తామని బెదిరింపు కాల్స్ వస్తున్నాయట. తాజాగా ఇన్స్టాగ్రామ్ ద్వారా ఈ ఒక వీడియోని పంచుకున్న అన్వేష్.. తనను కాపాడండి అని అనడం మానేసి.. దమ్ముంటే రండి అంటూ సవాలు విసురుతున్నాడట. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం. మొత్తానికి ఆన్ లైన్ బెట్టింగ్స్ పై పోరాటంతో ఒక్కసారిగా హీరోగా మారిపోయాడు అన్వేష్. సోషల్ మీడియా వేదికగా అతనికి పెద్ద ఎత్తున మద్దతు కూడా లభించింది. అయితే ఇదే సమయంలో ఈ ప్రపంచ యాత్రికుడిపై కొంతమంది తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బెట్టింగ్ యాప్స్ పై పోరాటం చేస్తున్న క్రమంలో అన్వేష్ మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నాడనే ఆరోపణలు చేస్తున్నారు. ఇటీవల పరేషాన్ బాయ్స్ ఫేమ్ ఇమ్రాన్ ఖాన్ ఇదే విషయంపై ఒక వీడియోను రిలీజ్ చేశాడు. తన తల్లిని ఉద్దేశిస్తూ అన్వేష్ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశాడని, సీఎం రేవంత్ రెడ్డి ఈ విషయంపై దృష్టి సారించాలని వీడియోలో కన్నీళ్లు పెట్టుకున్నాడు.
ఇమ్రాన్ ఖాన్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మహిళల విషయంలో అన్వేష్ చేసిన కామెంట్స్ ను చాలామంది తప్పు పట్టారు. బెట్టింగ్ ప్రమోటర్స్ పై పోరాటం లో తప్పులేదు.. కానీ వారి కుటుంబ సభ్యుల పేర్లు తీస్తూ కామెంట్లు చేయడం ఏమాత్రం సబబు కాదు అంటూ అన్వేష్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఈ క్రమంలోనే కొందరు అన్వేష్ పై కేసులు పెడతామని, ఇండియాకు రాగానే అరెస్ట్ చేస్తామని కూడా హెచ్చరిస్తున్నారట. ఈ విషయాన్ని అతనే బయట పెట్టాడు. తాజాగా సోషల్ మీడియాలో మరో వీడియోను రిలీజ్ చేశాడు అన్వేష్. ఆన్ లైన్ బెట్టింగ్ యాప్స్ పై పోరాటం ఆపకపోతే తనను చంపేస్తామని కొంతమంది బెదిరిస్తున్నారంటూ ఈ వీడియోలో వాపోయాడు అన్వేష్. అయితే తాను మాత్రం వెనక్కి తగ్గేది లేదని, దమ్ముంటే రండి అంటూ సవాల్ విసిరాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.