Jani Master: మళ్లీ బిజీ అవుతోన్న జానీ మాస్టర్.. ఆ స్టార్ హీరో సినిమాతో తెలుగులో రీ ఎంట్రీ
తన దగ్గర పనిచేసే ఓ లేడీ కొరియోగ్రాఫర్ పై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడన్న ఆరోపణలతో జైలు పాలయ్యాడు టాలీవుడ్ స్టార్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్. రిమాండ్ ఖైదీగా సుమారు నెల రోజుల పాటు జైలు జీవితం గడిపిన అతను బెయిల్ పై బయటకు వచ్చాడు.

లైంగిక వేధింపుల ఆరోపణలు, జైలు జీవితం, బెయిల్.. ఇలా గతేడాది వరుసగా వార్తల్లో నిలిచాడు జానీ మాస్టర్. ఇందులో తప్పొప్పులు ఎవరివన్న సంగతి ఇప్పటివరకు తెలియదు కానీ.. ఈ వ్యవహారంతో జానీ మాస్టర్ తీవ్రంగా నష్టపోయాడు. పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ లోనూ క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొన్నాడు. అయితే ఇప్పుడిప్పుడే మళ్లీ సినిమాల్లో బిజీ అవుతున్నాడు జానీ మాస్టర్. బెయిల్ పై బయటకు వచ్చాక కొన్ని కన్నడ, హిందీ సినిమాలకు నృత్య రీతలు సమకూర్చాడీ కొరియోగ్రాఫర్. ఇక ఇప్పుడు తనకు ఎంతగానో గుర్తింపు తెచ్చిపెట్టిన టాలీవుడ్ లోకి మళ్లీ ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతున్నాడు. మాస్ మహారాజా రవితేజ, శ్రీలీల హీరో, హీరోయిన్లుగా నటిస్తోన్న చిత్రం మాస్ జాతర. భాను భోగవరపు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను నాగవంశీ నిర్మిస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, గ్లింప్స్ ఆడియెన్స్ విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇప్పుడు మాస్ జాతర సినిమాలోని ఒక మాస్ సాంగ్ కు జానీ మాస్టర్ కొరియోగ్రఫీ చేస్తున్నాడు. ఇటీవలే ఈ సాంగ్ షూట్ పూర్తి అయినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే సాంగ్ షూట్ పూర్తి అయ్యాక శ్రీలీల.. జానీ మాస్టర్ కు థాంక్స్ చెప్తూ బొకేను పంపించింది. దీంతో శ్రీలీలకు సోషల్ మీడియా వేదికగా థాంక్స్ చెప్పుకొచ్చాడు జానీ మాస్టర్
‘ థాంక్యూ శ్రీలీల గారు. మీతో కలిసి వర్క్ చేయడం ఎంతో అద్భుతం. మాస్ జాతరలో మీరు, రవితేజ గారు కలిసి చేసిన మాస్ స్టెప్స్ చూడడానికి మేము అందరం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం’ అంటూ కొన్ని వర్కింగ్ స్టిల్స్ ను షేర్ చేశాడు జానీ మాస్టర్. ఇందులో శ్రీలీల లంగాఓణిలో ఎంతో అందంగా కనిపించింది. ప్రస్తుతం ఈ మాస్ జాతర ఫొటోలు నెట్టింట వైరల్ గా మారాయి. వీటిని చూసి నెటిజన్లు భిన్న రకాలుగా స్పందిస్తున్నారు. జానీ మాస్టర్ మళ్లీ సినిమాల్లో బిజీ కావాలని కోరుకుంటూ కామెంట్స్ పెడుతున్నారు.
జానీ మాస్టర్ పోస్ట్..
Thank you @Sreeleela14 garu 😇 Working with you has been a wonderful experience. Looking forward to the day that everyone witnesses your dynamic energy & expressions in our song of #MassJathara besides Mass Maharaha @RaviTeja_offl Sir 🤩@SitharaEnts @Fortune4Cinemas pic.twitter.com/eK3t0hS8jZ
— Jani Master (@AlwaysJani) July 14, 2025
కాగా ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న మాస్ జాతర సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.








