AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mohan Babu : కలెక్షన్ కింగ్ 50 ఏళ్ల సుధీర్ఘ ప్రయాణం.. హీరోగా, నిర్మాతగా సినీరంగంలో మోహన్ బాబు..

మోహన్ బాబు... తెలుగు సినీ పరిశ్రమలో పరిచయం అవసరంలేని పేరు. ఎన్నో విభిన్నమైన చిత్రాలు, వైవిధ్యమైన పాత్రలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. నటుడిగా 50వ ఏటలోకి అడుగుపెట్టాడు డైలాగ్ కింగ్. పవర్ ఫుల్ స్క్రీన్ ప్రజెన్స్, పరిశ్రమకు చేసిన విశేషమైన సేవలతో మోహన్ బాబు ఐదు దశాబ్దాల సుదీర్ఘ ప్రయాణం ఇది.

Mohan Babu : కలెక్షన్ కింగ్ 50 ఏళ్ల సుధీర్ఘ ప్రయాణం.. హీరోగా, నిర్మాతగా సినీరంగంలో మోహన్ బాబు..
Mohan Babu
Praveen Vadla
| Edited By: |

Updated on: Nov 22, 2024 | 10:26 AM

Share

తెలుగు సినిమా పరిశ్రమలో మోహన్ బాబు నటుడిగా 50వ ఏటలోకి అడుగుపెట్టారు. పాత్రల వైవిధ్యం, పవర్‌ఫుల్ స్క్రీన్ ప్రెజెన్స్, పరిశ్రమకు చేసిన విశేషమైన సేవలతో మోహన్ బాబు గారి ఐదు దశాబ్దాల సుదీర్ఘ ప్రయాణం అంకితభావం, పట్టుదలకు నిదర్శనంగా నిలిచింది.

విలన్‌గా రాణించిన రోజులు

1975 నుంచి 1990 వరకు, మోహన్ బాబు గారు భారతీయ సినిమాల్లో విలన్ పాత్రకు కొత్త నిర్వచనాన్ని తీసుకువచ్చారు. దేశంలో అత్యధికంగా డిమాండ్ ఉన్న ప్రతినాయకులలో ఒకరిగా నిలిచిన ఆయన నటన ప్రేక్షకుల్లో చెరగని ముద్ర వేశారు. స్వర్గం నరకం చిత్రంతో పరిశ్రమకు హీరోగా పరిచయం అయినా.. విలన్ పాత్రలతో టాప్ స్థానాన్ని కైవసం చేసుకున్నారు. హీరోగా విజయ శిఖరాలు

ఇవి కూడా చదవండి

1990వ దశాబ్దంలో, మోహన్ బాబు గారు హీరోగా మారి ప్రేక్షకులను తనదైన శైలితో అలరించారు. అల్లుడు గారు, అసెంబ్లీ రౌడీ, పెదరాయుడు వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాలు ఆయనను స్థాయిని పెంచాయి. తెలుగు చిత్రాల్లో ఆయన నటించిన అనేక చిత్రాలు తరువాత హిందీ, తమిళ భాషల్లో రీమేక్ చేయబడి అక్కడ కూడా భారీ విజయాలు సాధించాయి. తద్వారా ఆయన పేరు జాతీయ స్థాయిలో వినిపించింది.

పెదరాయుడు విజయోత్సవాల్లో 200 రోజుల వేడుక తిరుపతిలో ఘనంగా నిర్వహించబడింది. ఈ చారిత్రక వేడుకకు మొత్తం రాష్ట్ర రాజకీయ కేబినెట్,ముఖ్యమంత్రి హాజరయ్యారు, ఇది భారతీయ సినిమా చరిత్రలో అత్యంత అరుదైన ఘట్టంగా నిలిచింది. ఈ కార్యక్రమానికి దాదాపు 10 లక్షల మంది హాజరయ్యారు. ఇది మోహన్ బాబు గారి క్రేజ్‌కు నిదర్శనం.

సినిమా, రాజకీయాల్లో కీలక ఘట్టంగా మేజర్ చంద్రకాంత్

మోహన్ బాబు గారి ప్రభావం సినిమాలపై మాత్రమే కాకుండా రాజకీయ రంగానికీ విస్తరించింది. 1993లో ఆయన నిర్మించిన మేజర్ చంద్రకాంత్ చిత్రం.. ఎన్.టి.రామారావు గారి తిరిగి ముఖ్యమంత్రి పదవి చేపట్టడంలో కీలక పాత్ర పోషించింది. ఈ చిత్ర 100 రోజుల వేడుక తిరుపతిలో ఘనంగా నిర్వహించారు. ఈ సభ సినిమా, రాజకీయ చరిత్రలో ఒక గొప్ప ఘట్టంగా నిలిచింది.

విద్యా రంగంలో విప్లవం

సినిమా రంగంలో విశేష విజయాలను సాధించిన మోహన్ బాబు గారు, విద్యా రంగంలోనూ విశేషమైన సేవలను అందించారు. 1992లో స్థాపించిన శ్రీ విద్యానికేతన్ విద్యా ట్రస్ట్ ద్వారా వేలాది మంది విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తున్నారు. మూడు దశాబ్దాలుగా 25% ఉచిత విద్య అందిస్తూ అనేక పేద విద్యార్థులకు అభివృద్ధి అవకాశాలను సృష్టించారు. 2022లో ప్రారంభమైన మోహన్ బాబు విశ్వవిద్యాలయం విద్య పట్ల వారి అంకితభావానికి నిలువుటద్దంగా నిలిచింది.

పురస్కారాలు, గౌరవాలు

మోహన్ బాబు గారు అనేక తన సుధీర్ఘమైన కెరీర్‌లో ఎన్నో గౌరవపురస్కారాలను అందుకున్నారు. 2007లో భారత ప్రభుత్వం పద్మశ్రీ ప్రదానం చేయగా, 2016 ఫిల్మ్‌ఫేర్ లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు ఆయన్ను వరించింది.

ఘనమైన వేడుకలు

ఈ చారిత్రక ఘట్టాన్ని మోహన్ బాబు తనయుడు విష్ణు మంచు గారు ప్రత్యేకంగా సెలెబ్రేట్ చేయబోతోన్నారు. 2024 డిసెంబర్ నుండి ప్రతి నెల ప్రత్యేక ఈవెంట్లను ప్రారంభిస్తారు. 2025 నవంబర్‌ వరకు ప్రతీ నెలా ఒకటో తేదీన ఈ ఈవెంట్‌లకు సంబంధించిన ప్రకటన వస్తుందని తెలిపారు.

డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప

విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’లో మోహన్ బాబు గారు మహాదేవ శాస్త్రిగా కనిపించనున్నారు. ఈ ప్రాజెక్ట్ ఆయన కెరీర్‌లో మరొక మైలురాయిగా నిలుస్తుంది.

సినిమా చరిత్రలో ఒక స్వర్ణ యుగం

సామాన్య వ్యక్తిగా మొదలై.. అసామాన్య వ్యక్తిగా మోహన్ బాబు ఎదిగిన తీరు అందరికీ ఆదర్శనీయం. సినిమా రంగంలో ఇన్నేళ్ల పాటు సేవలు అందిస్తూ వస్తున్నారు. నటుడిగానే కాకుండా నిర్మాతగానూ 75 చిత్రాలను నిర్మించారు. ఓ నటుడు ఇలా నిర్మాతగా మారి 75 చిత్రాలు నిర్మించడం అనేది ఇండియన్ ఫిల్మ్ హిస్టరీలో రికార్డ్. ఎక్కువ చిత్రాలు నిర్మించిన ఏకైక నటుడిగా ఆయన రికార్డులు నెలకొల్పారు. ఆయన సాధించిన విజయాలను తలచుకుంటూ ఈ సువర్ణ ఘట్టాన్ని ఘనంగా జరుపుకుందాం. 50 అద్భుత సంవత్సరాలకు మోహన్ బాబు గారికి శుభాభినందనలు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.