Tollywood: ఆస్తమా ఉన్నప్పటికీ చైన్ స్మోకర్‌లా మారిన హీరో.. రోజుకు 60 సిగరెట్లు.. కానీ ఆ ఒక్కరోజుతో..
నటుడు ఆదిత్య ఓం ఒకప్పుడు రోజుకు 60 సిగరెట్లు తాగేవారట. ఆస్తమా ఉన్నప్పటికీ 20-40 సిగరెట్లు పీల్చేవారట. ఇంజనీరింగ్ సమయంలో మొదలైన ఈ అలవాటును 2005లో కేవలం ఒక్క రోజులో వదిలేశారు. దృఢ సంకల్పంతోనే ఇది సాధ్యమైందని ఆయన వెల్లడించారు. ..

నటుడు ఆదిత్య ఓం తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఆశ్చర్యకరమైన వివరాలను వెల్లడిస్తూ, తాను గతంలో ధూమపాన వ్యసనాన్ని ఎలా అధిగమించానో వివరించారు. ప్రస్తుతం 50 సంవత్సరాల వయస్సులో ఉన్న ఆదిత్య, తన ఆరోగ్యం, ఫిట్‌నెస్ పట్ల అత్యంత క్రమశిక్షణతో ఉంటారు. వర్కౌట్స్, మంచి ఆహారం, డైటింగ్‌కు ప్రాధాన్యత ఇస్తూ, ఎలాంటి చెడు అలవాట్లు లేకుండా జీవిస్తున్నారు. ఈ డిసిప్లిన్ తన జీవితంలో చాలా ముఖ్యమని ఆయన నొక్కి చెప్పారు. అయితే, ఆయన గత జీవితం దీనికి భిన్నంగా ఉండేది. ఒకప్పుడు ఆదిత్య రోజుకు ఏకంగా 60 సిగరెట్లు సేవించేవారని తెలిసింది. మరింత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఆస్తమా పేషెంట్ అయినప్పటికీ, ఆయన నిత్యం 20 నుంచి 40 సిగరెట్లు తాగేవారు. ఈ అలవాటు ఇంజనీరింగ్ చదివే రోజుల్లో ప్రారంభమైంది. రాత్రిపూట చదువుకోవడానికి సిగరెట్లను ఆశ్రయించడం అలవాటుగా మారిందని, ఆ తర్వాత సినిమా పరిశ్రమలో కూడా ఇది కొనసాగిందని ఆయన వెల్లడించారు. సుమారు ఎనిమిది నుంచి తొమ్మిది సంవత్సరాలు ఈ ధూమపాన వ్యసనంతో గడిపిన ఆదిత్య ఓం జీవితంలో ఒక రోజు అకస్మాత్తుగా మార్పు వచ్చింది. 2005లో ఒకరోజు ఉదయం నిద్రలేవగానే, ఎటువంటి ప్రత్యేక కారణం లేదా ఇతరుల ఇన్‌ఫ్లూయన్స్ లేకుండా, తన లోపల నుంచి ఒక బలమైన కోరిక కలిగిందని ఆయన పేర్కొన్నారు. ఆ కోరికతోనే ఆ రోజు నుంచి సిగరెట్లు, డ్రింక్స్, నాన్‌వెజ్ వంటి అన్ని అలవాట్లను ఒకేసారి వదిలేశానని తెలిపారు. ఆ తర్వాత చాలా కాలం వరకు ఆయన నాన్‌వెజ్ కూడా తీసుకోలేదు. ఏడేళ్ల సంవత్సరాల క్రితం, తన ట్రైనర్ సూచన మేరకు, శిక్షణ సమయంలో బలహీనంగా అనిపించడంతో కొద్దిగా చికెన్, ఫిష్ తీసుకోవడం తిరిగి ప్రారంభించారు. ప్రస్తుతం ఆదిత్య ధూమపానం, మద్యపానం వంటి వాటికి దూరంగా ఉన్నారు. అప్పుడప్పుడు సామాజిక కార్యక్రమాలలో మాత్రమే అతి తక్కువగా, కేవలం స్నేహితుల కోసం డ్రింక్స్ తీసుకుంటారని, అయితే స్మోకింగ్ మాత్రం పూర్తిగా మానేశారని స్పష్టం చేశారు.
ఆస్తమా ఉన్నప్పటికీ రోజుకు 25-30 సిగరెట్లు తాగిన చైన్ స్మోకర్‌గా, అంత సులభంగా అలవాట్లను మానుకోవడం కష్టమని చాలామంది అంటుంటారు. అయితే, దృఢ సంకల్పం మాత్రమే ఒక వ్యక్తిని మార్చగలదని, జీవితంలో మార్పును కోరుకోవడం, దానికనుగుణంగా ముందుకు సాగడం అవసరమని ఆదిత్య ఓం సందేశం ఇచ్చారు. తన జీవితంలో ఆ మార్పు రాకుండా ఉండి ఉంటే, తాను ఇప్పుడున్న విధంగా ఉండేవాడిని కానని ఆయన గట్టిగా చెప్పారు.
View this post on Instagram
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి.
