Suryapet: నిజంగా ప్రేమిస్తే ఎవరైనా సుత్తితో దాడి చేస్తారా..? ఇదేం ఉన్మాదం..?
ప్రభుత్వాలు ఎన్ని కఠిన చట్టాలు తీసుకువచ్చినా.. తెలుగు రాష్ట్రాల్లో ప్రేమోన్మాదుల దాడులు కలకలం రేపుతున్నాయి. ప్రేమించడం లేదనో, పెళ్లికి నిరాకరించిందనో, వేరే వ్యక్తితో సన్నిహితంగా ఉందన్న కారణాలతో యువతులను కత్తులు, రాడ్లు, పెట్రోల్ యాసిడ్‌తో దాడులు చేస్తున్నారు. తనను దూరంగా పెడుతుందని యువతపై.. యువకుడు ప్రేమన్మోది గా మారి దాడి చేశాడు. ఈ ఘటన ఎక్కడ జరిగిందో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.

సూర్యాపేట జిల్లా నూతనకల్ మండలం లింగంపల్లికి చెందిన మహేష్, అలుగునూరుకు చెందిన స్పందన ఎనిమిదేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. యువతి హైదరాబాద్ అరోరా ‘లా’ కాలేజీలో చదువుతుండగా, మహేష్ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నాడు. అయితే వీరి ప్రేమను యువతి కుటుంబం అంగీకరించలేదు. దీంతో ఇరు కుటుంబల మధ్య కొంత కాలం గొడవలు కూడా జరిగాయి. దీంతో ఇద్దరు దూరంగా ఉండాలంటూ పెద్ద మనుషులు ఒప్పందం కుదిర్చారు. దీంతో మహేష్‌ను యువతి దూరం పెడుతూ వచ్చింది. దీనిని జీర్ణించుకోలేని మహేష్ యువతిపై కక్ష పెంచుకున్నాడు. రెండు రోజుల క్రితం సూర్యాపేటలో స్నేహ నగర్‌లోని తన సోదరీ ఇంటికి యువతి వచ్చింది. రెండో అంతస్తులోని సోదరి ఇంటిలో యువతి ఒంటరిగా ఉంది. ఈ విషయం తెలుసుకున్న మహేష్.. తనను దూరం పెడుతుందనే అక్కసుతో ఉన్మాదిలా మారి ఆమెపై సుత్తితో దాడి చేశాడు. విచక్షణారహితంగా దాడి చేయడంతో యువతి కేకలు వేస్తూ రక్తపు మడుగులో పడిపోయింది.
పరారవ్వడానికి ప్రయత్నించిన నిందితుడిని స్థానికులు వెంబడించి పట్టుకున్నారు. ఆగ్రహంతో ఊగిపోయిన స్థానికులు మహేష్‌ను విద్యుత్ స్తంభానికి కట్టేసి దేహశుద్ధి చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని గాయపడ్డ యువతిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. యువతి పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌కు తరలించారు. తన కూతురిపై దాడి చేసిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని యువతి తండ్రి డిమాండ్ చేస్తున్నాడు. యువతి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని పోలీసుల దర్యాప్తు చేస్తున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
