Andhra: ఆడుకున్న కుక్కే చిన్నోడి మరణానికి కారణమైంది.. అత్యంత విషాదకర మరణం..
ఎప్పుడూ తనతోనే ఆడుకున్న కుక్కే… ఆ బాలుడి ప్రాణాలకు కారణమైంది. కుక్క గోళ్లతో రక్కిన గాయానికి సకాలంలో వ్యాక్సిన్ వేయించుకోకపోవడంతో రేబిస్ సోకి 12 ఏళ్ల పూర్ణానంద్ మృతి చెందాడు. అనకాపల్లి జిల్లా దుప్పుతూరులో జరిగిన ఈ విషాద ఘటన గ్రామాన్ని కన్నీళ్లలో ముంచింది.

అనకాపల్లి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది.. రేబిస్ సోకి పన్నెండేళ్ల బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. కుక్క రక్కడంతో సకాలంలో వ్యాక్సిన్ వేసుకోక రేబిస్ సోకింది. వ్యాధి తీవ్రమై ఆసుపత్రికి తరలించినా ఫలితం దక్కలేదు. ఆరోగ్యం విషమించి చివరకు ఆ బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. ఎప్పుడూ తనతో పాటు ఆడుకుంటున్న ఆ కుక్కే.. ఆ బాలుడి ఆయువు తీసేందుకు కారణమైంది. అనకాపల్లి జిల్లా అచ్చుతాపురం మండలం దుప్పుతూరు గ్రామంలో ఈ సంఘటన జరిగింది. గుడియా పూర్ణానంద్ అనే బాలుడు దుప్పుతురు ప్రాథమికోన్నత పాఠశాలలో ఏడవ తరగతి చదువుతున్నాడు. తల్లిదండ్రులతో కలిసి నివాసం ఉంటున్నాడు. తండ్రి మద్యానికి బానిసై కుటుంబాన్ని పట్టించుకోడు. అనారోగ్యంతో ఉన్న తల్లికి ఆ బాలుడే సపర్యలు చేసేవాడు. అయితే వీధి కుక్క.. ఇంట్లోనే ఆ కుటుంబంతో కలిసిపోయింది. పూర్ణానంద ఆ కుక్కలతో ఆడుతూ ఉండేవాడు. ఆ కుక్కలు కూడా పూర్ణానంద సరదాగా కలిసిపోయేవి.
అయితే.. ఓ రోజు స్థానిక ఏఎన్ఎం.. గ్రామంలో క్యాన్సర్ స్క్రీనింగ్ చేస్తూ ఉంది. ఆ సమయంలో.. ఆ బాలుడు కాలుకు గోళ్లతో రక్కిన గాయాలు కనిపించడంతో ప్రశ్నించారు ఏఎన్ఎం అనిత. ఆడుతున్నప్పుడు కుక్క రక్కినట్టు సమాధానం ఇచ్చాడు ఆ బాలుడు. అప్పటికే అస్వస్థతకు గురై ఉన్నాడు. దీంతో వెంటనే వ్యాక్సిన్ వేసుకోవాలని సూచించారు. కుక్క రక్కడంతో వ్యాక్సిన్ వేయించుకోవాలన్న విషయం పూర్ణానంద కుటుంబ సభ్యులకు తెలియదని ఏఎన్ఎం తెలిపారు.
దీంతో.. డిసెంబర్ 9న మొదటి రేబిస్ వ్యాక్సిన్ బాలుడుకు అచ్యుతపురం పిహెచ్‌సీలో వేశారు. ఆ తరువాత రెండో వ్యాక్సిన్ వేసారు. అయినప్పటికీ తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో గ్రామస్తులు చందాలు వేసుకొని అనకాపల్లి ఎన్టీఆర్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ నుంచి.. పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్య చికిత్స కోసం విశాఖ కేజీహెచ్‌కు తరలించారు. రేబిస్ వ్యాధి లక్షణాలు పీక్స్‌కు చేరడంతో.. చిన వాల్తేరులోని మానసిక హాస్పిటల్‌కు షిఫ్ట్ చేశారు. అక్కడ చికిత్స పొందుతూ పూర్ణానంద ప్రాణాలు కోల్పోయాడని ఏఎన్‌ఎం అనిత తెలిపారు.
పూర్ణానంద మృతితో ఆ కుటుంబం ఎవరు విషాదంలోకి వెళ్లింది.. ఏ కుక్కతో అయితే పూర్ణానంద ఆడుకునేవాడో.. అదే పూర్ణానంద ప్రాణాల పైకి తీసుకురావడంతో ఆ గ్రామస్తులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. కుక్క కరిచినా, గోళ్లతో రక్కినా.. కచ్చితంగా సకాలంలో వ్యాక్సిన్ వేయించుకోవాలని సూచిస్తున్నారు వైద్యులు.
