హెల్మెట్ పెట్టుకుంటే జుట్టు ఊడిపోతుందా.. అసలు నిజం ఏంటంటే..?
హెల్మెట్ పెట్టుకుంటే జుట్టు రాలిపోతుందా? హెల్మెట్ లోపల పేరుకుపోయే చెమట, దుమ్ము వల్ల చుండ్రు, ఇన్ఫెక్షన్లు వచ్చి జుట్టు రాలడానికి కారణమవుతాయా..? ఈ వాదనలో నిజం ఉందా..? దీనిపై నిపుణులు ఏమంటున్నారు. చుండ్రు, ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా మీ జుట్టును ఎలా కాపాడుకోవాలి అనేది ఇప్పుడు తెలుసుకుందాం..

రోడ్డు ప్రమాదాల నుండి ప్రాణాలను కాపాడే రక్షణ కవచం హెల్మెట్. ట్రాఫిక్ నిబంధనల ప్రకారం హెల్మెట్ ధరించడం తప్పనిసరి. అయితే ఇటీవల కాలంలో యువతలో ఒక ఆందోళన మొదలైంది. రోజూ హెల్మెట్ ధరించడం వల్ల జుట్టు రాలడం చుండ్రు పేరుకుపోతుందని చాలామంది అంటున్నారు. మరి నిజంగానే హెల్మెట్ జుట్టుకు హాని చేస్తుందా? దీనిపై నిపుణుల అభిప్రాయం ఏంటో తెలుసుకుందాం.
అది అపోహ మాత్రమేనా?
ప్రముఖ చర్మవ్యాధి నిపుణురాలు దీపాలి భరద్వాజ్ ప్రకారం.. హెల్మెట్ ధరించడం వల్ల నేరుగా జుట్టు రాలదు. కానీ హెల్మెట్ లోపల పేరుకుపోయే చెమట, దుమ్ము, ధూళి వల్ల సమస్యలు మొదలవుతాయి. జుట్టు సరిగ్గా శుభ్రంగా లేకపోయినా, ఎక్కువ పొడవుగా ఉన్నా చుండ్రు పెరిగే అవకాశం ఉంది. దీనివల్ల బాక్టీరియల్, ఫంగల్ ఇన్ఫెక్షన్లు వచ్చి జుట్టు రాలడానికి కారణమవుతాయి.
జుట్టు రాలకుండా ఉండాలంటే ..
శుభ్రత ముఖ్యం: మీ జుట్టును ఎప్పుడూ పొట్టిగా, శుభ్రంగా ఉంచుకోవాలి. చుండ్రు సమస్య ఉన్నవారు వారానికి రెండుసార్లు యాంటీ-డాండ్రఫ్ షాంపూని, మిగిలిన రోజుల్లో సాధారణ షాంపూని ఉపయోగించాలి.
నూనె రాయకండి: హెల్మెట్ ధరించే అలవాటు ఉన్నవారు జుట్టుకు నూనె రాయడం మానేయాలని నిపుణులు సూచిస్తున్నారు. నూనె రాయడం వల్ల బయట ఉండే దుమ్ము, ధూళి త్వరగా జుట్టుకు అంటుకుని బ్యాక్టీరియా పెరగడానికి కారణమవుతుంది. నూనెకు బదులుగా జుట్టు సెట్ చేసుకోవడానికి అవసరమైతే జెల్ ఉపయోగించడం మంచిది.
నైట్ కేర్: జుట్టు సంరక్షణ ఉత్పత్తులు ఏవైనా వాడాలనుకుంటే, వాటిని రాత్రిపూట అప్లై చేసి.. ఉదయం సాధారణ నీటితో తలస్నానం చేయడం ఉత్తమం.
హెల్మెట్ వాడేటప్పుడు చిన్న చిట్కా
హెల్మెట్ లోపల నేరుగా జుట్టుకు తగలకుండా ఒక కాటన్ గుడ్డను లేదా స్కార్ఫ్‌ను ధరించడం వల్ల చెమటను అది పీల్చుకుంటుంది. దీనివల్ల జుట్టు దెబ్బతినకుండా ఉంటుంది.
ప్రాణ రక్షణ ఇచ్చే హెల్మెట్‌ను వదిలేయాల్సిన పనిలేదు. పైన చెప్పిన చిన్న చిన్న జాగ్రత్తలు పాటిస్తే మీ జుట్టును కాపాడుకుంటూనే, క్షేమంగా ప్రయాణించవచ్చు.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
