AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Razakar Review: బాబీ సింహా, అనసూయ నటించిన ర‌జాకార్‌ మూవీ రివ్యూ..

రజాకార్ సినిమాలో ఒకరి గురించి చెప్పడానికి లేదు. ఎవరికి వాళ్లు తమ పాత్రలకు పూర్తిస్థాయిలో న్యాయం చేశారు. చాకలి ఐలమ్మ పాత్రకు ఇంద్రజ ప్రాణం పోస్తే.. రాజిరెడ్డి పాత్రలో అద్భుతంగా నటించాడు బాబీ సింహ. అనసూయ, వేదిక, మకరంద్‌ పాండే, ప్రేమ, అనుష్క త్రిపాఠి, రాజ్‌ అర్జున్‌, జాన్‌ విజయ్‌ అందరూ తమ తమ పాత్రలకు న్యాయం చేశారు. ముఖ్యంగా రజ్వి పాత్రకు ప్రాణం పోసాడు రాజ్ అర్జున్.

Razakar Review:  బాబీ సింహా, అనసూయ నటించిన ర‌జాకార్‌ మూవీ రివ్యూ..
Razakar Movie Review
Lakshminarayana Varanasi, Editor - TV9 ET
| Edited By: |

Updated on: Mar 15, 2024 | 3:01 PM

Share

ఈ మధ్య కాలంలో ఎక్కువగా వాస్తవ సంఘటనలతో సినిమాలు వస్తున్నాయి. చరిత్రలో జరిగిన ఎన్నో సంఘటనలను ఈ జనరేషన్ ఆడియన్స్ కు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు దర్శక నిర్మాతలు. ఈ ప్రయత్నంలోనే తాజాగా రజాకార్ సినిమా వచ్చింది. స్వతంత్ర అనంతరం హైదరాబాదులో నిజాం పాలన ఎంత దారుణంగా కొనసాగిందో ఈ సినిమాలో కళ్లకు కట్టినట్టు చూపించారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు పూర్తి రివ్యూలో చూద్దాం.

కథ:

ఇండియాకు స్వాతంత్రం వచ్చినా కూడా హైదరాబాద్ సంస్థానాన్ని మాత్రం 200 నిజాం ప్రభువులు పాలిస్తుంటారు. వాళ్ళ అరాచకాలతో జనం విసిగిపోతారు. స్వాతంత్ర్యం వచ్చినా.. ఏడో నిజాం నవాబు మీర్‌ ఉస్మాన్‌ అలీ ఖాన్‌ హైదరాబాద్‌ రాజ్యాన్ని అఖండ భారతంలో విలీనం చేసేందుకు ససేమిరా అంటాడు. అంతేకాదు తన అనుచరుడు కాసిం రజ్వి అండగా హిందువులపై అనేక ఆగడాలకు, అరాచకాలకు, దౌర్జన్యాలకు పాల్పడ్డారు. బలవంతంగా మత మార్పిడిలు చేస్తారు. అడ్డొస్తే చంపేస్తాడు. ఖాసీం రజ్వీ అరాచకాలు ఢిల్లీ వరకు వెళ్తాయి. రజ్వి అరాచకాలకు ఐలమ్మ, నారాయణరెడ్డి, రాజన్న సహా చాలా మంది నాయకులు బలైపోతారు. పరకాలలో హింసా కాండ, బైరాన్‌ పల్లి మరణహోమం, గుండ్రంపల్లి దారుణా ఘటనలు ఇలా అన్ని చోట్ల వాళ్ళ దారుణాలు కొనసాగుతాయి. వీళ్ళ అరాచకాలు ఎప్పటికప్పుడు కేంద్ర హోంమంత్రి సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్ కి చేరుతుంటాయి దాంతో ఆయన హైదరాబాద్ కు రజాకార్ల నుంచి విముక్తి కలిగించాలని బలంగా ప్రయత్నిస్తుంటాడు. కానీ ఏం చేయలేని పరిస్థితి. వారిపై చర్యలు తీసుకోవడానికి ప్రధాని నెహ్రూ ఒప్పుకోరు. అలాంటి సమయంలో సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ ఏం చేశారు.. రజాకార్ వ్యవస్థను ఎలా అంతమందించారు అనేది ఈ సినిమా అసలు కథ..

కథనం:

చరిత్రలో జరిగిన కొన్ని సంఘటనలు చూస్తే భయం కలుగుతుంది. అలాంటిదే నిజాం పాలన కూడా. అప్పట్లో రజాకా వ్యవస్థ ఎంత దారుణంగా ఉండేది.. వాళ్ళు చేసిన అరాచకాలు ఎలా ఉండేవి అని కళ్లకు కట్టినట్టు రజాకారు సినిమాలో చూపించే ప్రయత్నం చేశారు దర్శకుడు యాట సత్యనారాయణ. నిజాం పాలన అలా ఉంటుంది.. రజాకార్ల దారుణాలు ఇలా ఉంటాయంటూ.. కొన్ని చదివాము.. కొన్ని విన్నాము.. కానీ అవి ఎంత భయంకరంగా ఉంటాయో రజాకార్ సినిమాలో చూపించారు ఇప్పుడు. ఇది చూసాక మనం అప్పుడు పుట్టనందుకు హమ్మయ్య అనిపిస్తుంది.. ఆ దారుణాలు తలుచుకుంటే వెన్నులో వణుకొస్తుంది. అప్పటి దారుణాల్లో.. సినిమాలో చూపించింది 25 శాతమే అంటే ఇంకా భయమేస్తుంది. స్వాతంత్ర్యం అనంతరం హైదరాబాద్ లోనే ఇన్ని ఘటనలు జరిగాయని తెలియదు చాలామందికి. రజాకార్ సినిమాలో విషయం చాలా ఉంది. నాటి నిజాం నిరంకుశత్వం.. రజాకార్ల కర్కశత్వం.. ప్రజల బానిసత్వం.. కొందరు నాయకుల పోరాటం.. సర్దార్ వల్లభాయ్ పటేల్ చూపిన తెగింపు.. ఆయన సంచలన నిర్ణయాలు.. ఇలా ఒక్కటేంటి రజాకార్ సినిమాలో ఓ పెద్ద చరిత్రే ఉంది. ఫస్టాఫ్, సెకండాఫ్ అని తేడా లేదు.. రెండూ పరిగెత్తాయి. ఇంద్రజ, అనసూయ, ప్రేమ, బాబీ సింహా.. ఇలా ఒక్కో ఎపిసోడ్ కు ఒక్కో హీరో. ముఖ్యంగా క్లైమాక్స్ అయితే చాలా బాగుంది.. సర్దార్ వల్లభాయ్ పటేల్ పాత్ర సినిమాకు ఆయువు పట్టు. సినిమాలో పెద్ద సర్ ప్రైజ్ మేకింగ్, గ్రాండియర్. ఒక్కో ఫ్రేమ్ లో 100 మందికి తక్కువ లేరెక్కడా..! నిర్మాత ఖర్చు కాదు.. కథ చెప్పాలని ఫిక్స్ అయ్యాడు అనిపించింది.

నటీనటులు:

రజాకార్ సినిమాలో ఒకరి గురించి చెప్పడానికి లేదు. ఎవరికి వాళ్లు తమ పాత్రలకు పూర్తిస్థాయిలో న్యాయం చేశారు. చాకలి ఐలమ్మ పాత్రకు ఇంద్రజ ప్రాణం పోస్తే.. రాజిరెడ్డి పాత్రలో అద్భుతంగా నటించాడు బాబీ సింహ. అనసూయ, వేదిక, మకరంద్‌ పాండే, ప్రేమ, అనుష్క త్రిపాఠి, రాజ్‌ అర్జున్‌, జాన్‌ విజయ్‌ అందరూ తమ తమ పాత్రలకు న్యాయం చేశారు. ముఖ్యంగా రజ్వి పాత్రకు ప్రాణం పోసాడు రాజ్ అర్జున్.

టెక్నికల్ టీం:

రజాకార్ కు తెరవెనుక హీరో మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్. ఆయన అందించిన పాటలు మాత్రమే కాదు.. నేపథ్య సంగీతం కూడా చాలా బాగుంది. చాలా సన్నివేశాల్లో మ్యూజిక్ హైలైట్ అయింది. తమ్మి రాజు ఎడిటింగ్ చాలా బాగుంది. కెమెరా వరకు కూడా అద్భుతంగా ఉంది. ప్రేమ్స్ అదిరిపోయాయి. దర్శకుడు యాట సత్యనారాయణ మరో సర్ ప్రైజ్.. అసలీ డైరెక్టర్ బ్యాగ్రౌండ్ ఏంటి.. సినిమా చూస్తున్నంత సేపు అనిపిస్తూనే ఉంటుంది. ఆయన వర్క్ సూపర్… నిర్మాణ విలువలు కూడా రజాకార్ సినిమాకు ప్రాణం.

పంచ్ లైన్:

ఓవరాల్ గా రజాకార్.. నిజాం నిరంకుశ పాలన వెనుక దాగున్న నిప్పులాంటి నిజం..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి