AP Crime News: అర్ధరాత్రి బయటకెళ్లింది.. బావిలో శవమై కనిపించింది.. మిస్టరీగా బాలిక మృతి
Prakasam district : కుటుంబ సభ్యులంతా గాఢనిద్రలో ఉండగా అర్ధరాత్రి 13 ఏళ్ళ బాలిక ఒంటరిగా బయటకు వెళ్ళింది. ఉదయం ఎంత వెతికినా ఆమె జాడ లభించలేదు. చివరకు ఆమె
Prakasam district : కుటుంబ సభ్యులంతా గాఢనిద్రలో ఉండగా అర్ధరాత్రి 13 ఏళ్ళ బాలిక ఒంటరిగా బయటకు వెళ్ళింది. ఉదయం ఎంత వెతికినా ఆమె జాడ లభించలేదు. చివరకు ఆమె ఊరి చివర బావిలో శవమై తేలింది.. మిస్టరీగా మారిన పదమూడేళ్ళ బాలిక మృతి ప్రకాశంజిల్లా సియస్‌పురంలో కలకలం రేపింది. నూడిల్స్ కొనివ్వలేదన్న మనస్థాపంతో ఆమె ఆత్మహత్యకు పాల్పడిందని తొలుత బంధువులు భావించినా.. అర్ధరాత్రి, అదీ వీధంతా కోతులుండే ప్రాంతం నుంచి ఊరి చివర పొలాల్లోని బావి దగ్గరకు ఎలా వెళ్ళింది.. దీని వెనుక ఎవరి హస్తమైనా ఉందా అనే పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. బాలిక భయస్తురాలని, ఇంటి నుంచి బయటకు వచ్చిన ఆమెపై ఎవరైనా అఘాయిత్యానికి పాల్పడి హత్య చేశారేమో అన్న సందేహాలను కుటుంబసభ్యులు వ్యక్తం చేస్తున్నారు. ప్రకాశం జిల్లా సియస్ పురం (cs puram) మండల కేంద్రంలోని పామూరు రోడ్డులో నివాసం ఉంటున్న పదమూడేళ్ళ బాలిక తంగెళ్ల భువనేశ్వరి సోమవారం సాయంత్రం తన తల్లి అరుణను నూడిల్స్ కొనివ్వమని అడిగింది. అదేరోజు కరోనా వ్యాక్సిన్ వేయించుకున్న తల్లి అరుణ రేపు కొనిస్తానని చెప్పింది. దీంతో మనస్థాపానికి గురైన భువనేశ్వరి అలిగి పడుకుంది. తెల్లవారుజామున 4 గంటల సమయంలో లేచి చూస్తే భువనేశ్వరి కనిపించలేదు. వెంటనే బంధువులు, గ్రామస్థులు బాలిక కోసం గాలించారు.
ఆ తర్వాత ఊరి చివర పొలాలకు వెళ్లే రైతులు జెండా బావిలో భువనేశ్వరి మృతదేహాన్ని గుర్తించి కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని భువనేశ్వరి మృతదేహాన్ని బావి నుంచి బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. విద్యార్థిని పామూరులోని ఓ ప్రైవేటు పాఠశాలలో 8వ తరగతి చదువుతోంది. ఆమె తండ్రి వెంకటేశ్వర్లు సీఆర్‌పీఎఫ్ లో పనిచేస్తూ గతంలో అనారోగ్యంతో మృతి చెందారు. అయితే బాలిక మృతిపై బంధువులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. భువనేశ్వరి ఎంతో భయస్తురాలని, అలాంటిది అర్ధరాత్రి ఒంటిరిగా ఇంటి నుంచి ఎలా బయటకు వెళ్ళిందో అర్ధం కావడం లేదన్నారు. అంతేకాకుండా వీధి నిండా కోతులున్నాయని, పగటి పూట వెళ్ళడానికి పెద్దలే భయపడతారంటున్నారు.
అయితే.. స్కూలు నుంచి వచ్చిన తరువాత భువనేశ్వరి ఏదో ఆలోచనలో ఉందని, స్కూల్లో ఏమైనా సంఘటన జరిగితే మనస్థాపానికి గురై ఉంటుందా అన్న అనుమానాలు కూడా వ్యక్తంచేస్తునర్నారు. మృతురాలి తల్లి అరుణ ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
-ఫైరోజ్, టీవీ9 తెలుగు రిపోర్టర్, ఒంగోలు
Also Read: