APPSC Exams 2025 Postponed: మెగా డీఎస్సీ వేళ ఏపీపీఎస్సీ కీలక నిర్ణయం.. పలు ఉద్యోగ నియామక పరీక్షలు వాయిదా!
మెగా డీఎస్సీ ఆన్‌లైన్ దరఖాస్తులు గత గురువారం (మే 15) అర్ధరాత్రితో ముగిసిన సంగతి తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 3,35,401 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. అన్ని పోస్టులకు కలిపి 5,77,417 దరఖాస్తులు వచ్చినట్లు విద్యాశాఖ వెల్లడించింది. వచ్చే నెలలో రాత పరీక్షలు కూడా జరగనున్నాయి. ఈ క్రమంలో ఏపీపీఎస్సీ కీలక నిర్ణయం తీసుకుంది..

అమరావతి, మే 18: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మెగా డీఎస్సీ ఆన్‌లైన్ దరఖాస్తులు గత గురువారం (మే 15) అర్ధరాత్రితో ముగిసిన సంగతి తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 3,35,401 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. అన్ని పోస్టులకు కలిపి 5,77,417 దరఖాస్తులు వచ్చినట్లు విద్యాశాఖ వెల్లడించింది. అత్యధికంగా దరఖాస్తులు ఉమ్మడి కర్నూలు జిల్లా నుంచి వచ్చాయి. ఈ జిల్లాలో 39,997 మంది దరఖాస్తు చేశారు. ఇక అత్యల్పంగా కడప జిల్లా నుంచి వచ్చాయి. కేవలం 15,812 మంది మాత్రమే ఈ జిల్లాలో దరఖాస్తు చేశారు. ఇతర రాష్ట్రాలకు చెందిన వారు 7,159 మంది దరఖాస్తు చేసుకున్నట్లు విద్యాశాఖ వెల్లడించింది.
ఇక మెగా డీఎస్సీకి సంబంధించిన రాత పరీక్షలు జూన్ 6 నుంచి జరగనున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఏపీపీఎస్సీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న పలు పరీక్షల తేదీలు వాయిదా పడ్డాయి. జూన్ 6 నుంచి 26 మధ్య వేర్వేరు తేదీల్లో రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులకు శాఖాపరమైన పరీక్షలు, ఇంటర్, డిగ్రీ, పాలిటెక్నిక్ కాలేజీ లెక్చరర్ల నియామక పరీక్షలు జరగాల్సి ఉన్నాయి. అయితే ఈ పరీక్షలు రాసే వారిలో కూడా కొందరు డీఎస్సీకి సన్నద్ధమవుతున్నారు. అంతేకాకుండా అన్ని పరీక్షల నిర్వహణకు పరీక్షా కేంద్రాల ఎంపిక పరంగానూ ఇబ్బందులు తలెత్తుతున్నాయి. వీటన్నింటి దృష్ట్యా ఏపీపీఎస్సీ ఆయా పరీక్షలను వాయిదా వేసింది. తదుపరి తేదీలు త్వరలో ప్రకటిస్తామని ఏపీపీఎస్సీ కార్యదర్శి పి రాజా బాబు ఓ ప్రకటనలో తెలిపారు.
ఈ మెగా డీఎస్సీలో మొత్తం 16,347 పోస్టులు భర్తీ చేయనున్నారు. డీఎస్సీ పరీక్షలకు మే 30 నుంచి హాల్‌టికెట్లను జారీ చేయనుంది. కంప్యూటర్ ఆధారిత ఆన్‌లైన్ రాత పరీక్షలు జూన్ 6 నుంచి జులై 6 వరకు నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన షెడ్యూల్ త్వరలోనే విడుదలకానుంది.
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.




