‘కర్రతో కొట్టి.. నరాలు కోసి.. చున్నీతో ఉరి బిగించి..’ భార్యను దారుణంగా హతమార్చిన భర్త
ఆయనకు ఇద్దరు భార్యలు. సవతుల మధ్య ఎలాంటి పొరపొచ్చాలు లేకుండా పచ్చగా సాగిపోతున్న వీరి కాపురంలో అనుమానం పెను భూతమైంది. రత్నాల్లాంటి ముగ్గురు పిల్లలు, కాపురాన్ని చక్కగా నెట్టుకొచ్చే భార్యలు.. సాఫీగా సాగిపోతున్న వారి కాపురంలో అనుకోని గోడవలు తుఫానులా చెలరేగింది..

హైదరాబాద్, మే 15: రెండో భార్యపై అనుమానం పెంచుకున్న భర్త నిత్యం ఆమెను మాటలతో చిత్రహింసలకు గురిచేయసాగాడు. అంతటితో ఊరుకోకుండా ఆమెను ఎలాగైనా హతమార్చాలని అనుకున్నాడు. అంతే వీరావేశంతో భార్య తలపై కర్రతో బాది.. గాజు ముక్కతో భార్య చేయి నరాలు కోసి ఆపై చున్నీతో ఆమె గొంతు నులిమి.. అత్యంత దారుణంగా భార్యను హతమార్చాడొ మృగాడు. ఈ దారుణ సంఘటన హైదారబాద్‌లోని బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఇన్‌స్పెక్టర్ సుధాకర్ తెలిపిన వివరాల ప్రకారం..
హైదరాబాద్‌లోని గోల్కొండలో ఉండే జాకీర్ అహ్మద్ (31)కు ఇద్దరు భార్యలు. రెండో భార్య నాజియాబేగం (30)కు ముగ్గురు పిల్లలు. అయితే ఆమెపై జాకీర్‌కు అనుమానం కలిగింది. ఈ క్రమంలో వారు నివాసం ఉంటున్న ఇంటిని 15రోజుల క్రితం జల్‌పల్లి కొత్తాపేట కాలనీకి మార్చాడు. అయినా అతడిలో అనుమానం నానాటికీ పెరగసాగింది. దీంతో రహస్యంగా భార్యను గమనిస్తూ ఆమె ఎక్కడికి వెళ్లినా వెంటాడేవాడ. ఈ క్రమంలో మే 13న రాత్రి 11 గంటలకు ఇంటికి వచ్చిన జాకీర్.. మరో వ్యక్తితో వివాహేతర సంబంధం సాగిస్తున్నావని భార్యను నిలదీశాడు.
దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. పిల్లలు మరో గదిలో నిద్రపోతుండగా.. ఆగ్రహంతో ఊగిపోయిన జాకీర్ కర్రతో భార్య నాజియాబేగం తలపై మోదాడు. దెబ్బల దాటికి తీవ్ర గాయాలైన నాజియాబేగం రక్తపు మడుగుల్లో పడి బాధతో విలవిలలాడసాగింది. అయితనా అతడిలో కోపం తగ్గలేదు. కిటికీకి ఉన్న అద్దాన్ని పగలగొట్టి ఓ ముక్కతో ఆమె కుడిచేయి నరాలను కోసేశాడు. అనంతరం చున్నీ ఆమె గొంతుకు బిగించి ఊపిరాడకుండా చేసి అత్యంత దారుణంగా హతమార్చాడు. ఆనక ఆమె మృతి చెందిందని నిర్ధారించుకున్న తర్వాత అక్కడి నుంచి పరారయ్యాడు. తల్లి మరణించటంతో ఆమె పిల్లలు జరిగిన విషయాన్ని అమ్మమ్మకు ఫోన్ ద్వారా తెలియజేశారు. హుటాహుటీన నాజియాబేగం తల్లి, సోదరుడు ఘటనా స్థలానికి చేరుకొని పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని, పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.




