AP DSC 2025 Application Deadline: నిరుద్యోగులకు బిగ్ అలర్ట్.. డీఎస్సీకి దరఖాస్తు చేశారా? మరికొన్ని గంటలే ఛాన్స్..
మెగా డీఎస్సీ నియామక ప్రక్రియకు దరఖాస్తు గడువు నేటితో ముగియనుంది. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 3 లక్షలకుపైగా దరఖాస్తులు వచ్చినట్లు పాఠశాల విద్యాశాఖ తెలిపింది. దరఖాస్తు గడువు మే 15 రాత్రి 11.59 గంటలకు ముగియనుంది. ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకోని అభ్యర్థులు చివరి వరకు వేచిచూడకుండా గడువు సమయం ముగిసేలోపు..

అమరావతి, మే 15: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నిరుద్యోగులకు అలర్ట్.. మెగా డీఎస్సీ నియామక ప్రక్రియకు దరఖాస్తు గడువు నేటితో ముగియనుంది. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 3 లక్షలకుపైగా దరఖాస్తులు వచ్చినట్లు పాఠశాల విద్యాశాఖ తెలిపింది. దరఖాస్తు గడువు మే 15 రాత్రి 11.59 గంటలకు ముగియనుంది. ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకోని అభ్యర్థులు చివరి వరకు వేచిచూడకుండా గడువు సమయం ముగిసేలోపు దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత విడుదల చేసిన అతిపెద్ద నియామక నోటిఫికేషన్ కావడంతో లక్షలాది మంది నిరుద్యోగులు డీఎస్సీ పోస్టులకు పోటీ పడుతున్నారు.
మెగా డీఎస్సీ నోటిఫికేషన్ ఏప్రిల్ 20న విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ నోటిఫికేషన్ కింద రాష్ట్రవ్యాప్తంగా 16,347 ఉపాధ్యాయ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. వీటిలో జిల్లా స్థాయిలో 14,088, రాష్ట్ర, జోనల్ స్థాయిలో 2,259 పోస్టులున్నాయి. వీటిల్లో ఎస్జీటీ పోస్టులు 6,599, స్కూల్ అసిస్టెంట్ పోస్టులు 7,487 ఉన్నాయి. రాష్ట్ర స్థాయి పోస్టులు 259 ఉన్నాయి. ఇర జోన్ వారీగా చూస్తే జోన్-1లో 400, జోన్-2లో 348, జోన్-3లో 570, జోన్-4లో 682 పోస్టులు కలిపి మొత్తం 2,228 ఉన్నాయి.
ఇక ఆన్‌లైన్ రాత పరీక్షలు జూన్ 6 నుంచి జులై 6 వరకు మొత్తం నెల రోజులపాటు జరగనున్నాయి. హాల్ టికెట్లను మే 30 నుంచి అందుబాటులోకి వస్తాయి. ప్రాథమిక కీ చివరి పరీక్ష తర్వాత 2వ రోజు విడుదల చేస్తారు. కీపై అభ్యంతరాలు ప్రారంభ కీ నుంచి 7 రోజులలోపు స్వీకరిస్తారు. అభ్యంతరాల స్వీకరణ గడువు ముగిసిన ఏడు రోజుల తర్వాత తుది కీ జారీ చేస్తారు. ఫైనల్ కీ తర్వాత ఏడు రోజులకు మెరిట్ జాబితా విడుదల చేయనున్నారు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు ఒక్కో పోస్టుకు రూ.750 చొప్పున చెల్లించి దరఖాస్తు చేసుకోవల్సి ఉంటుంది.
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.




