Rain Alert: దంచి కొడుతున్న వానలు.. ఈదురు గాలులతో వడగండ్లు! ఆరెంజ్ అలర్ట్ జారీ..
ద్రోణి ప్రభావంతో రుతుపవనాలు చురుకుగా కదులుతున్నాయి. దీంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఈ రోజు ఉరుములు, మెరుపులతో గంటకు 50 నుండి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులతో కూడిన వడగండ్ల వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది..

హైదరాబాద్, మే 15: తూర్పు బీహార్, దాని పరిసరాల్లోని సబ్ హిమాలయన్ పశ్చిమ బెంగాల్ ప్రాంతంలోని ఉపరితల ఆవర్తనం నుంచి ఝార్ఖండ్, విదర్భ, తెలంగాణ మీదుగా ఉత్తర రాయలసీమ వరకు సగటు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ద్రోణి కొనసాగుతుంది. దీని ప్రభావంతో రాగల మూడు నాలుగు రోజులలో నైరుతి రుతుపవనాలు మరింత పురోగమించి దక్షిణ అరేబియా సముద్రం, మాల్దీవులు దక్షిణ బంగాళాఖాతంలోని మరిన్ని ప్రాంతాలు, పూర్తి అండమాన్ నికోబార్ దీవులు, అండమాన్ సముద్రంలోని మిగిలిన ప్రాంతం, మధ్య బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాలలోకి ప్రవేశించే అవకాశం ఉంది. ఈ రోజు తెలంగాణలోని ఆదిలాబాద్, కొమరం భీం, నిర్మల్, నిజామాబాద్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్ జిల్లాలలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో గంటకు 50 నుండి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులతో కూడిన వడగండ్ల వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది. మరోవైపు రాగాల గంటలో హైదరాబాద్ లోని పలు ప్రాంతాలలో మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉంది.
ఆ12 జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్..
ఈ రోజు తెలంగాణలోని మంచిర్యాల, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్‌గిరి, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మ కొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి జిల్లాలలో అక్కడక్కడ గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులతో కూడిన వడగండ్ల వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది.
మరో 20 జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ..
ఓ వైపు వర్షాలు పడుతుంటే మరోవైపు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. గురువారం మహబూబ్ నగర్‌లో 39.1, కనిష్టంగా భద్రాచలంలో 33 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్నట్లు వాతావరణ కేంద్రం తెలిపింది. ఇక బుధవారం (మే 14) ఖమ్మం, ఆదిలాబాద్, రామగుండం, భద్రాచలం, హనుమకొండ, నల్లగొండలలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఏ జిల్లాలో ఎంతెంత నమోదైందంటే..
- ఖమ్మం.. 42.4 డిగ్రీలు
- ఆదిలాబాద్.. 42 డిగ్రీలు
- రామగుండం.. 41.6 డిగ్రీలు
- భద్రాచలం.. 40.8 డిగ్రీలు
- హనుమకొండ.. 40.5 డిగ్రీలు
- నల్లగొండ.. 40 డిగ్రీలు
- నిజామాబాద్.. 39.9 డిగ్రీలు
- మెదక్.. 39.2 డిగ్రీలు
- మహబూబ్ నగర్.. 38.5 డిగ్రీలు
- హైదరాబాద్.. 38 డిగ్రీల చొప్పునఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.




