AP Polycet 2025 Exam Date: పాలీసెట్ 2025 పరీక్ష తేదీ ఖరారు.. ఇంతకీ ఎప్పుడంటే?
2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ పాలిటెక్నిక్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించనున్న పాలీసెట్ 2025 పరీక్ష తేదీని విద్యాశాఖ ఖరారు చేసింది. ఈ మేరకు అవసరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా సాంకేతిక విద్యాశాఖను ఆదేశిస్తూ గురువారం విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఇందుకు సంబంధించిన పాలీసెట్ 2025 నోటిఫికేషన్‌ను త్వరలోనే విడుదల కానుంది..

అమరావతి, ఫిబ్రవరి 21: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పాలిటెక్నిక్ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి 2025-26 విద్యా సంవత్సరానికి గానూ నిర్వహించనున్న పాలీసెట్ 2025 పరీక్ష తేదీ వెలువడింది. ఈ పరీక్షను ఏప్రిల్ 30న నిర్వహించేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ పరీక్ష నిర్వహణకు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 69 సమన్వయ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. ఈ ఏడాది పాలీసెట్ పరీక్షకు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం1.50 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యే అవకాశం ఉందని అధికారులు అంచానా వేస్తున్నారు. దరఖాస్తు ఫీజు కింద ఓసీ, బీసీ అభ్యర్థులు రూ.400, ఎస్సీ, ఎస్టీలు రూ.100 చెల్లించాల్సి ఉంటుందని అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు అవసరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా సాంకేతిక విద్యాశాఖను ఆదేశిస్తూ గురువారం విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఇందుకు సంబంధించిన పాలీసెట్ 2025 నోటిఫికేషన్‌ను త్వరలోనే విడుదల చేయనుంది.
‘పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు ఎస్జీటీలనే ఇన్విజిలేటర్లుగా నియమించాలి’
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పదో తరగతి పబ్లిక్ పరీక్షలు షెడ్యూల్ ప్రకారం మార్చి 17వ తేదీ నుంచి ఏప్రిల్ 1వ తేదీ వరకు నిర్వహించనున్న సంగతి తెలిసిందే. అయితే పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో స్కూల్ అసిస్టెంట్లకు విధుల నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరుతూ ఏపీటీఎఫ్ అమరావతి రాష్ట్ర అధ్యక్షుడు సీవీ ప్రసాద్ ప్రభుత్వాన్ని కోరారు. ఈ విధులకు సెకండరీ గ్రేడ్ టీచర్లను మాత్రమే నియమించాలని విన్నవించారు. స్కూల్ అసిస్టెంట్లను కొనసాగిస్తే సైన్సు సబ్జెక్టు వారికి గణితం కూడా తెలుసని, ఆయా పరీక్షల రోజున సబ్జెక్టు టీచర్లను తప్పించినా పరీక్షల్లో ఇబ్బందులు వస్తాయని పేర్కొన్నారు. టెన్త్ పరీక్ష కేంద్రాల్లో స్కూల్ అసిస్టెంట్లు, లాంగ్వేజ్ పండిట్లను నియమించేందుకు ప్రభుత్వం కూడా అనుమతించిందని, బోధించే సబ్జెక్టు పరీక్ష రోజున ఇన్విజిలేషన్ నుంచి ఆ సబ్జెక్టు టీచర్లను మినహాయించినట్లు పేర్కొన్నారు.
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.




