Police Dept Jobs: రాష్ట్ర పోలీసుశాఖలో 11,639 ఉద్యోగాలు.. సర్కార్‌కు హైకోర్టు కీలక ఉత్తర్వులు
AP police department Jobs: రాష్ట్రంలోని నిరుద్యోగులకు మరో శుభవార్త. త్వరలోనే రాష్ట్ర పోలీసు శాఖలో భారీగా ఉద్యోగాల భర్తీకి ప్రకటన వెలువడనుంది. ఈ శాఖలోని వివిధ క్యాడర్ల కింద మొత్తం 11,639 పోస్టులు ఖాళీగా ఉన్నాయని, ఈ పోస్టుల భర్తీ విషయంలో వచ్చే 6 వారాల్లో నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వ..

అమరావతి, నవంబర్ 26: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నిరుద్యోగులకు మరో శుభవార్త. త్వరలోనే రాష్ట్ర పోలీసు శాఖలో భారీగా ఉద్యోగాల భర్తీకి ప్రకటన వెలువడనుంది. ఈ శాఖలోని వివిధ క్యాడర్ల కింద మొత్తం 11,639 పోస్టులు ఖాళీగా ఉన్నాయని, ఈ పోస్టుల భర్తీ విషయంలో వచ్చే 6 వారాల్లో నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, హోంశాఖ ముఖ్య కార్యదర్శిని రాష్ట్ర హైకోర్టు ఆదేశించింది. ఇందుకు సంబంధించిన స్థాయి నివేదిక ఇవ్వాలని అందులో పేర్కొంది. తదుపర విచారణను అరు వారాలకు వాయిదా వేసింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకుర్, జస్టిస్ చల్లా గుణరంజన్‌తో కూడిన ధర్మాసనం ఈ మేరకు బుధవారం (నవంబర్ 26) ఉత్తర్వులు జారీ చేసింది.
కాగా రాష్ట్ర పోలీసుశాఖలో ఖాళీగా ఉన్న పలు ఉద్యోగాల భర్తీకి చర్యలు తీసుకునేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ హెల్ప్ ది పీపుల్ ఛారిటబుల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ కీతినీడి అఖిల్ శ్రీగురుతేజ గత ఏడాది హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. పోలీసు శాఖలో మొత్తం 19,999 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నట్లు సమాచార హక్కు చట్టం ద్వారా అడిగిన ప్రశ్నకు ప్రభుత్వం నుంచి సమాధానం వచ్చిందని అందులో తెలిపారు. పోలీస్ శాఖలో ఖాళీలను ఎప్పటికప్పుడు భర్తీ చేయాలని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. మరోవైపు ఇదే వ్యవహారంపై హైకోర్టు సుమోటోగా స్వీకరించింది.
ఈ క్రమంలో ఈ రెండు వ్యాజ్యాలూ బుధవారం హైకోర్టు ముందుకు విచారణకు వచ్చాయి. ప్రభుత్వ తరపు స్‌జీపీ ప్రణతి వాదనలు వినిపిస్తూ.. ప్రస్తుతం రాష్ట్రంలో 11,639 పోస్టులు ఖాళీగా ఉన్నాయని అన్నారు. వీటిని ప్రాధాన్యక్రమంలో భర్తీ చేసేందుకు అనుమతివ్వాలని కోరుతూ డీజీపీ ఈ ఏడాది సెప్టెంబర్ 29న హోంశాఖ ముఖ్య కార్యదర్శికి లేఖ రాసినట్లు తెలిపారు. దానిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉందని కోర్పుకు వెల్లడించారు. ఈ క్రమంలో పోలీస్ శాఖలో ఉన్న ఖాళీల భర్తీకి సంబంధించి నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.




