Inherit property: వారసత్వపు ఆస్తులపై కుమార్తెలకు హక్కు నిల్.. ప్రత్యేక పరిస్థితులు ఇవే..!
ప్రస్తుత రోజుల్లో కుటుంబాల్లో ఆస్తి వివాదాలు సర్వసాధారణంగా మారాయి. సోదరుల మధ్య, తల్లిదండ్రులు, పిల్లల మధ్య, ఆడ బిడ్డల మధ్య కూడా ఆస్తి వివాదాలు తలెత్తుతూ ఉంటాయి. ముఖ్యంగా కుమార్తెలకు ఆస్తి వాటాపై ఎప్పటి నుంచో గొడవలు ఉంటూ ఉంటాయి. అయితే వారసత్వ ఆస్తిపై కుమార్తెలకు హక్కులు ఉంటాయి. కానీ కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఆ ఆస్తులపై కుమార్తెలకు హక్కులు ఉండవని నిపుణులు చెబుతున్నారు.

హిందూ వారసత్వ (సవరణ) చట్టం, 2005 ప్రకారం కుమార్తెలకు వారి తండ్రి ఆస్తిలో సమాన హక్కులను కల్పించింది. అయితే ఈ హక్కు నిర్దిష్ట షరతులకు లోబడి ఉంటుంది. తండ్రి తన సొంత సంపాదనతో ఆస్తిని కొనుగోలు చేస్తే దానిపై అతనికి పూర్తి హక్కులు ఉంటాయి. అతను ఆస్తిని అమ్మినా, బహుమతిగా ఇచ్చినా, లేదా తన వీలునామాలో ఎవరికైనా ఇచ్చినా, నిర్ణయం పూర్తిగా అతనిదే. అది పూర్వీకుల ఆస్తి కాకపోతే కుమార్తెలకు ఆటోమేటిక్ చట్టపరమైన హక్కు ఉండదు. అయితే తండ్రి తన వీలునామాలో కుమార్తె గురించి పేర్కొంంటే ఆమె ఆస్తికి అర్హులు అవుతుంది.
2005 కి ముందు విభజన
పూర్వీకుల ఆస్తిని 2005 కి ముందు చట్టబద్ధంగా విభజించి రిజిస్టర్ చేస్తే, కుమార్తెలు దానిపై హక్కులు పొందలేరు. కోర్టులు అలాంటి మునుపటి విభజనలను చెల్లుబాటు అయ్యేవిగా సమర్థించాయి. అయితే విభజన అసమానంగా ఉంటే దానిని కోర్టులో సవాలు చేయవచ్చు.
బహుమతిగా ఇచ్చిన ఆస్తి
పూర్వీకులు ఆస్తిని ఎవరికైనా బహుమతిగా ఇచ్చి, ఆ గిఫ్ట్ డీడ్ చట్టబద్ధంగా చెల్లుబాటు అయితే కుమార్తెలకు ఆ ఆస్తిపై హక్కు ఉండదు. చట్టబద్ధంగా ఇచ్చిన అలాంటి బహుమతులను చట్టం రద్దు చేయదు.
హక్కు విడుదల
కుమార్తె డబ్బు లేదా ఇతర ప్రయోజనాల కోసం ఆస్తిలో తన వాటాను స్వచ్ఛందంగా వదులుకునే ఒప్పందంపై సంతకం చేస్తే ఉదాహరణకు, ఆమె తన హక్కును కోల్పోతుంది. అయితే ఒప్పందం ఒత్తిడి లేదా మోసంతో సంతకం చేస్తే ఆమె దానిని కోర్టులో సవాలు చేయవచ్చు.
వీలునామా నుంచి మినహాయింపు
తండ్రి చెల్లుబాటు అయ్యే వీలునామాను రూపొందించి తన కుమార్తెను ఆస్తిని వారసత్వంగా పొందకుండా స్పష్టంగా మినహాయిస్తే ఆమెకు వాటా లభించదు. చట్టం వీలునామాకు ప్రాధాన్యత ఇస్తుంది. అయితే బలవంతం లేదా మోసంతో వీలునామాను రూపొందిస్తే ఆమె దానిని చట్టపరంగా సవాలు చేయవచ్చు.
ట్రస్ట్‌కు ఆస్తి బదిలీ
ఆస్తిని ట్రస్ట్‌కు బదిలీ చేసినా లేదా చట్టబద్ధంగా వేరొకరికి బదిలీ చేసినా కుమార్తెలకు దానిని వారసత్వంగా పొందే హక్కు ఉండదు. ట్రస్ట్‌లో ఉన్న ఆస్తులు చట్టం ప్రకారం రకిస్తారు.




