AP News: ‘చంద్రబాబుకు పొత్తులు పెట్టుకోవడం అలవాటే’.. సజ్జల కీలక వ్యాఖ్యలు..
విజయవాడ వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ప్రజాగళం సభ పూర్తిగా విఫలమైందని విమర్శించారు. ప్రజాగళం పేరుతో ముగ్గురు నేతలు రాష్ట్ర ప్రజలకు ఒక్క మెసేజ్ ఇచ్చే ప్రయత్నమైనా చేశారా అని ప్రశ్నించారు. సరిగ్గా పదేళ్ల క్రితం రాష్ట్ర విభజన సమయంలో చంద్రబాబు, మోడీ, పవన్‌లు తిరుపతి సభలో కలిశారని గుర్తు చేశారు.

విజయవాడ వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ప్రజాగళం సభ పూర్తిగా విఫలమైందని విమర్శించారు. ప్రజాగళం పేరుతో ముగ్గురు నేతలు రాష్ట్ర ప్రజలకు ఒక్క మెసేజ్ ఇచ్చే ప్రయత్నమైనా చేశారా అని ప్రశ్నించారు. సరిగ్గా పదేళ్ల క్రితం రాష్ట్ర విభజన సమయంలో చంద్రబాబు, మోడీ, పవన్‌లు తిరుపతి సభలో కలిశారని గుర్తు చేశారు. పదేళ్ల తర్వాత కూడా అదే నాటకాలు ఆడేందుకు తెరలేపారన్నారు. నిన్నటి సభలో గతంలో ఉన్న ఉత్సాహం కనపడలేదన్నారు సజ్జల రామకృష్ణా రెడ్డి. చంద్రబాబుకు పొత్తులు పెట్టుకోవడం కొత్త కాదన్నారు. 2014 లో అందరూ కలిసిన ఒక్క శాతం ఓట్ల తేడాతో మాత్రమే అధికారంలోకి వచ్చారని చెప్పారు. 2014 లో ప్రత్యేక హోదాతో సహా ఇచ్చిన హామీలన్నీ అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేయడంలో ఏమయ్యాయని ప్రశ్నించారు. అప్పుడు ఇచ్చిన హామీలు ఎంతవరకూ అమలుచేశారని నిలదీశారు. అధికారంలోకి వచ్చిన మూడేళ్ల తర్వాత విడాకులు ఎందుకు తీసుకున్నారు.. ఇప్పుడు మళ్ళీ ఎందుకు కలిశారో చెప్పాలన్నారు. విడిపోయిన తర్వాత ఒకరిని ఒకరు తీవ్రంగా విమర్శించుకున్న విషయాన్ని ఈ సందర్భంగా తెలిపారు.
చంద్రబాబు గతంలో మోదీపై వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డారని అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పాచిపోయిన లడ్లు అంటూ కామెంట్ చేశారని గుర్తు చేశారు. 2014లో ఎందుకు కలిశారు.. హామీలు ఏమయ్యాయి అనేదానిపై నిన్నటి సభలో సంజాయిషీ ఇచ్చి ఉంటే బాగుండేదని చురకలంటించారు.చంద్రబాబు సంతకంతో మేనిఫెస్టో పేపర్‌ను ఇంటింటికీ పంచారు అందులో ఎన్ని అమలు చేశారో చెప్పాలని ఎద్దేవాచేశారు. సభ నిర్వహించడం చేతకాక పోలీసులపై విమర్శలు ఏంటని ప్రశ్నించారు. 2024లో అధికారంలోకి వస్తే ప్రజలకు ఏం చేస్తారో చెప్పలేదన్నారు. మైక్ సెట్ ఫెయిల్ అయితే పోలీసులు ఏం చేస్తారన్న కనీస జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. వాళ్ళ చేతకానితనాన్ని పోలీసుల మీద చూపిస్తున్నారంటూ మండిపడ్డారు. వైసీపీ, కాంగ్రెస్ ఒకటే అని ప్రధాని చెప్తే ప్రజలకు ఆలోచన ఉండదా అని సజ్జల పేర్కొన్నారు. ప్రత్యేక హోదాపై కనీసం ప్రస్తావన కూడా తీసుకురాలేదన్నారు. ఐదేళ్లలో జగన్ చెప్పిన దానికంటే ఎక్కువ చేశారని కొనియాడారు. రాష్ట్రంలో 87 శాతం కుటుంబాలు సీఎం జగన్ వల్ల ఏదోరకంగా మేలు పొందారని చెప్పుకొచ్చారు.
చంద్రబాబు మరోసారి చేసే మోసాన్ని తిప్పి కొట్టాలంటే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.తాము, బీజేపీ ఒకటే అని షర్మిల అంటున్నారు.. అయితే రాష్ట్రంలో వైసీపీ ఒకటే పార్టీ అని ప్రజలకు తెలుసని తమపై ఉన్న విశ్వాసాన్ని వ్యక్తపరిచారు. జగన్ చేతులు కలుపుతానంటే ఏ పార్టీ అయినా ముందుకు వస్తుందని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీకి నోటా కంటే తక్కువ ఓట్లు వచ్చాయన్నారు. షర్మిల ఎక్కడి నుంచైనా పోటీ చేయవచ్చు అయితే ప్రజల నిర్ణయం ఎలా ఉంటుందో చూడాలన్నారు. షర్మిల సీఎం అవుతుందన్న రేవంత్ రెడ్డి కామెంట్స్ పై పగటి కలలు కంటున్నారంటూ సజ్జల స్పందించారు. రెండు నెలలు ఆగితే అందరికీ తెలుస్తుంది ఎవరు ముఖ్యమంత్రి అవుతారో అని బదులిచ్చారు. ఈ ఎన్నికల్లో ప్రచారం చేసుకునేందుకు అభ్యర్థులకు సరిపడా సమయం ఉందన్నారు. ఎన్నికల షెడ్యూలు వల్ల ఈ వెసులుబాటు వచ్చిందని పేర్కొన్నారు. ఈ సమయాన్ని అభ్యర్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రతి సచివాలయాన్ని సందర్శించాలి, ప్రజల ఆశీర్వాదం తీసుకోవాలని దిశానిర్ధేశం చేశారు. సిద్ధం సభలు తరహాలోనే బస్సు యాత్రకూడా విజయవంతం అయ్యేలా చర్యలు తీసుకోవాలని పిలుపునిచ్చారు. రీజనల్ కో-ఆర్డినేటర్ల సమావేశంలో ముఖ్యమంత్రి, పార్టీ అధ్యక్షుడు వైయస్.జగన్ పాల్గొంటారన్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..