AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇన్వెస్టిగేషన్‌లో దొరికిన చిన్న క్లూ.. పెద్ద కుట్రను భగ్నం చేసిన శ్రీకాకుళం పోలీసులు.. ఏంటంటే?

ఒకటి కొంటే ఒకటి ఫ్రీ.. అని పండగ సీజన్లో బట్టల షాపులు పెట్టే ఆఫర్లు గురించి మీరు వినే ఉంటారు. అలాంటి ఆఫరే ఇప్పుడు శ్రీకాకుళం జిల్లా పోలీసులకు తగిలింది. ఓ హత్య కేసులో నిందితుడిని పట్టుకొని దర్యాప్తు చేస్తూన్న పోలీసులకు.. అతడిచ్చిన క్లూ తో మరో సెన్సేషనల్ కేసులో పిస్టల్, మ్యాగజిన్‌తో ఐదుగురు నిందితులు పట్టుబడ్డారు. దీంతో మరో నేరం జరగకుండా ముందుగానే పోలీసులు ఆపగలిగారు.

ఇన్వెస్టిగేషన్‌లో దొరికిన చిన్న క్లూ.. పెద్ద కుట్రను భగ్నం చేసిన శ్రీకాకుళం పోలీసులు.. ఏంటంటే?
S Srinivasa Rao
| Edited By: |

Updated on: Dec 23, 2025 | 12:48 AM

Share

శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం కింతలి మిల్లు జంక్షన్ సమీపంలో ఈనెల 3వ తేదీన సంచలనం రేపిన గురుగుబెల్లి సీతారత్నం అనే వివాహిత హత్య కేసు విచారణ మరో సెన్సేషనల్ కేసుకు గొప్ప క్లూ ఇచ్చింది. వివాహిత హత్య కేసులో నిందితుడు అయిన నరసన్నపేటకి చెందిన గొల్లపల్లి ప్రశాంత్ కుమార్ ను పోలీసలు అదుపులోకి తీసుకొని విచారిస్తుండగా.. గతంలో నిందితుడు పిస్టల్ వాటినట్టు పోలీసులకు తెలిసింది. దీనిపై పోలీసులు లోతుగా విచారించగా.. అది తనవద్ద లేదని వేరేవాళ్ల వద్ద ఉందని చెప్పాడు. గొల్లపల్లి ప్రశాంత్ కుమార్ ఇచ్చిన క్లూ ఆధారంగా అక్రమ పిస్టల్, మ్యాగజిన్‌తో ఐదుగురు సభ్యుల గ్యాంగ్‌ను పట్టుకున్నారు పోలీసులు.

శ్రీకాకుళం మండలం, తండ్యాంవలస గ్రామంలోని జగనన్న కాలనీలో నిర్మాణంలో ఉన్న ఒక ఇంటి వద్ద ఆదివారం ఉదయం శ్రీకాకుళం రూరల్ పోలీస్ స్టేషన్ ఎస్‌.ఐ. తమ సిబ్బంది సహాయంతో ఐదుగురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. వారిని తనిఖీ చేయగా, వారి వద్ద ఒక పిస్టల్, ఒక మ్యాగజిన్ దొరికింది. కేసు విచారణలో, నిందితులు పంచిరెడ్డి కైలాష్, గతంలో ప్రత్యర్థుల చేతిలో హత్యకు గురైన ఎచ్చెర్ల మండలం సత్తరు గోపి నేరాలు చేయాలనే ఉద్దేశంతో, సదరు పిస్టల్‌ను ఒడిశా రాష్ట్రం, బరంపూర్ కు చెందిన  సంతోష్ తో కొనుగోలు చేసినట్లు తెలిపారు. అనంతరం, పంచిరెడ్డి కైలాష్, అలబన మణి, కలగ ఉమా మహేశ్వరరావు, వుర్జాన ప్రశాంత్ కుమార్ లు, సదరు పిస్టల్‌ను తమకు అప్పగించాలని థండాసి కార్తిక్‌ను కోరగా, కార్తిక్ పిస్టల్ ఇవ్వడం కోసం జగనన్న కాలనీలో నిర్మాణంలో ఉన్న ఇంటి వద్దకు వచ్చి పిస్టల్ అందజేస్తుండగా, పోలీసుల చేతికి పట్టుబడ్డారు.

సదరు పిస్టల్‌ను వారు ఎందుకు కొనుగోలు చేశారు, ఏ నేరం చేయడానికి ఉద్దేశించారు, ఇందుకు ఆర్థిక సహాయం ఎవరు అందించారు అనే అంశాలపై లోతైన దర్యాప్తు కొనసాగుతోంది. అరెస్టు అయిన నిందితులు పంచిరెడ్డి కైలాష్, అలబన మణి, కలగ ఉమా మహేశ్వరరావు, వుర్జాన ప్రశాంత్ కుమార్ లపై గతంలో శ్రీకాకుళం జిల్లాలోని పలు స్టేషన్ లలోనూ కేసులు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. ఇంకా ఈ కేసును క్షేత్రస్థాయిలో దర్యాప్తు చేసి మరి కొంతమందిని అరెస్టు చేస్తామని జిల్లా ఎస్పీ తెలిపారు. నేరాలు జరిగిన తర్వాత నిందితులను పట్టుకోవడం ఒక ఎత్తు అయితే, నేరాలను అరికట్టేందుకు తీసుకుంటున్న ముందస్తు చర్యలలో భాగంగా నేరం జరగకుండా నిందితులను పట్టుకోవడం ఒక ఎత్తని జిల్లా పోలీస్ యంత్రాంగాన్ని ఎస్పీ అభినదించారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.