Andhra: ఆమెతో ఏకాంతంగా గడపాలనుకున్నాడు.. కానీ ఆ కోరిక కథను మార్చింది.. చివరికి చీర కొంగుతో.!
ఆర్ధిక అవసరాల కోసం తప్పుడు మార్గాన్ని ఎంచుకొంది ఓ మహిళ. భర్త ఉండగా బయట వ్యక్తులతో శారీరక సంబంధాలు పెట్టుకుంటూ వచ్చింది. ఇలా గత రెండేళ్లుగా పరిచయం ఉన్న ఓ వ్యక్తిని రూ.50 వేలు ఇవ్వాలని లేకుంటే తమ మధ్య ఉన్న పరిచయాన్ని నీ భార్యకు చెప్పేస్తానని బ్లాక్ మెయిల్ చేసింది. దాంతో విసుగు చెందిన ఆ వ్యక్తి..

శ్రీకాకుళం జిల్లాలో సంచలనం రేపిన ఎచ్చెర్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని సీతారత్నం అనే వివాహిత హత్య కేసు మిస్టరీ వీడింది. ఆమదాలవలస మండలం కొత్తవలస గ్రామంకి చెందిన గురుగుబెల్లి కూర్మారావు, సీతారత్నం దంపతులు గత 14 ఏళ్లుగా శ్రీకాకుళంలోని ఎ.ఎస్.ఎన్ కాలనీలో నివాసం ఉంటున్నారు. ట్రీట్మెంట్ కోసం హాస్పిటల్‌కి వెళ్లి వస్తానని కుటుంబ సభ్యులకు చెప్పి ఈ నెల 2న సాయంత్రం 5 గంటలకు ఇంటి నుంచి వెళ్లిన సీతారత్నం.. మరునాడు ఉదయం ఎచ్చెర్ల మండలం మిల్లు జంక్షన్ సమీపంలోని NH 16 సర్వీసు రోడ్లో శవమై కనిపించింది. అప్పటికే తన తల్లి కనిపించడం లేదంటూ సీతారత్నం కుమారుడు శ్రీకాకుళంలో పోలీసులకు ఫిర్యాదు చేయటంతో మృతురాలు సీతారత్నంగా ఆమె కుమారుడు వెంకటరమణ ద్వారా పోలీసులు గుర్తించారు.
హాస్పిటల్ నిమిత్తం ఇంటి నుంచి బయలుదేరి తిరిగి రాకపోవడంతో ఆమె కుటుంబసభ్యులు అదే రోజు రాత్రి అంతా ఆమె సెల్ ఫోన్‌కి కాల్ చేయగా స్విచాఫ్ వచ్చింది. మరునాడు ఉదయం ఊరు కాని ఊరులో ఆమె శవమై కనిపించడంతో కుటుంబసభ్యులు తీవ్ర దిగ్బ్రాంతికి గురయ్యారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులకు కేసు దర్యాప్తు సవాల్‌గానే మారింది. మృతురాలు ఇంటి నుంచి బయలుదేరే సమయంలో మెడలో మంగళసూత్రాలు, సెల్‌ఫోన్ తీసుకెళ్లినట్లు, అవి మృతదేహం వద్ద లభించలేదని కుమారుడు పోలీసులకు తెలిపారు. దాంతో ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ఆభరణాల కోసం ఆమెను గొంతు నులిమి హత్య చేసి ఉంటారని మొదట అనుమానం వ్యక్తం చేశారు పోలీసులు.
అయితే మృతురాలి సెల్ ఫోన్ డేటాను ఐపిడిఆర్ సహాయంతో విశ్లేషించారు పోలీసులు. మృతురాలు మాట్లాడిన వాట్సాప్ కాల్ నంబర్‌ను గుర్తించగా అది నరసన్నపేటకు చెందిన గొల్లపల్లి ప్రశాంత్ కుమార్‌దిగా తేలింది. శ్రీకాకుళం ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి కింతలిమిల్ వరకు ఉన్న సీసీ కెమెరాలు, హైవే సీసీ ఫుటేజీలను పరిశీలించి, ఒక కారును అనుమానించారు. టోల్ గేట్‌లో లభించిన డేటా ఆధారంగా కారు నెంబర్ AP39 H 3302గా గుర్తించారు. సాంకేతిక ఆధారాలు ద్వారా నిందితుడిని పట్టుకున్నారు పోలీసులు. JRపురం సీఐ అవతారంకి అందిన సమాచారం మేరకు నరసన్నపేటకు చెందిన నిందితుడు కారు డ్రైవర్‌గా పనిచేస్తున్న గొల్లపల్లి ప్రశాంత్ కుమార్‌ను జర్జామ్ జంక్షన్ సమీపంలోని గాయత్రి డాబా వద్ద కారుతో పాటు పట్టుకున్నారు. అతన్ని విచారించగా మృతురాలు సీతారత్నంను తానే హత్య చేసినట్లు అంగీకరించాడు. నిందితుడిని అరెస్టు చేసి, అతని వద్ద నుంచి రోల్డ్ గోల్డ్ చైన్, బంగారు శతమానం స్వాధీనం చేసుకున్నారు పోలీసులు.
పోలీస్ విచారణలో నిర్ఘాంతపోయే విషయాలు బయటపడ్డాయి. సీతారత్నం భర్త పక్షవాతంతో బాధపడుతుండటంతో, ఆర్థిక పరిస్థితుల కారణంగా కొంతమంది వ్యక్తులతో మృతురాలు శారీరక సంబంధాలు పెట్టుకుని డబ్బులు సంపాదించేదనీ తేలింది. నిందితుడు గొల్లపల్లి ప్రశాంత్ కుమార్ గత రెండు ఏళ్ళుగా మృతురాలితో పరిచయం కలిగి ఉండి, శారీరక సంబంధం కొనసాగిస్తూ ప్రతిసారి కలిసినప్పుడు రూ. 2 వేలు ఇచ్చేవాడు. ఇదే క్రమంలో ఈ నెల 2న మృతురాలు నిందితుడికి వాట్సాప్ కాల్ చేసి సాయంత్రం 6 గంటలకు డే & నైట్ జంక్షన్ వద్దకు రమ్మని చెప్పింది. అక్కడికి వచ్చిన ప్రశాంత్‌ను మృతురాలు రూ.50వేలు డిమాండ్ చేస్తూ, ఇవ్వకపోతే వారి మధ్య ఉన్న సంబంధాన్ని నిందితుడి భార్యకు చెబుతానని బెదిరించింది. భయాందోళనకు గురైన నిందితుడు, మృతురాలిని నమ్మకంగా ఎచ్చెర్ల వైపు నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లాడు. అక్కడ ఆమె చీర కొంగు, పుస్తెల తాడుతో గొంతు బిగించి హత్య చేసి, మంగళసూత్రం, సెల్ ఫోన్ తీసుకుని, మృతదేహాన్ని కింతలిమిల్ జంక్షన్ సమీపంలో రోడ్డుపై పడేసి పారిపోయాడు. అయితే సాంకేతిక ఆధారాలు, CC కెమెరాల ఆధారంగా ఎట్టకేలకు నిందితుడిని పట్టుకున్నారు పోలీసులు. చెడు మార్గంలో వెళ్ళినవారికి ఎప్పటికైనా చెడే ఎదరవుతుంది. ఒక్కోసారి అదివారి ప్రాణాలను సైతం బలిగొంటుంది అనటానికి సీతారత్నం హత్య ఒక నిదర్శనం అయింది.




