AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

CBI: ఢిల్లీ లిక్కర్ కేసులో తదుపరి అరెస్ట్ అయ్యేది ఆయనేనా? కోర్టులో సీబీఐ ఏం చెప్పిందంటే?

"ఢిల్లీ మద్యం పాలసీ అక్రమాల కేసులో అరెస్టై జైల్లో ఉన్న ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాకు బెయిల్ ఇవ్వొద్దు. త్వరలో ఒక హై ప్రొఫైల్ వ్యక్తిని అరెస్టు చేయబోతున్నాం." ట్రయల్ కోర్టులో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) తరపు న్యాయవాది చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి.

CBI: ఢిల్లీ లిక్కర్ కేసులో తదుపరి అరెస్ట్ అయ్యేది ఆయనేనా? కోర్టులో సీబీఐ ఏం చెప్పిందంటే?
Delhi Liquor Scam
Follow us
Mahatma Kodiyar

| Edited By: Srikar T

Updated on: Mar 18, 2024 | 5:58 PM

“ఢిల్లీ మద్యం పాలసీ అక్రమాల కేసులో అరెస్టై జైల్లో ఉన్న ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాకు బెయిల్ ఇవ్వొద్దు. త్వరలో ఒక హై ప్రొఫైల్ వ్యక్తిని అరెస్టు చేయబోతున్నాం.” ట్రయల్ కోర్టులో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) తరపు న్యాయవాది చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. ఢిల్లీ ఎక్సైజ్‌ కుంభకోణం కేసులో ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్‌ సిసోడియా బెయిల్‌ పిటిషన్‌పై రౌస్ అవెన్యూ కోర్టులో CBI ప్రత్యేక న్యాయమూర్తి ఎంకే నాగ్‌పాల్‌ ఎదుట జరిగిన విచారణ సందర్భంగా సీబీఐ తరఫు న్యాయవాది ఈ వ్యాఖ్యలు చేశారు. సిసోడియాకు బెయిల్ ఇవ్వొద్దని వాదనలు వినిపించే క్రమంలో దర్యాప్తు సంస్థ తరపు న్యాయవాది ఎవరిని ఉద్దేశించి ఈ మాటలు అన్నారన్నది ఇప్పుడు ప్రశ్నార్ధకంగా మారింది. ఈ కేసులో దర్యాప్తు ఇంకా కొనసాగుతోందని, ఈ పరిస్థితుల్లో మనీష్ సిసోడియాకు బెయిల్ మంజూరు చేయడం ద్వారా ఆయన విచారణకు అడ్డంకులు సృష్టించవచ్చని సీబీఐ తరఫు న్యాయవాది వాదించారు.

విచారణ వచ్చే 6-8 నెలల్లో ముగుస్తుందని గతంలో ఈడీ చెప్పిందని మనీష్ సిసోడియా తరపు న్యాయవాది తెలిపారు. నాలుగైదు నెలలు గడుస్తున్నా అభియోగాలపై ట్రయల్ ప్రారంభం కాలేదని అసహనం వ్యక్తం చేశారు. మనీష్ సిసోడియా అరెస్ట్ అయి 13 నెలలైందని, ఈ కేసులో మరో సహ నిందితుడు బినోయ్ బాబుకు బెయిల్ మంజూరైందని తెలిపారు. ప్రభుత్వ ఖజానాకు ఎలాంటి నష్టం వాటిల్లలేదని మనీష్ సిసోడియా తరపు న్యాయవాది తెలిపారు. ఇంకా చెప్పాలంటే ఈ కొత్త మద్యం విధానం కారణంగా ప్రభుత్వ ఖజానాకు ఆదాయం పెరిగిందని అన్నారు. అదే సమయంలో వినియోగదారులు కూడా లాభపడ్డారని సూత్రీకరించారు. మొత్తంగా ఈ వ్యవహారంలో తమకు నష్టం జరిగిందని ఏ ఒక్కరూ చెప్పలేదు అన్నారు.

6-8 నెలల్లో దర్యాప్తు పూర్తి చేస్తామని అదనపు సోలిసిటర్ జనరల్ చెప్పినందుకే సుప్రీంకోర్టు ఈడీకి మినహాయింపు ఇచ్చిందని సిసోడియా తరపు న్యాయవాది తెలిపారు. మనీష్ సిసోడియా దేశం విడిచి పారిపోయే అవకాశం లేదని, కోర్టు విధించే అన్ని షరతులను అంగీకరిస్తామని తెలిపారు. అలాగే సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం లేదని, సాక్షులను కూడా ప్రభావితం చేయలేరని వాదించారు. ఈ కేసులో నిందితులంతా ప్రభుత్వ సాక్షులుగా మారారని గుర్తు చేశారు. మొత్తంగా విచారణ ఆలస్యమవుతోందని మనీష్ సిసోడియా తరపు న్యాయవాది తెలిపారు. విచారణ నెమ్మదిగా సాగితే నిందితులు 3 నెలల తర్వాత బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించవచ్చని సుప్రీంకోర్టు పేర్కొందని, న్యాయపోరాటం నత్త నడకన సాగుతోందని తెలిపారు. అందుకే.. బెయిల్ మంజూరు చేయాలని తాము అభ్యర్థిస్తున్నామని చెప్పారు.

ఇవి కూడా చదవండి

ఇందుకు బదులిస్తూ.. ఈ జాప్యం అధికారుల వల్ల కాదని సీబీఐ పేర్కొంది. దర్యాప్తు సంస్థ తగిన ప్రక్రియను అనుసరిస్తోందని, ఈ కేసులో దర్యాప్తు చాలా క్లిష్టమైన దశలో ఉందని న్యాయవాది తెలిపారు. మనీష్ సిసోడియా ఈ కుట్రకు ప్రధాన నిందితుడు, కింగ్‌పిన్ అని సీబీఐ పేర్కొంది. అతను కుట్రకు సంబంధించి అత్యంత కీలకమైన పత్రాలు తమ సేకరించామని వెల్లడించింది. కేసు నమోదు చేసిన అనంతరం అతడి మొబైల్ ఫోన్ ధ్వంసం చేశారని పేర్కొంది. బెయిల్ కావాలంటూ సిసోడియా తరుపున, బెయిల్ ఇవ్వద్దంటూ సిబిఐ తరఫున జరిగిన వాదనల్లో త్వరలోనే హై ప్రొఫైల్ వ్యక్తిని అరెస్టు చేస్తామని చెప్పడం కొత్త చర్చకు దారితీసింది. ఇటు సిబిఐ, అటు ఈడి వంటి దర్యాప్తు సంస్థల నుంచి సమన్ల మీద సమన్లు తీసుకుంటూ విచారణకు హాజరు కాకుండా వ్యవహరిస్తున్న ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ గురించే ఈ వ్యాఖ్యలు చేసినట్టుగా చర్చ నడుస్తోంది. ఇప్పటికే ఈ కేసులో సౌత్ సిండికేట్ లో కీలక సూత్రధారిగా ఆరోపిస్తూ భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఈడి అరెస్టు చేసిన విషయం తెలిసిందే. కవితను కస్టడీకి కోరుతూ దాఖలు చేసిన పిటిషన్ లో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పాత్ర గురించి అనేక అంశాలను పొందుపరిచింది. ఈ పరిణామాలను గమనిస్తే ఆ హై ప్రొఫైల్ వ్యక్తి కేజ్రీవాల్ అన్న అనుమానాలు కలుగుతున్నాయి.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..