Rahul Gandhi Yatra: రాహుల్ ‘జోడో యాత్ర’ గేమ్ ఛేంజర్‌గా మారుతుందా? లేక బెడిసికొడుతుందా?
'భారత్ జోడో న్యాయ్ యాత్ర' పేరుతో రాహుల్ గాంధీ చేపట్టిన యాత్ర ముంబైలో ఓ భారీ బహిరంగ సభతో ముగిసింది. జనవరి 14న మణిపూర్ రాజధాని ఇంఫాల్ నుంచి ప్రారంభించిన యాత్ర దేశంలోని తూర్పు దిక్కున మొదలై పశ్చిమ దిశగా 14 రాష్ట్రాలను దాటుకుంటూ సాగిన ఈ యాత్ర రాజకీయంగా ఆ పార్టీకి ఎంత మేలు చేస్తుందన్నదే ఇప్పుడు అందరి మదిలో మెదులుతున్న ప్రశ్న.
‘భారత్ జోడో న్యాయ్ యాత్ర’ పేరుతో రాహుల్ గాంధీ చేపట్టిన యాత్ర ముంబైలో ఓ భారీ బహిరంగ సభతో ముగిసింది. జనవరి 14న మణిపూర్ రాజధాని ఇంఫాల్ నుంచి ప్రారంభించిన యాత్ర దేశంలోని తూర్పు దిక్కున మొదలై పశ్చిమ దిశగా 14 రాష్ట్రాలను దాటుకుంటూ సాగింది. ఈ యాత్ర రాజకీయంగా కాంగ్రెస్ పార్టీకి ఎంత మేలు చేస్తుందన్నదే ఇప్పుడు అందరి మదిలో మెదులుతున్న ప్రశ్న. గతంలో కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు దక్షిణం నుంచి ఉత్తర దిశగా పూర్తిగా కాలినడకన ‘భారత్ జోడో’ యాత్ర చేసిన రాహుల్ గాంధీ ఈసారి బస్సు యాత్ర ద్వారా మణిపూర్ నుంచి నాగాలాండ్, అస్సాం, మేఘాలయ, పశ్చిమ బెంగాల్, బిహార్, జార్ఖండ్, ఒడిశా, చత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, ఉత్తర్ ప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాల మీదుగా మహారాష్ట్ర వరకు దాదాపు 6,700 కి.మీ దూరం రాహుల్ గాంధీ పర్యటించారు. ముగింపు సభలో విపక్ష కూటమి (I.N.D.I.A)కు చెందిన పలువురు పెద్ద నేతలు హాజరయ్యారు. మమతా బెనర్జీ, ఏచూరి వంటి నేతలు హాజరుకాకపోయినా ఫరూఖ్ అబ్దుల్లా, శరద్ పవార్, తేజస్వి యాదవ్, స్టాలిన్, ఉద్ధవ్ థాకరే తదితరులు తమ ఐక్యతను, బలాన్ని చాటే ప్రయత్నం చేశారు. సార్వత్రిక ఎన్నికలకు నగారా మోగిన వేళ రెండు నెలల పాటు రాహుల్ గాంధీ చేసిన కృషికి తగ్గ ఫలితం దక్కుతుందా అన్నదే ప్రశ్నార్థకంగా మారింది.
పార్టీలో ఇలా..
విపక్ష కూటమి బలప్రదర్శన, నేతల ప్రసంగాల సంగతెలా ఉన్నా.. రాహుల్ గాంధీ చేసిన ‘భారత్ జోడో న్యాయ్ యాత్ర’ ద్వారా కాంగ్రెస్ పార్టీ పుంజుకుంటుందని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. కానీ యాత్ర జరుగుతున్న సమయంలోనే ఉత్తర్‌ప్రదేశ్ వంటి పెద్ద రాష్ట్రంతో పాటు మహారాష్ట్ర, రాజస్థాన్ సహా అనేక రాష్ట్రాల్లో కీలక నేతలు పార్టీని వీడిపోయారు. గల్లా పట్టుకుని మరీ తమ నేతలను భారతీయ జనతా పార్టీ (బీజేపీ) లాక్కెళ్తోందని రాహుల్ గాంధీ సభా వేదికపైనే ఆరోపణలు చేసినప్పటికీ.. వాస్తవ పరిస్థితి మరోలా ఉంది. అదే పార్టీలో కొనసాగితే తమకు రాజకీయ భవిష్యత్తు ఉండదన్న భావనే ఆ నేతలను పార్టీ వీడేలా చేస్తోందన్నది పార్టీ నేతల్లోనే వ్యక్తమవుతున్న అభిప్రాయంగా కనిపిస్తోంది. పార్టీ విజయావకాశాలు మెరుగుపడకపోవడం, పార్టీలో కొత్త తరం నేతలకు పెద్దగా అవకాశాలు లేకపోవడం వంటివి ఇందుకు ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి. మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో ముఖ్యమంత్రి పదవి ఆశించిన జ్యోతిరాదిత్య సింధియా, సచిన్ పైలట్ వంటి నేతలకు నిరాశే ఎదురైంది. సింధియా పార్టీ వీడి బీజేపీలో చేరి కేంద్ర మంత్రి అవ్వగలిగారు. సచిన్ పైలట్ అదే పార్టీలో ఉండి ఏదీ సాధించలేకపోయారు. చివరకు రెండు రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఘోర పరాజయం పాలైంది. కొత్త తరానికి పగ్గాలు అప్పగించే విషయంలో పార్టీలో సీనియర్లు అడ్డుతగులుతూ ఉంటారు. ఫలితంగా అంతర్గత విబేధాలు తలెత్తి అవి పార్టీకి మరింత చేటు చేస్తున్నాయి. అంతర్గత కుమ్ములాటలను కట్టడి చేసిన కర్ణాటక, తెలంగాణ వంటి రాష్ట్రాల్లో మాత్రమే పార్టీ పరిస్థితి ఆశాజనకంగా కనిపిస్తుంది తప్ప మిగతా రాష్ట్రాల్లో తిరోగమన దిశగానే పయనిస్తోంది.
రాహుల్ గాంధీ మొదటి ‘భారత్ జోడో యాత్ర’కు లభించినంత ఆదరణ రెండో యాత్రకు లభించలేదని రాజకీయ విశ్లేషకులు కొందరు అభిప్రాయపడుతున్నారు. తొలి యాత్ర అనంతరం కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో విజయం అందిపుచ్చుకున్నా.. ఆ ఊపును తర్వాత పార్టీ కొనసాగించలేకపోయింది. యాత్ర ప్రారంభమైన కొన్నాళ్లకే మహారాష్ట్రలో మిలింద్ దేవ్‌రా, అశోక్ చవాన్ వంటి కీలక నేతలు పార్టీ వీడి వెళ్లారు. ఆ ప్రవాహం ఇంకా అనేక రాష్ట్రాల్లో కొనసాగుతోంది. ముందు పార్టీలో ఏం జరుగుతుందో తెలుసుకోకుండా ప్రత్యర్థిపై యుద్ధానికి వెళ్లడాన్ని మించిన మూర్ఖత్వం మరొకటి లేదని అంతర్గతంగా చర్చ జరుగుతోంది. వరుసగా ఆయుధాలను వదులుకుంటూ యుద్ధ క్షేత్రంలో చేసేది ఏముంటుందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో యువ నాయకత్వం ఆశలను కాంగ్రెస్ అధిష్టానం చిదిమేయడంతో.. పార్టీ శ్రేణుల్లో, కొత్త తరం కార్యకర్తల్లో విశ్వాసం కోల్పోయింది. ఎంతకాలం పార్టీలో ఉన్నా, ఎంత కష్టపడి పనిచేసినా తమకు పదవులు దక్కుతాయన్న నమ్మకం వారికి లేకుండా పోయింది. అందుకే 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క తెలంగాణ మినహా రాజస్థాన్, చత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో ఘోర పరాజయం పాలైంది. తాజా హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో తలెత్తిన అంతర్గత విబేధాలు రాజ్యసభ ఎన్నికల్లో ఓటమికి కారణమయ్యాయి. ఏకంగా ప్రభుత్వమే పడిపోయే పరిస్థితి తలెత్తింది. ఆ సంక్షోభం ఇంకా సమసిపోలేదు.
కూటమిలో అలా..
పార్టీలో అంతర్గత పరిస్థితులు ఇలా ఉంటే.. కాంగ్రెస్ సారథ్యం వహిస్తున్న విపక్ష కూటమి (I.N.D.I.A)లోనూ ఇదే పరిస్థితి ప్రతిబింబిస్తోంది. సీట్ల సర్దుబాటు తగ్గ పేచీలతో కొన్ని పార్టీలు ఇప్పటికే కూటమికి గుడ్ బై చెప్పేశాయి. మరికొన్ని పార్టీలు ఒకట్రెండు రాష్ట్రాల్లో సర్దుబాటు, మిగతా రాష్ట్రాల్లో మాత్రం పోరు అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. విపక్షాలను ఏకతాటిపైకి తెచ్చి జట్టుకట్టడంలో కీలక పాత్ర పోషించిన జనతాదళ్ (యునైటెడ్) ఏకంగా కూటమిని వీడి బీజేపీ సారథ్యంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (NDA)లో చేరిపోయింది. తృణమూల్ కాంగ్రెస్ (TMC) తాము బెంగాల్‌లో ఉన్న మొత్తం 42 పార్లమెంట్ స్థానాల్లో ఒంటరిగానే పోటీ చేస్తామని ప్రకటించడమే కాదు, ఆ స్థానాలకు అభ్యర్థులను సైతం ప్రకటించేసింది. ఎంతో ప్రయాస తర్వాత సమాజ్‌వాదీతో సీట్ల సర్దుబాటు కుదిరింది. ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) మాత్రం ఢిల్లీ సహా మరికొన్ని రాష్ట్రాల్లో పొత్తు కుదుర్చుకున్నప్పటికీ ఆ పార్టీ అధికారంలో ఉన్న మరో రాష్ట్రం పంజాబ్‌లో పొత్తు పొడవలేదు. కమ్యూనిస్టులతో దేశమంతటా పొత్తు ఉన్నప్పటికీ.. కేరళలో రాహుల్ గాంధీ పోటీ చేస్తున్న వాయనాడ్ స్థానాన్ని సైతం వదిలిపెట్టకుండా కమ్యూనిస్టులు ఢీకొడుతున్నారు. “కేరళలో వైరం, దేశమంతటా స్నేహం” అంటూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సైతం కాంగ్రెస్ – కమ్యూనిస్టులను ఉద్దేశించి తీవ్ర విమర్శలు చేశారు.
వ్యూహం లేని దాడి
రాజకీయాల్లో ప్రత్యర్థిపై విమర్శలు, ఆరోపణలతో విరుచుకుపడితే చాలు.. తాము గెలుస్తామని చాలా మంది అనుకుంటారు. రాహుల్ గాంధీ కూడా ఆ కోవలోకే చేరినట్టు కనిపిస్తోంది. ఎదుటివారిని తిట్టడమే పనిగా పెట్టుకున్నారు తప్ప తాము అధికారంలోకి వస్తే ఏం చేస్తామన్న అంశాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వలేదు. యాత్రలో భాగంగా ఎవరైనా రాహుల్ గాంధీని ప్రశ్నిస్తే.. “మీ పేరేంటి? మీరు ఏ కులానికి చెందినవారు? మీ కులానికి చెందినవారు ఎంతమంది కీలక స్థాయిలో ఉన్నారు?” అంటూ చేసిన రాహుల్ గాంధీ వ్యాఖ్యలు నిజానికి లాభం చేయకపోగా, నష్టం కల్గిస్తున్నాయని ఆ పార్టీ నేతలే మధనపడుతున్నారు. కులగణన చేపట్టాలన్న డిమాండ్‌తో పాటు తాము అధికారంలోకి వస్తే వెంటనే కులగణన చేస్తామని రాహుల్ గాంధీ చెబుతున్నారు. ఏ కులం సంఖ్య ఎక్కువగా ఉంటే.. ఆ కులానికి అంత ప్రాధాన్యత దక్కాలన్నది ఆయన నినాదంగా కనిపిస్తోంది. ఓవైపు మతం పేరుతో బీజేపీ, ఆర్ఎస్ఎస్ సమాజంలో విద్వేషాలను పెంచుతున్నాయని ఆరోపిస్తున్న రాహుల్ గాంధీ.. మరోవైపు తన కులగణన నినాదంతో కులాల మధ్య చిచ్చుకు కారణమవుతున్నారు. అసలు కులగణనతో కలిగే ప్రయోజనాలు ఏంటో ప్రజలకు అర్థమయ్యేలా చెప్పడంలో రాహుల్ గాంధీ విఫలమవుతున్నారు.
ఇదిలా ఉంటే పార్టీలో తాజా యాత్రపై కొందరు నేతలు పెదవివిరుస్తున్నారు. సార్వత్రిక ఎన్నికల వేళ ఈ యాత్ర చేపట్టడం ద్వారా పార్టీ యంత్రాంగాన్ని ఎన్నికలకు సమాయత్తం చేయకుండా యాత్రకు ఏర్పాట్లు చేయడంలోనే నిమగ్నం చేశారని, ఫలితంగా పొత్తులు, సీట్ల సర్దుబాటు వ్యవహారం తేల్చడంలో జాప్యం జరిగిందని అంటున్నారు. అలాగే పార్టీ అభ్యర్థుల ఎంపిక కసరత్తులో సైతం బీజేపీతో పోల్చుకుంటే వెనుకపడిపోయిన స్థితిలో ఉన్నామని అంటున్నారు. యాత్ర ఎట్టకేలకు ముగియడంతో ఇకనైనా పార్టీలో, కూటమిలో నెలకొన్న విబేధాలు, అంతర్గత కుమ్ములాటలపై దృష్టి పెట్టి విపక్ష ఐక్యతను ఎన్నికల వరకు నిలబెట్టుకోగల్గితే కనీసం మర్యాద కాపాడుకునే సీట్లైనా సాధించుకోవచ్చు. లేదంటే 2014, 2019 నాటి ఫలితాలే పునరావృతమైనా ఆశ్చర్యపోనవసరం లేదు.
మరిన్ని జాతీయ వార్తలు చదవండి