IND W vs SL W : మన అమ్మాయిలు అదరహో..ఐదుకి ఐదు కొట్టి హిస్టరీ క్రియేట్ చేశారుగా!
IND W vs SL W : శ్రీలంకతో జరిగిన ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భారత మహిళల జట్టు విజయకేతనం ఎగురవేసింది. మంగళవారం తిరువనంతపురంలో జరిగిన ఆఖరి టీ20లో భారత్ అద్భుత విజయాన్ని అందుకుని, సిరీస్‌ను 5-0తో క్లీన్ స్వీప్ చేసింది.

IND W vs SL W : శ్రీలంకతో జరిగిన ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భారత మహిళల జట్టు విజయకేతనం ఎగురవేసింది. మంగళవారం తిరువనంతపురంలో జరిగిన ఉత్కంఠభరితమైన ఆఖరి పోరులో భారత్ 15 పరుగుల తేడాతో విజయం సాధించి, సిరీస్‌ను 5-0తో క్లీన్ స్వీప్ చేసింది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ వీరోచిత ఇన్నింగ్స్‌కు తోడు బౌలర్ల సమిష్టి ప్రదర్శన తోడవ్వడంతో టీమిండియా ఈ ఏడాదిని ఘనంగా ముగించింది.
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు ఆరంభంలో ఎదురుదెబ్బలు తగిలాయి. షెఫాలీ వర్మ (5), అరంగేట్రం ప్లేయర్ జీ కమలిని (12) త్వరగానే అవుట్ అయ్యారు. ఒక దశలో 77 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న జట్టును కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ ఒంటిచేత్తో ఆదుకుంది. ఆమె 43 బంతుల్లో 8 ఫోర్లు, 1 సిక్సర్‌తో 68 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను నిలబెట్టింది. ఆఖర్లో అరుంధతి రెడ్డి (27 నాటౌట్), అమన్‌జోత్ కౌర్ (21) మెరుపులు మెరిపించడంతో భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. లంక బౌలర్లలో కవిషా దిల్‌హరి 2 వికెట్లు తీసింది.
176 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంకకు ఆరంభంలోనే షాక్ తగిలింది. కెప్టెన్ చమరి ఆటపట్టు (2)ను అరుంధతి రెడ్డి అవుట్ చేసి భారత శిబిరంలో జోష్ నింపింది. అయితే ఇమేషా దులాని (50), హసిని పెరీరా (65) రెండో వికెట్‌కు అద్భుత భాగస్వామ్యాన్ని నెలకొల్పి మ్యాచ్‌ను ఉత్కంఠగా మార్చారు. ఒకానొక దశలో లంక గెలుస్తుందేమో అనిపించినా, భారత బౌలర్లు పుంజుకున్నారు. ఇమేషా, పెరీరాలను అవుట్ చేయడం ద్వారా భారత్ మళ్లీ పట్టు బిగించింది. ఆఖర్లో స్నేహ రాణా కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో శ్రీలంక 20 ఓవర్లలో 160 పరుగులకే పరిమితమైంది. దీంతో భారత్ 15 పరుగుల తేడాతో విజయం అందుకుంది.
ఈ మ్యాచ్‌లో స్టార్ ప్లేయర్లు స్మృతి మంధాన, రేణుక సింగ్‌లకు విశ్రాంతినిచ్చినప్పటికీ భారత జట్టు అద్భుతంగా రాణించింది. యువ బౌలర్ శ్రీ చరణి 1 వికెట్ తీయగా, అరుంధతి రెడ్డి, స్నేహ రాణా కీలక సమయాల్లో వికెట్లు తీశారు. సిరీస్ ఆరంభం నుంచి ఆధిపత్యం ప్రదర్శించిన భారత్, చివరి మ్యాచ్‌లోనూ అదే జోరును కొనసాగించి లంకను క్లీన్ స్వీప్ చేసింది. ఈ విజయంతో భారత మహిళల జట్టులో ఆత్మవిశ్వాసం రెట్టింపు అయింది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
