Lasith Malinga : శ్రీలంక వ్యూహం..యార్కర్ల కింగ్ మలింగకు పట్టాభిషేకం..వరల్డ్ కప్ కోసం స్పెషల్ డ్యూటీ
Lasith Malinga : ప్రపంచ క్రికెట్‌లో యార్కర్ల కింగ్, శ్రీలంక దిగ్గజం లసిత్ మలింగ గురించి తెలియని వారుండరు. రిటైర్ అయిన తర్వాత ఆయన మళ్ళీ మైదానంలోకి అడుగుపెడుతున్నాడు. అయితే ఈసారి బంతితో కాదు.. తన వ్యూహాలతో ప్రత్యర్థులను చిత్తు చేయడానికి సిద్ధమయ్యాడు.

Lasith Malinga : ప్రపంచ క్రికెట్‌లో యార్కర్ల కింగ్, శ్రీలంక దిగ్గజం లసిత్ మలింగ మళ్ళీ మైదానంలోకి అడుగుపెడుతున్నాడు. అయితే ఈసారి బంతితో కాదు.. తన వ్యూహాలతో ప్రత్యర్థులను చిత్తు చేయడానికి సిద్ధమయ్యాడు. 2026 ఫిబ్రవరిలో భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమివ్వనున్న టీ20 వరల్డ్ కప్ కోసం శ్రీలంక క్రికెట్ బోర్డు మలింగకు కీలక బాధ్యతలు అప్పగించింది.
కేవలం 21 రోజుల కోసం స్పెషల్ మిషన్
శ్రీలంక క్రికెట్ బోర్డు మలింగను జాతీయ జట్టుకు ఫాస్ట్ బౌలింగ్ సలహాదారుగా నియమించింది. అయితే ఇది పూర్తి స్థాయి కోచింగ్ కాదు. కేవలం టీ20 వరల్డ్ కప్ సన్నాహకాల్లో భాగంగా డిసెంబర్ 15, 2025 నుంచి జనవరి 25, 2026 వరకు మాత్రమే అతను జట్టుతో ఉంటాడు. అంటే సుమారు 21 రోజుల పాటు అతను శ్రీలంక బౌలర్లకు శిక్షణ ఇస్తాడు. ముఖ్యంగా డెత్ ఓవర్లలో పరుగులను ఎలా కట్టడి చేయాలి, యార్కర్లను ఎలా సంధించాలి అనే అంశాల్లో తన అనుభవాన్ని బౌలర్లతో పంచుకోనున్నాడు. 2014లో శ్రీలంకకు టీ20 ప్రపంచకప్ అందించిన ఘనత మలింగదే కావడం విశేషం.
మలింగ.. ఒక తిరుగులేని కెరీర్
మలింగ అంటేనే ఒక భయం. అతని వినూత్నమైన స్లింగింగ్ యాక్షన్ బ్యాటర్లకు ఎప్పుడూ ఒక సవాలే. తన అంతర్జాతీయ కెరీర్‌లో 30 టెస్టుల్లో 101 వికెట్లు, 226 వన్డేల్లో 338 వికెట్లు, టీ20ల్లో 107 వికెట్లు సాధించి మొత్తం 500 పైగా వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. కేవలం అంతర్జాతీయ క్రికెట్లోనే కాదు, ఐపీఎల్ లోనూ ముంబై ఇండియన్స్ తరపున ఆడి 170 వికెట్లు తీసి చరిత్ర సృష్టించాడు. ఈ సుదీర్ఘ కెరీర్‌లో అతను సంపాదించింది కూడా ఎక్కువే. నివేదికల ప్రకారం మలింగ నికర ఆస్తి విలువ సుమారు రూ. 75 కోట్లు.
శ్రీలంక ఆశలు మలింగ పైనే
టీ20 ఫార్మాట్‌లో శ్రీలంక జట్టు పూర్వవైభవం కోసం తహతహలాడుతోంది. స్వదేశంలో జరిగే ప్రపంచకప్ కావడంతో ఎలాగైనా ట్రోఫీ కొట్టాలని పట్టుదలతో ఉంది. అందుకే డెత్ బౌలింగ్ స్పెషలిస్ట్ అయిన మలింగ సేవలను వాడుకోవాలని బోర్డు నిర్ణయించింది. మలింగ పర్యవేక్షణలో శ్రీలంక యువ బౌలర్లు రాటుదేలితే.. రాబోయే వరల్డ్ కప్‌లో ఆ జట్టు ప్రత్యర్థులకు చుక్కలు చూపించడం ఖాయం.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
