రాహుల్ గాంధీ
రాహుల్ గాంధీ.. కాంగ్రెస్ నేతగా, గాంధీ కుటుంబానికి వారసుడిగా ఆయనకు దేశ వ్యాప్తంగా ప్రత్యేక క్రేజ్ ఉంది. దేశ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ, సోనియా గాంధీకి 1970 జూన్ 19న రాహుల్ గాంధీ ఢిల్లీలో జన్మించారు. 2017 డిసెంబరు నుంచి 2019 ఆగస్టు వరకు ఆయన కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా పనిచేశారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ కూటమి ఘోర పరాభవం తర్వాత పార్టీ సారథ్య పగ్గాలు విడిచిపెట్టారు. యూపీలో గాంధీ కుటుంబానికి కంచుకోటలాంటి అమేథీ నియోజకవర్గానికి 2004 నుంచి 2019 వరకు మూడు పర్యాయాలు రాహుల్ ప్రాతినిథ్యంవహించారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో అమేథీతో పాటు కేరళలోని వయనాడ్ లోక్‌సభ నియోజకవర్గాల నుంచి పోటీ చేసిన ఆయన. అమేథీలో స్మృతి ఇరానీ చేతిలో ఓటమి చెందారు.. వయనాడ్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఎంపీగా విజయం సాధించారు. దేశంలో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకొచ్చే లక్ష్యంతో 2022 సెప్టెంబర్ 7న తమిళనాడులోని కన్యాకుమారి నుంచి రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర చేపట్టారు. ఐదు మాసాల వ్యవధిలో 12 రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాల మీదుగా 4,080 కిలో మీటర్లు రాహుల్ పాదయాత్ర సాగింది.
జోడోయాత్ర జరుగుతున్న సమయంలో ఆయన ఇచ్చిన ఓ ఇంటర్వ్యూ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తన చిన్ననాటి జ్ఞాపకాల దగ్గర నుంచి పెళ్లి వరకు అన్ని అంశాలపై ఇందులో రాహుల్ గాంధీ బదులిచ్చారు. తన నానమ్మ, మాజీ ప్రధాని ఇందిరా గాంధీ గురించి.. రాహుల్ ప్రముఖంగా ప్రస్తావించారు. నాయనమ్మ ఇందిరా గాంధీ అంటే తనకు ఎంతో ప్రేమని, ఆమె తనకు మరో మాతృమూర్తి లాంటి వారన్నారు. ఈ సమయంలో కాబోయే భార్య ఎలా ఉండాలని అడిగిన ప్రశ్నకు కూడా రాహుల్ తనదైన శైలిలో జవాబిచ్చారు. మంచి సుగుణాలున్న మహిళ అయితే అభ్యంతరం లేదన్నారు. పెళ్లికి తాను వ్యతిరేకం కాదన్నారు. తన అమ్మానాన్నది ప్రేమ వివాహమని గుర్తుచేసుకున్న రాహుల్.. తనకు ఇంటెలిజెంట్ అమ్మాయి అయితే చాలన్నారు. నాన్ వెజ్ అంటే రాహుల్‌కి ఎంతో ఇష్టం.. కార్లపై అంతగా మోజు లేదని.. బైక్స్ నడపడం అంటే ఇష్టమన్నారు రాహుల్.