Parliament Winter Session: రేపట్నుంచే పార్లమెంట్ శీతాకాల సమావేశాలు.. కేంద్రం ప్రవేశపెట్టబోయే బిల్లులు ఇవే!
ఢిల్లీ వాయు కాలుష్యం ఈసారి పార్లమెంట్‌ను కమ్మేయనుంది.. అత్యంత ప్రమాదకర స్థాయిలో ప్రజలు శ్వాసించాలంటే భయపడేలా ఉన్న వాయు నాణ్యత గురించి దేశ అత్యున్నత చట్ట సభ అయిన పార్లమెంట్లో చర్చ పెట్టేందుకు విపక్షాలు సిద్ధమవుతున్నాయి. సోమవారం నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్ శీతకాల సమావేశాల్లో ఈ అంశాన్ని లేవనెత్తనున్నాయి. సోమవారం మొదలై డిసెంబర్ 19 వరకు 15 సిట్టింగుల్లో జరిగే సమావేశాలు వాడి వేడిగా జరగనున్నాయి.

పార్లమెంట్ సమావేశాలు సజావుగా జరిగేందుకు విపక్షాల సహకారం కోరుతూ ఆదివారం కేంద్రం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసింది. రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్,పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు నేతృత్వంలో జరిగే సమావేశంలో అన్ని పార్టీల పార్లమెంటరీ పక్ష నేతలు పాల్గొన్నారు. బిల్లుల ఎజెండాను అన్ని పక్షాలకు అందజేయడమే కాకుండా సభ సజావుగా సాగేందుకు సహకరించాలని,కీలక బిల్లులపై జరిగే చర్చల్లో పాల్గొనాలని బిల్లుల ఆమోదానికి సహకరించాలని కేంద్రం విపక్షాలను కోరింది. ఇక పార్లమెంట్‌లో అనుసరించాల్సిన వ్యూహాలపై సోనియా నివాసంలో కాంగ్రెస్ నేతల కీలక సమావేశం జరగనుంది.
పార్లమెంట్ ముందుకు ఢిల్లీ కాలుష్య సమస్య
దేశవ్యాప్తంగా చలి ప్రతాపాన్ని చూపిస్తుంటే రాజధాని ఢిల్లీ కాలుష్యంతో సతమతమవుతోంది. కాలుష్యం పై మోదీ ప్రభుత్వం నోరు మెదపకపోవడం, ఢిల్లీ బీజేపీ ప్రభుత్వం పొల్యూషన్ తీవ్రతను తక్కువ చేసి చూపిస్తున్నారని ప్రతిపక్షాలు సహా ఇప్పటికే నగర యువత, పర్యావరణ వేత్తలు ఆందోళనల బాటపట్టారు. దీంతో ఢిల్లీ కాలుష్యంపై ప్రతిపక్షాలు స్పందించాయి. పార్లమెంట్ శీతాకాల సమావేశాలల్లో ఢిల్లీ వాయు కాలుష్యంపై చర్చించాల్సేందని ఇప్పటికే లోకసభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. దేశ రాజధాని ఢిల్లీలో నానాటికి క్షీణిస్తున్నా వాయు నాణ్యతపై ప్రధాని మోదీ ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. ఈ అత్యవసర ఆరోగ్య పరిస్థితి పై త్వరలో ప్రారంభం కానున్న పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో చర్చించాలని డిమాండ్ చేశారు.
వాయుకాలుష్యం వల్ల చిన్నారులు ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి ఆయన కొంతమంది తల్లులతో తన నివాసంలో చర్చించారు. ఇందుకు సంబంధించిన వీడియోను ఆయన ఎక్స్ వేదికగా పోస్ట్ వేశారు. తాను కలిసిన ప్రతి మాతృమూర్తి ఒకే విషయం గురించి మాట్లాడుతున్నారని, పిల్లలు విషపూరిత గాలిని పీలుస్తూ పెరుగుతున్నారని చెబుతున్నారు. దేశంలోని చిన్నారులు మన ముందే ఇబ్బందులకు గురవుతున్నారు. అయినా ప్రధాని ఎలా మౌనంగా ఉండగలుగుతున్నారని? రాహుల్ ప్రశ్నించారు. అసలు ప్రభుత్వం ఎందుకు అప్రమత్తత, ప్రణాళిక, జవాబుదారీతనం చూపడం లేదు? గాలి కాలుష్యంపై పార్లమెంటులో చర్చ జరగాలని, ఈ అత్యవసర ఆరోగ్య పరిస్థితిని కట్టడి చేయడానికి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ పార్లమెంటరీ స్ట్రాటజీ సమావేశం
పార్లమెంట్‌లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించేందుకు సాయంత్రం సోనియాగాంధీ నివాసంలో కాంగ్రెస్ పార్టీ కీలక సమావేశాన్ని నిర్వహిస్తోంది.. ముఖ్యంగా దేశవ్యాప్తంగా చర్చానీయంశంగా మారిన SIR విధానంపై పార్లమెంట్ ను స్తంబింపజేయచాలని విపక్షాలు భావిస్తున్నాయి. దీనితో పాటు ఢిల్లీ వాయు కాలుష్యం అంశం కూడా పార్లమెంట్‌నూ కమ్మేయనుందన్న చర్చ జరుగుతుంది
పార్లమెంట్ ముందుకు రాననున్న కీలక బిల్లులు
పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ప్రవేశపెట్ట బోయే బిల్లుల జాబితాను కేంద్రం సిద్ధం చేసింది. ఈ సమావేశాల్లో ముఖ్యంగా పౌర అణు ఇంధన రంగంలో ప్రైవేట్ రంగానికి స్వాగతం పలికేందుకు ఉద్దేశించిన బిల్లుతోపాటు పది బిల్లులను ఈసారి పార్లమెంట్ ఉభయసభల్లో ప్రవేశపెట్టాలని మోదీ సర్కారు నిర్ణయించింది. ఈ మేరకు లోకసభ, రాజ్యసభ బులెటెన్ లలో కేంద్రం ప్రభుత్వం పలు అంశాలను వెల్లడించింది.
అణు ఇంధన బిల్లు, 2025 తోపాటు కార్పోరేట్ చట్టాల (సవరణ) బిల్లు-2025, సెక్యూరిటీస్ మార్కెట్స్ కోడ్ బిల్లు-2025, జాతీయ రహదారు ల(సవరణ) బిల్లులను ఉభయసభల ముందుకు తీసుకురానున్నారు. జాతీయ రహదారుల విస్తరణ, పొడగింపు కోసం భూసేకరణ ప్రక్రియ అత్యత అత్యంత పారదర్శకంగా, వేగంగా జరిగేందుకు వీలుగా నేషనల్ హైవేస్(సవరణ) బిల్లు తీసుకొస్తు న్నారు. సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇం డియా చట్టం- 1992, డిపాజిటరీస్ చట్టం – 1996, సెక్యూరిటీస్ కాంట్రాక్ట్స్(నియంత్రణ) చట్టం – 1956 లను విలీనంచేసేందుకు ఉద్దేశించిన సెక్యూరిటీస్ మార్కెట్స్ కోడ్ బిల్లు-2025ను తీసుకొస్తున్నారు.
ఆర్టిట్రేషన్, కాన్సిలియేషన్ చట్టంలోని 34వ సెక్షన్ కు సవరణలు తేవాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. చేయని తప్పులకు కంపెనీల డైరెక్టర్లు బాధ్యులు అవుతున్నారు.. ఈక్రమంలోనే అవాంఛనీయ దర్యాప్తు, విచారణల నుంచి డైరెక్టర్లకు రక్షణ కల్పించాలన్న ఉద్దేశ్యంతో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఆర్బిట్రేషన్, కాన్సిలియేషన్ చట్ట సంబంధ బిల్లును పార్ల మెంట్‌లో ప్రవేశపెట్టనున్నారు. అయితే పలు సూచనల కోసం కమిటీకి సిఫార్సు చేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. దేశంలో ఏకీకృత ఉన్నత విద్యా కమిషన్ ఏర్పాటు లక్ష్యంగా కేంద్రం కొత్త బిల్లును తీసుకురావాలని చూస్తోంది.
ది హయ్యర్ ఎడ్యుకేషన్ కమిషన్ ఆఫ్ ఇండియా(హెచ్ సీఐ) బిల్లు అని పేరును ఖరారు చేశారు. విశ్వవిద్యాలయాలు, ఇతర ఉన్నత విద్యా సంస్థలు ఇకపై స్వయంప్రతిపత్తితో పారదర్శకతతో అత్యున్నత విద్యాప్రమాణాలను పాటించేలా చూడడమే ఈ బిల్లు లక్ష్యం. విశ్వవిద్యాలయాల నిధుల సంఘం (యూజీసీ), సాంకేతిక విద్యాంశాలను చూసే అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ), టీచర్ల విద్యాంశాలను చూసే జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలిలను విలీనం చేస్తూ హెచ్‌సీ ఐ తేవాలని బిల్లులో ప్రతిపాదించనున్నారు.
కీలకం కానున్న SIR 2.0, ఓట్ల చోరీ, కాలుష్యం అంశాలు
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలను బీహార్ ఎస్ ఐ ఆర్ కుదిపేస్తే శీతాకాల సమావేశాలను SIR 2.0 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమం కుదిపేయనుంది. దీనికి తోడు రాహుల్ గాంధీ ఓట్ల చోరీ అంశాన్ని మరోసారి పార్లమెంట్లో ప్రస్తావించే అవకాశం ఉంది. SIR 2.0కి వ్యతిరేకంగా ప్రతిపక్ష పార్టీలు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికే పలు రాష్ట్రాలు సుప్రీంకోర్టును ఆశ్రయించి న్యాయపోరాటం చేస్తున్నాయి. ఇదే అంశాన్ని పార్లమెంట్‌లో ప్రస్తావించి ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు విపక్షాలు సన్నద్ధం అవుతున్నాయి.
ఎర్రకోట కారు పేలుడు ఉగ్రదాడిపై ప్రకటన చేయనున్న కేంద్రం
నవంబర్ 10న ఎర్రకోట వద్ద జరిగిన కారు పేలుడులో 15 మంది చనిపోగా 20 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు.. దీనిపై కేంద్ర హోం మంత్రి పార్లమెంట్లో ప్రకటన చేయనున్నారు.. ఇప్పటికే ఈ కేసును NIA దర్యాప్తు చేస్తుండగా కీలక విషయాలను వెలుగులోకి తెస్తుంది..కేసు దర్యాప్తు పురోగతి సహా ఉగ్రవాదం పై భారత వైఖరి గురించి పార్లమెంట్ వేదికగా ప్రభుత్వం సమాధానం ఇవ్వనుంది
ఈ సారి పార్లమెంట్‌లో ప్రవేశ పెట్టేందుకు ప్రభుత్వం జాబితా చేసిన బిల్లుల ఇవే
- జన్ విశ్వాస్ (నిబంధనల సవరణ) బిల్లు 2025
- ది ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్టసీ వోడ్ (సవరణ) బిల్లు 2025
- భీమా చట్టాలు (సవరణ) బిల్లు 2025
- మణిపూర్ వస్తు సేవల పన్ను (సవరణ) బిల్లు, 2025
- జాతీయ రహదారులు (సవరణ) బిల్లు, 2025
- ది అణుశక్తి బిల్లు, 2025
- కార్పొరేట్ చట్టాలు (సవరణ) బిల్లు, 2025
- సెక్యూరిటీస్ మార్కెట్స్ కోడ్ బిల్లు (SMC), 2025
- ది ఆర్బిట్రేషన్ అండ్ కన్సిలియేషన్ (సవరణ) బిల్లు, 2025
- భారత ఉన్నత విద్యా కమిషన్ బిల్లు 2025
- రాజ్యాంగం (131వ సవరణ) బిల్లు 2025
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




