దేశ ఆర్థిక గమనాన్ని డిసైడ్ చేసేందుకు రంగం సిద్ధం.. నేటి నుంచి కేంద్ర బడ్జెట్ సమావేశాలు!
నేడు బుధవారం (జనవరి 28, 2026) నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఢిల్లీలో అఖిలపక్ష భేటీ నిర్వహించిన కేంద్రం.. బడ్జెట్ సమావేశాలు సజావుగా సాగేందుకు సహకరించాలని కోరింది. అటు.. అధికార, ప్రతిపక్షాలు వ్యూహప్రతివ్యూహాల్లో నిమగ్నమయ్యాయి. పార్లమెంట్ సమావేశాల్లో ఏఏ అంశాలపై గళమెత్తాలనేదానిపై అన్ని పార్టీలూ అజెండా ఫిక్స్ చేసుకోవడం ఆసక్తి రేపుతోంది.

నేడు బుధవారం (జనవరి 28, 2026) నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఢిల్లీలో అఖిలపక్ష భేటీ నిర్వహించిన కేంద్రం.. బడ్జెట్ సమావేశాలు సజావుగా సాగేందుకు సహకరించాలని కోరింది. అటు.. అధికార, ప్రతిపక్షాలు వ్యూహప్రతివ్యూహాల్లో నిమగ్నమయ్యాయి. పార్లమెంట్ సమావేశాల్లో ఏఏ అంశాలపై గళమెత్తాలనేదానిపై అన్ని పార్టీలూ అజెండా ఫిక్స్ చేసుకోవడం ఆసక్తి రేపుతోంది.
దేశ ఆర్థిక గమనాన్ని డిసైడ్ చేసే కేంద్ర బడ్జెట్‌కు రంగం సిద్ధమైంది. బుధవారం నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. రెండు విడతల్లో బడ్జెట్ సమావేశాలు జరగనుండగా.. ఫిబ్రవరి 13 వరకు మొదటి దశ, మార్చి 9 నుంచి ఏప్రిల్ 2 వరకు రెండో విడత సమావేశాలు కొనసాగనున్నాయి. బుధవారం, జనవరి 28న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగంతో పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతాయి. ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. పార్లమెంట్ చరిత్రలో మొదటిసారి ఆదివారం బడ్జెట్ ప్రవేశపెడుతుండడం చర్చగా మారింది. ఆ తర్వాత.. ఫిబ్రవరి 2 నుంచి 4 వరకు రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ జరగనుంది. ఈ క్రమంలోనే.. ఫిబ్రవరి 13 వరకు మొదటి దశ పార్లమెంట్ సమావేశాలు జరగనున్నాయి.
ఉదయం 11 గంటలకు ఉభయ సభలనుద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగించనున్నారు. ఐదోసారి పార్లమెంట్‌లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగం కొనసాగనుంది. ప్రభుత్వ పాలన, రంగాల వారిగా ప్రజలకు అందిస్తున్న సంక్షేమ పథకాలు, దేశాభివృద్ధి, దేశ రక్షణ, వికసిత భారత లక్ష్యంగా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై ప్రసంగించనున్నారు రాష్ట్రపతి. దేశ రక్షణ, ఆపరేషన్ సిందూర్, ఆర్థికాభివృద్ధి, వ్యవసాయం, విద్య, ఆరోగ్యం, యువతకు ఉపాధికల్పన, దేశ ఆర్థిక వ్యవస్థ, జీఎస్టీ సంస్కరణలు, పన్ను రాయితీలు, మౌలిక వసతుల కల్పన, రైతు,మహిళా సంక్షేమం, గ్రామీణ అభివృద్ధి, దేశంలో వామపక్ష తీవ్రవాదాన్ని నిర్మూలించడానికి కొనసాగుతున్న ప్రయత్నాలు, రక్షణ రంగంలో ఎగుమతుల పెరుగుదల.. స్వదేశీ రక్షణ ఉత్పత్తి, రక్షణ రంగం ఆధునీకరణ అంశాలను రాష్ట్రపతి తన ప్రసంగంలో ప్రస్తావించనున్నారు.
పార్లమెంట్ సమావేశాల ప్రారంభం నేపథ్యంలో కేంద్రం అఖిలపక్ష సమావేశం నిర్వహించింది. కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు అధ్యక్షతన కొనసాగిన ఈ సమావేశంలో అన్ని పార్టీల నేతలు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ నుంచి శ్రీకృష్ణదేవరాయలు, జనసేన నుంచి బాలశౌరి, YCP తరపున మిథున్ రెడ్డి, సుభాష్ చంద్రబోస్ హాజరయ్యారు. BRS నుంచి సురేష్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా.. ఆమోదించాల్సిన బిల్లులు, శాసనాలు, అజెండాలపై చర్చించారు. శాసనపరమైన అజెండాను వివరించడంతో పాటు.. బడ్జెట్ సమావేశాలు సజావుగా సాగేందుకు సహకరించాలని కేంద్రమంత్రి కిరణ్ రిజిజు అన్ని పార్టీలను కోరారు. అదే సమయంలో.. వివిధ పార్టీలు లేవనెత్తే అన్ని అంశాలను నోట్ చేసుకుని చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామని కిరణ్‌రిజిజు తెలిపారు.
ఇక.. కేంద్రం పలు కీలక బిల్లులను ప్రవేశపెట్టనుండగా.. ఉపాధి హామీ పథకానికి చెందిన “వీబీ జీ రామ్ జీ” బిల్లును వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ నిరసనలకు సిద్ధమవుతోంది. అలాగే మన్రేగా, SIR, పర్యావరణ అంశాలు ఆరావళి, గ్రేట్ నికోబార్, జమ్మూ కాశ్మీర్ కు రాష్ట్ర హోదా, ఇండోర్, అహ్మదాబాద్‌లో కలుషిత నీటి మరణాలు, భారతదేశ విదేశాంగ విధానం, అమెరికా సంకాలు, రూపాయి పతనం, దేశ ఆర్థిక వ్యవస్థ పతనం అంశాలను పార్లమెంట్ లో లేవనెత్తాలని ప్రతిపక్ష కాంగ్రెస్ నిర్ణయించినట్లు సమాచారం.
ఇటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని అధికార, విపక్షాలు కూడా పార్లమెంట్ సమావేశాల అజెండాను ఫిక్స్ చేసుకున్నాయి. అమరావతికి చట్టబద్ధత కల్పించడం, నదుల అనుసంధానం, PPP విధానంపై చర్చకు టీడీపీ ప్లాన్ చేస్తోంది. అమరావతి రైతులకు న్యాయం చేయాలనే డిమాండ్‌ను YCP తెరపైకి తెస్తోంది. అలాగే.. తెలంగాణలో ప్రకంపనలు రేపుతోన్న సింగరేణి బొగ్గు స్కామ్, నదుల అనుసంధానం, నీటి పంపకాలు, విభజన చట్టంలోని పెండింగ్ అంశాలను BRS లేవనెత్తబోతోంది. మొత్తంగా.. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో కీలక అంశాలు చర్చకు రానుండడం.. అధికార, విపక్షాలు అజెండా ఫిక్స్ చేసుకోవడం లాంటి పరిణామాలు హీట్ పెంచుతున్నాయి.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
