న్యూ ఇయర్ వేడుకల వేళ హైఅలర్ట్.. జమ్ముకశ్మీర్‌లో కొనసాగుతున్న ఉగ్రవేట..
జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవేట కొనసాగుతోంది. జైషే ఉగ్రవాదులు చొరబడినట్టు సమాచారం రావడంతో హైఅలర్ట్ ప్రకటించారు. జమ్ము బస్టాండ్‌లో అనుమానాస్పద బ్యాగ్ లభించడంతో బాంబ్ స్క్వాడ్ తనిఖీలు చేసింది. అయితే.. జమ్ముకశ్మీర్‌లో నెలరోజుల పాటు హైఅలర్ట్ అమల్లో ఉంటుందని కేంద్ర హోంశాఖ ప్రకటించింది. జనవరి 26 రిపబ్లిక్ డే వరకు కశ్మీర్ అంతటా నిఘా కట్టుదిట్టం చేయాలని ఆదేశాలు జారీ చేశారు.

జమ్ముకశ్మీర్‌లో న్యూ ఇయర్ వేడుకల వేళ హైఅలర్ట్ కొనసాగుతోంది. దోడా, కిష్త్వార్ ప్రాంతాల్లో ఉగ్రవాదుల కోసం గాలిస్తున్నాయి భద్రతా బలగాలు. రెండు గ్రూపులుగా విడిపోయిన జైషే మహ్మద్ ఉగ్రవాదులు చొరబడినట్టు నిఘా వర్గాలు హెచ్చరించాయి. ఆర్మీతో పాటు సీఆర్‌పీఎఫ్ , బీఎస్‌ఎఫ్ బలగాలు సోదాల్లో పాల్గొంటున్నాయి. జమ్ము బస్టాండ్‌లో అనుమానాస్పద బ్యాగ్ లభించడంతో బాంబ్ స్క్వాడ్ తనిఖీలు చేపట్టింది. ఎలాంటి పేలుడు పదార్ధాలు లభించకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. జమ్ములో పలు చోట్ల సోదాలు నిర్వహించారు పోలీసులు. జమ్ము-నేషనల్ హైవేపై ప్రత్యేక తనిఖీలు నిర్వహంచారు.
‘చిల్లై కలాన్’ నడుస్తున్నప్పటికీ గడ్డకట్టే చలిని లెక్కచేయకుండా సైన్యం సెర్చ్ ఆపరేషన్‌ను ముమ్మరం చేసింది. గతంలో పహల్గామ్ మారణకాండకు పాల్పడిన పాక్ ఉగ్రవాదులు డోడా, కిష్త్వార్ మార్గం ద్వారానే అనంతనాగ్ చేరుకున్నారు. అందుకే ఈసారి ఎటువంటి పొరపాట్లకు తావులేకుండా సైన్యం కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది. మంచు ప్రాంతాలలో తాత్కాలిక నిఘా పోస్టులు, బేస్ క్యాంపులను ఏర్పాటు చేశారు. ఉగ్రవాదుల కదలికలను, వారు దాక్కున్న స్థావరాలను గుర్తించడానికి నిరంతర నిఘా కొనసాగుతోంది.
జమ్ముకశ్మీర్‌లో నెలరోజుల పాటు హైఅలర్ట్
జమ్ముకశ్మీర్‌లో నెలరోజుల పాటు హైఅలర్ట్ అమల్లో ఉంటుందని కేంద్ర హోంశాఖ ప్రకటించింది. జనవరి 26 రిపబ్లిక్ డే వరకు కశ్మీర్ అంతటా నిఘా కట్టుదిట్టం చేయాలని ఆదేశాలు జారీ చేశారు. సరిహద్దు గ్రామాల్లో ఉగ్రవాదుల కోసం అణువణువు జల్లెడ పడుతున్నారు. మైనస్ డిగ్రీల ఉష్ణోగ్రతల్లో కూడా కూంబింగ్ కొనసాగుతోంది. మంచు దుప్పటి కప్పుకున్న అందాల కాశ్మీర్ లోయలో జరుపుకోడానికి ఉత్సాహం చూపిస్తున్నారు.
ఉగ్రవాదుల బెదిరింపులను లెక్క చేయకుండా భారీ సంఖ్యలో టూరిస్టులు కశ్మీర్ చేరుకుంటున్నారు. పహల్గామ్‌లో ఎక్కడ చూసినా టూరిస్టుల సందడే కన్పిస్తోంది. వేలాదిమంది టూరిస్టులు పహల్గామ్‌లో మంచు సీజన్‌ను ఎంజాయ్ చేస్తున్నారు. గుల్మార్గ్‌తో సహా పర్యాటక ప్రాంతాల్లో విపరీతమైన రద్దీ కన్పిస్తోంది. హిమపాతాన్ని ఎంజాయ్ చేయడానికి జనం తరలివస్తున్నారు. పహల్గామ్ దాడి తర్వాత కశ్మీర్‌లో పర్యాటక రంగంపై తీవ్ర ప్రభావం పడింది. అయితే ఇప్పుడు పరిస్థితి మెరుగయ్యింది. పహల్గామ్ డెవలప్‌మెంట్ అథారిటీ CEO హిలాల్ అహ్మద్ ప్రకారం, పహల్గామ్ ఎల్లప్పుడూ పర్యాటకులకు గమ్యస్థానంగా ఉండేలా చూసేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తునట్టు తెలిపారు.
72 టెర్రర్ లాంచ్‌ప్యాడ్లు మళ్లీ యాక్టివ్
కొద్దరోజుల క్రితం పాకిస్తాన్ 72 టెర్రర్ లాంచ్‌ప్యాడ్లను మళ్లీ యాక్టివ్ చేసినట్టు నిఘా వర్గాలు గుర్తించాయి. కథువా జిల్లాలో భద్రతా బలగాల గాలింపు చర్యలు చేపట్టాయి. ఇద్దరు అనుమానితులు సంచరిస్తున్నారన్న సమాచారంతో గాలింపు చర్యలు చేపట్టారు. ఉజ్ నది సమీపంలోని రెండు వేర్వేరు ప్రదేశాలలో అనుమానితుల సంచారం ఉన్నట్టు గుర్తించారు. మరోవైపు శ్రీనగర్‌లో కూడా గాలింపు చర్యలు చేపట్టారు. లాల్‌చౌక్ ప్రాంతంలో దుకాణాల్లో సోదాలు చేశారు. రిపబ్లిక్ డే వేడుకలను ఉగ్రవాదులు టార్గెట్ చేశారన్న సమాచారం రావడంతో గాలింపు చర్యలు చేపట్టారు.
శీతాకాలం కావడంతో చొరబాట్లకు అనుకూలం
శీతాకాలం కావడంతో చొరబాట్లకు అనుకూలంగా ఉంటుందని ఉగ్రమూకలు భావిస్తున్నాయి. అందుకే పాకిస్తాన్ ఐఎస్‌ఐ సహకారంతో వందలాదిమంది ఉగ్రవాదుల చొరబాట్లకు కుట్ర జరుగుతోంది. అందుకే భద్రతా బలగాలు టూరిస్టు కేంద్రాలపై ప్రత్యేక నిఘా పెట్టాయి. శ్రీనగర దాల్ సరస్సు దగ్గర కూడా కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. ఉగ్రవాదుల మద్దతుదారులపై కూడా గట్టి నిఘా నెట్టారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
