AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TTD: టీటీడీ తీసుకున్న ఆ రెండు తీర్మానాలు చారిత్రాత్మకమా.. వివాదాస్పదమా..

రాజకీయ ప్రయోజనాల కోసం ధార్మిక సదస్సు నిర్వహించలేదని అందుకోసం నిర్ణయాలు తీసుకోలేదన్నారు. సనాతన ధర్మ ప్రచారాన్ని విస్తృతం చేయాలనే ధార్మిక సదస్సు నిర్వహించామన్న భూమన 19 కీలక తీర్మానాలను సదస్సు చేసిందన్నారు. 62 మంది పీఠాధిపతులు మహానుభావులు సదస్సులో పాల్గొన్నారని, 17 తర్వాత జరిగిన ధార్మిక సదస్సు సనాతన హిందూ ధర్మ ప్రచారానికి చేపట్టాల్సిన కార్యక్రమాలను చర్చించిందన్నారు.

TTD: టీటీడీ తీసుకున్న ఆ రెండు తీర్మానాలు చారిత్రాత్మకమా.. వివాదాస్పదమా..
Ttd
Raju M P R
| Edited By: Surya Kala|

Updated on: Feb 05, 2024 | 6:40 PM

Share

తిరుమల శ్రీవారి సేవకు ఇతర మతస్తులను అనుమతిస్తారా.. హిందూ మత సాంప్రదాయాలను ఆచరించేందుకు సిద్ధమయ్యే ఇతర మతస్తులను హిందువులుగా మార్చేందుకు టీటీడీ సిద్దం కానుందా… ఇందుకు తిరుమల వేదిక కానుందా… స్వచ్ఛందంగా హిందూ మతాన్ని స్వీకరించేందుకు ముందుకొచ్చే వాళ్లకు సంప్రోక్షణ చేసి దైవ దర్శనం కల్పించాలన్న ధార్మిక సదస్సు తీర్మానాన్ని టిటిడి అమలు చేయనుందా… స్వాగతిస్తున్న స్వామీజీల వర్షన్ ను వ్యతిరేకిస్తున్న బీజేపీ రియాక్షన్ ఏంటి… పరిశీలించి బోర్డులో తీర్మానం చేసేందుకు సిద్దమవుతున్న టీటీడీ నెక్స్ట్ స్టెప్ ఏంటి తెలుసుకుందాం..

ఇతర మతస్తులకు శ్రీవారి సేవలో పాల్గొనే భాగ్యం. హిందూ ఆచార సంప్రదాయాలను గౌరవించి ఆచరించే ఇతర మతస్తులకు హిందువులుగా మారే అవకాశం. ఈ రెండు నిర్ణయాలే ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యాయి. చారిత్రక నిర్ణయాలుగా టీటీడీ అమలు చేయబోతుందా లేక వివాదాస్పదం చేయబోతుందా అన్నదానిపై చర్చ మొదలైంది. అయితే స్వచ్ఛందంగా హైందవ సంప్రదాయాన్ని గౌరవించి వచ్చే ఇతర మతస్తులకు సంప్రోక్షణ నిర్వహించేందుకు టీటీడీ సిద్ధమంటుంది. ఈ మేరకు తిరుమల వేదిక కావాలని శ్రీ వెంకటేశ్వర ధార్మిక సదస్సు అభిప్రాయపడింది. తిరుమలలో జరిగిన శ్రీ వెంకటేశ్వర ధార్మిక సదస్సు ఈ మేరకు తీర్మానం చేసింది.

ఆస్థాన మండపంలో మూడు రోజులు పాటు జరిగిన ధార్మిక సదస్సులో స్వామీజీలు చేసిన సూచనలు, సలహాలు పై పలు తీర్మానాలను సదస్సు ముగింపు అనంతరం మీడియాకు వివరించారు టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. రాజకీయ ప్రయోజనాల కోసం ధార్మిక సదస్సు నిర్వహించలేదని అందుకోసం నిర్ణయాలు తీసుకోలేదన్నారు. సనాతన ధర్మ ప్రచారాన్ని విస్తృతం చేయాలనే ధార్మిక సదస్సు నిర్వహించామన్న భూమన 19 కీలక తీర్మానాలను సదస్సు చేసిందన్నారు. 62 మంది పీఠాధిపతులు మహానుభావులు సదస్సులో పాల్గొన్నారని, 17 తర్వాత జరిగిన ధార్మిక సదస్సు సనాతన హిందూ ధర్మ ప్రచారానికి చేపట్టాల్సిన కార్యక్రమాలను చర్చించిందన్నారు.

ఇవి కూడా చదవండి

హైందవ సాంప్రదాయాల మేరకు సంప్రోక్షణ చేసి ఇతర మతస్తులను హిందువులుగా పరిగణించి మార్చే ప్రక్రియ తిరుమల వేదికగా జరగాలని సదస్సు తీర్మానించిందని భూమన వెల్లడించారు. స్వచ్ఛందంగా హిందూ మతాన్ని ఆచరించేందుకు ముందుకు వచ్చిన వాళ్లకే దైవ దర్శనం కల్పిస్తామన్నారు. దేశంలో మరెక్కడ ఇలాంటి వేదిక లేదని ధార్మిక సదస్సు తీసుకున్న అతి ముఖ్యమైన నిర్ణయం ఇదేనన్నారు. మొట్టమొదటి తీర్మానంగానే ఇతర మతస్తులు స్వచ్ఛందంగా హిందూ మతాన్ని స్వీకరించేందుకుగాను ఒక వేదికను తిరుమలలో ఏర్పాటు చేయాలని పీఠాధిపతులు సదస్సులో నిర్ణయించారన్నారు.

తిరుమల తరహా తిరుపతిలో కూడా ఆధ్యాత్మికత పుట్టిపడేలా తీర్చిదిద్దేందుకు సదస్సు తీర్మానం చేసిందన్నారు.  సమైక్యతా భావం పెంపొందించేలా సనాతన ధర్మం అందరిదని చెప్పేలా టీటీడీ చర్యలు చేపట్టాలని సదస్సు తీర్మానించిందన్నారు. శిథిలమైన ఆలయాల పునరుద్ధరణతో పాటు శ్రీవాణి ట్రస్ట్ నిధులతో కొత్త ఆలయాల నిర్మాణాలు చేపట్టాలని సదస్సు తీర్మానించిందన్నారు భూమన.

గోసంరక్షణ, వేద శాస్త్రాల పరిరక్షణకు టీటీడీ చర్యలు చేపట్టాలని తీర్మానం చేసిందన్నారు. హిందూ సంప్రదాయాలు ఆచారాల పట్ల చిన్నతనం నుంచే పిల్లల్లో పెంపొందించేందుకు మాతృమూర్తులకు ధర్మబోధన శిక్షణ ఇవ్వాల్సిన అవసరం ఉందని సదస్సు తీర్మానించిందన్నారు. యువతీ యువకులు పాశ్చాత్య పోకడల ప్రభావానికి గురికాకుండా హిందూ ధర్మం ప్రాచీనమైనదని తెలియజేసే బాధ్యతను తీసుకోవాలని నిర్ణయించిందన్నారు భూమన కరుణాకర్ రెడ్డి.

సప్తగిరుల పరిరక్షణ కోసం జీవవైవిద్య క్షేత్రంగా కూడా తిరుమల కొండలను పరిరక్షించేందుకు టీటీడీ చర్యలు తీసుకోవాలని తీర్మానం చేసిందన్నారు. తిరుమల గిరుల్లో 108 క్షేత్రాలపై భక్తులకు అవగాహన కల్పించాలని సదస్సు తీర్మానించిందన్నారు. పాఠశాల స్థాయిలో బోధనా అంశాల్లో హిందూ ధర్మ ప్రచారం జరగాలని స్వామీజీలు సూచించారని, ధార్మిక సంస్థలన్నీ టిటిడితో కలిసి సనాతన ధర్మ ప్రచారానికి పనిచేయాలన్న తీర్మానం పీఠాధిపతులు చేశారన్నారు భూమన. ప్రతి ఏటా ధార్మిక సదస్సులు జరగాలన్న తీర్మాన్నాన్ని ధార్మిక సదస్సు చేసిందన్నారు టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి.

ఇక ఇతర మతస్తులు హైందవ ధర్మం పట్ల విశ్వాసంతో ఆచరించేందుకు వస్తే అలాంటి వారిని హిందువులుగా గుర్తించేందుకు తిరుమల వేదిక కావాలన్న నిర్ణయాన్ని పీఠాధిపతులు కూడా స్వాగతించారు. సనాతన ధర్మ పట్ల భక్తి విశ్వాసాలతో వచ్చే ఇతర మతస్తులకు శ్రీవారి సేవలో పాల్గొనే అవకాశం కల్పించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఈ మేరకు ధార్మిక సదస్సు తీర్మానం చేయడం స్వాగతించదగ్గ అంశం అన్నారు కొందరు పీఠాధిపతులు.

మరోవైపు ఇతర మతస్తులకు శ్రీవారి సేవలో పాల్గొనే అవకాశం కల్పించాలన్న అభిప్రాయం పై పెద్ద చర్చ నడుస్తోంది. స్వామీజీలు స్వాగతిస్తుండడం బీజేపీతో పాటు మరికొన్ని హిందూ సంస్థలు వ్యతిరేకిస్తుండడంతో  ఆసక్తికరంగా మారింది. టీటీడీ మరో చారిత్రాత్మక నిర్ణయం గా తీసుకుంటుందా లేదంటే వివాదాస్పద నిర్ణయానికి తెరతీస్తుందా అన్నదానిపై చర్చ జరుగుతోంది. అయితే బీజేపీ మాత్రం ఇతర మతస్తులకు శ్రీవారి సేవలో పాల్గొనే అవకాశం కల్పించాలన్న టీటీడీ ఆలోచనను తప్పుపడుతున్నారు. అన్యమతస్తులు శ్రీవారి సేవకులుగా రావడం మరో వివాదానికి తెరతీయడమే అవుతుందంటున్నారు బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సామంచి శ్రీనివాస్.

అయితే శ్రీ వెంకటేశ్వర ధార్మిక సదస్సు ఇతర మతస్తులను హిందువులుగా సంరక్షణ చేసి స్వీకరించే అంశంపై స్వామీజీల తీర్మానాన్ని బోర్డులో చర్చించేందుకు టీటీడీ సిద్ధమవుతోంది. మరోవైపు ఇతర మతస్తులకు శ్రీవారి సేవ చేసుకునే భాగ్యం కల్పించాలన్న కోరికలను పరిశీలిస్తామంటున్న టీటీడీ పాలక మండలి ఈ విషయంలోనూ త్వరలోనే స్పష్టత ఇచ్చే అవకాశం ఇవ్వనుంది. అసలు తిరుమల లాంటి క్షేత్రం మతమార్పిడులకు కేంద్రం కావడం, వేదిక చేయాలని నిర్ణయించడం సరైనది కాదని బీజేపీ అంటోంది. అన్య మతస్థులను శ్రీవారి సేవకులను చేయడం, తిరుమల కేంద్రంగా హిందువులుగా మార్చడం సరైనది కాదంటున్నారు ఏపీ బీజేపీ లీగల్ సెల్ కో కన్వీనర్ అజయ్ కుమార్.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..