Andhra Pradesh: పవన్ అడిగింది ఎన్ని? చంద్రబాబు ఇస్తానన్నవి ఎన్ని? టీడీపీ-జనసేన సీట్ల సర్దుబాటుపై సస్పెన్స్..
Big News Big Debate : ఏపీలో ఎన్నికల హడావుడి ఎక్కువవుతోంది. పాలక, ప్రతిపక్షాలు టిక్కెట్ల కేటాయింపుల్లో బిజీగా మారిపోయాయి. ఈ విషయంలో అధికార పార్టీ, మార్పులు చేర్పులతో కాస్త ముందుండగా... పొత్తుగా వస్తున్న టీడీపీ, జనసేన మాత్రం సీట్ల సర్దుబాటులో సస్పెన్స్ కొనసాగిస్తున్నాయి.
Big News Big Debate : ఏపీలో ఎన్నికల హడావుడి ఎక్కువవుతోంది. పాలక, ప్రతిపక్షాలు టిక్కెట్ల కేటాయింపుల్లో బిజీగా మారిపోయాయి. ఈ విషయంలో అధికార పార్టీ, మార్పులు చేర్పులతో కాస్త ముందుండగా… పొత్తుగా వస్తున్న టీడీపీ, జనసేన మాత్రం సీట్ల సర్దుబాటులో సస్పెన్స్ కొనసాగిస్తున్నాయి. ఇటీవలి భేటీల్లో ఎటూతేల్చని బాబు, పవన్… మరో సమావేశానికి సిద్ధమవుతున్నారు. మరి, ఈ పంపకాల ఉత్కంఠకు ఎప్పుడు తెరపడుతుందన్నదే ఏపీరాజకీయాల్లో ఆసక్తి రేపుతోంది.
ఏపీ రాజకీయాలు రోజుకింత ఆసక్తిగా మారుతున్నాయి. ఇప్పటికే అధికార వైసీపీలో మార్పులు, చేర్పుల హడావుడి కొనసాగుతుండగా… జనసేన, టీడీపీ సైతం టిక్కెట్ టాక్స్ మొదలెట్టేశాయి. ఇటీవల ఉండవల్లిలో సమావేశమైన చంద్రబాబు, పవన్ .. సీట్ల సర్దుబాటుపై కీలక చర్చలు జరిపినా.. ఇంకా ఓ స్పష్టతకు రాలేదు.
అయితే, ఈ విషయాన్ని పెండింగ్‌లో పెట్టడానికి ప్రధానకారణం బీజేపీయేనన్న ప్రచారం జరుగుతోంది. బీజేపీ కూటమిలో చేరితే సీట్లలెక్క ఒకలా, లేదంటే మరోలా ఉంటుందట. దీనిపై చర్చించేందుకే పార్లమెంటు సమావేశాల తర్వాత పవన్ ఢిల్లీ వెళ్లే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఈనెల 8న పవన్, చంద్రబాబు మరోసారి భేటీ కాబోతుండటంతో… సీట్లలెక్క తేలితే.. ఈనెల 14న జనసేన, టీడీపీ కలిసి బహిరంగసభ నిర్వహించే అవకాశం ఉంది. ఇదేసభలో ఉమ్మడి మేనిఫెస్టో కూడా ప్రకటించే ఛాన్స్ ఉంది.
సీట్ల పంపకాలపై సందిగ్ధత కొనసాగుతున్న వేళ… జనసేనకు పలు సూచనలుచేస్తున్నారు కాపు నేతలు. పవన్‌కు లేఖరాసిన మాజీ ఎంపీ హరిరామజోగయ్య… సీఎం కూర్చీని రెండున్నరేళ్లు టీడీపీతో పంచుకోవాలని సూచించారు. దీనిపై చంద్రబాబుతో ప్రకటన చేయించాలన్నారు. వైసీపీని అధికారంలోంచి దింపడమంటే టీడీపీకి అధికారం అప్పగించడం కాదన్న జోగయ్య… కాపులు యాచించే స్థితి నుంచి శాసించే స్థితికి చేరాలన్నారు. 40-60 సీట్లు జనసేనకు ఇస్తేనే ఓట్ల బదిలీ జరుగుతుందన్నారు జోగయ్య.
మరోవైపు, టీడీపీ, జనసేన సీట్ల పంపకాలపై అధికార వైసీపీ సెటైర్లు వేసింది. 60సీట్లపై జనసేన ఆశలు పెట్టుకోవద్దనీ… చంద్రబాబు 25 సీట్లు ముష్టి వేస్తారనీ ఎద్దేవా చేశారు మంత్రి అంబటి రాంబాబు.
ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న వేళ.. జనసేన, టీడీపీ కూటమి అభ్యర్థులపై సర్వత్రా ఉత్కంఠ ఏర్పడింది. జనసేన అడిగే స్థానాలేమిటి? దానికి టీడీపీ రియాక్షనేంటి? ఈ రెండు పార్టీల పొత్తుపై బీజేపీ నిర్ణయమేంటి? అనే చర్చ జోరందుకుంది. దీనిపై స్పష్టత రావాలంటే ఫిబ్రవరి 8వరకు ఆగాల్సిందే.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..