Andhra: మేకలు మేపుతుండగా అదో మాదిరి శబ్దాలు.. ఏంటని వెళ్లి చూడగా ఆశ్చర్యం
అనకాపల్లిలోని ఓ గ్రామ శివారు మేకలు మేపేందుకు వెళ్లిన రైతుకు.. ఎక్కడ నుంచో వింత శబ్దాలు రావడం మొదలయ్యాయి. అదేంటా అని వెళ్లి చూడగా.. దెబ్బకు అక్కడ కనిపించిన సీన్‌కు షాక్ అయ్యాడు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. ఓ సారి లుక్కేయండి.

గిరినాగులు.. కింగ్ కోబ్రా.! ఆ పేరు వెంటనే వణుకు పుడుతుంది. అదే గాని నేరుగా కనిపిస్తే ఇక చెమటలు పట్టడం ఖాయమే. అనకాపల్లి జిల్లాలోని మాడుగుల పరిసర ప్రాంతాల్లో అప్పుడప్పుడు భారీ గిరినాగులు సంచరిస్తూ కనిపిస్తూ ఉంటాయి. బుసలు కొడుతూ.. చురుగ్గా కదులుతూ కనిపించే వాటిని రెస్క్యూ చేసిన సందర్భలు ఎన్నో..! కానీ ఈసారి.. పిల్ల గిరినాగులను రెస్క్యూ చేశారు. గుడ్లను సంరక్షించి వాటిని పొదిగేలా చేశారు. దీంతో ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 30 పిల్ల గిరినాగులు పొదిగాయి. గుడ్ల నుంచి బయటకు వచ్చి చలాకీగా కనిపించాయి. వాటిని సేఫ్‌గా సంరక్షించి రిజర్వ్ ఫారెస్ట్‌లో విడిచిపెట్టారు.
అనకాపల్లి జిల్లా దేవరపల్లి మండలం వాలాబు గ్రామ శివారులోని మేకలు మేపేందుకు వెళ్లిన రైతుకు.. బుసలు కొడుతూ శబ్దం వినిపించింది. ఏమిటా అని దగ్గరకు వెళ్లి చూసేసరికి.. భారీ గిరినాగు పైకి వచ్చే పరిస్థితి ఎదురైంది. దీంతో వెంటనే.. ఆ రైతు అటవీ అధికారులకు సమాచారం అందించాడు. తూర్పు కనుమల సంరక్షణ సొసైటీ సభ్యులకు అటవీ అధికారులు చెప్పడంతో వచ్చి పరిశీలించారు. సహాయక చర్యగా తూర్పు కనుమల వన్యప్రాణి సంరక్షణ సంస్థ ప్రతినిధులు కృష్ణ ప్రసాద్, మూర్తి కంఠి మహంతి అక్కడికి చేరుకుని పామును పరిశీలించారు. అక్కడ ఉన్నది ఆడ గిరి నాగుపాముగా గుర్తించి కొన్ని రోజుల పాటు వేచి చూస్తూ గమనించాలని సూచించారు.
కొన్ని రోజుల తర్వాత పాము అక్కడ గుడ్లు వదిలి వెళ్లింది. అనంతరం.. సంస్థ బృందం గుడ్లకు సంరక్షణగా వల కట్టించి ఉంచింది. నెలరోజుల్లో ఆ గుడ్ల నుంచి 30 పాము పిల్లలు బయటకు వచ్చాయి. చూసేందుకు చలాకిగా కనిపిస్తున్నాయి. పడగ విప్పి పైకి చూస్తున్నాయి. ఆ గిరి నాగు పిల్లలను అటవీశాఖ అధికారులు శివకుమార్, బీటు ఆఫీసర్ సాయి ప్రణీత్, వన్యప్రాణి బృందం కలిసి పాము పిల్లలను బాక్సుల్లో వేసి సంరక్షించారు. శంకరం రిజర్వ్ ఫారెస్ట్ లోకి సురక్షితంగా వదిలారు. ఎక్కడైనా గిరి నాగులు కనిపిస్తే వాటికి హాని తల పెట్టకుండా సమాచారం అందించాలని కోరుతున్నారు అటవీ శాఖ అధికారులు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
