Tirupati: తిరుమలలో పెను విషాదం.. కాలినడక మార్గంలో చిరుత దాడి.. బాలిక మృతి..
తిరుమలలో ఘోరం జరిగింది. అలిపిరి నడక మార్గంలో వెళ్తుండగా ఓ బాలికపై చిరుత దాడి చేసింది. ఈ దాడిలో చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. తిరుమలకు వెళ్తుండగా చోటు చేసుకున్న ఈ ఘటన భక్తులను తీవ్ర భయాందోళనకు గురి చేసింది. విషయం తెలుసుకున్న ఫారెస్ట్ సిబ్బంది.. ఘటనా స్థలికి చేరుకుని పరిశీలించారు. భక్తులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు..

తిరుపతి, ఆగష్టు 12: అత్యంత దారుణ ఘటన. శ్రీవారి దర్శనం కోసం వెళ్లి.. ఓ కుటుంబం బిడ్డను పోగొట్టుకుంది. అది కూడా అడవి మృగం బారిన పడి. నెల్లూరుకు చెందిన ఓ కుటుంబం నిన్న తిరుమలకు బయల్దేరింది. రాత్రి 8గంటల సమయంలో అలిపిరి నుంచి నడకమార్గంలో కొండపైకి బయల్దేరింది. రాత్రి 11గంటల సమయానికి కుటుంబసమేతంగా లక్ష్మీనరసింహస్వామి గుడి దాకా చేరుకుంది కుటుంబం. ఆ తర్వాత ఒక్కసారిగా పాప లక్షిత కనిపించకుండా పోయింది. ఏమైందని మొత్తం అంతా గాలించారు. కానీ ఎక్కడా కనిపించలేదు. పోలీస్ స్టేషన్‌లో పాప కనిపించడం లేదని కేసు పెట్టారు. పోలీసులు కూడా మిస్సింగ్ కేసే నమోదు చేశారు. కానీ ఎక్కడ అనుమానం వచ్చిందో, ఏ క్లూ దొరికిందో గానీ.. అడవిలో గాలింపు మొదలుపెట్టారు ఫారెస్ట్ సిబ్బంది.
ఇదే ఏడాది జూన్ 23న తిరుమల నడకదారిలో ఇలాంటి ఘటనే జరిగింది. కర్నూలు జిల్లా ఆదోని హనుమాన్ నగర్‌కు చెందిన శిరీష, కొండయ్యల కుటుంబ సమేతంగా జూన్ 23న తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చారు. నడకమార్గంలో ఐదేళ్ల కౌశిక్ తో వెళ్తుండగా ఏడో మైలురాయి దగ్గరకు చేరుకోగానే ఒక్కసారిగా చిరుత దాడి చేసింది. అమాంతం కౌశిక్ మెడ కరుచుకుని అడవిలోకి లాక్కెళ్లింది. చుట్టూ ఉన్న వాళ్లు కేకలేయడంతో వెంటనే వదిలేసి పరారైంది. చిరుత దాడిలో బాలుడు కౌశిక్ తీవ్రంగా గాయపడ్డాడు. తిరుపతిలోని చిన్న పిల్లల ఆస్పత్రిలో చికిత్స తర్వాత మెల్లిగా కోలుకున్నాడు. శ్రీవారి దర్శనం అనంతరం ఇంటికి వెళ్లాడు.
చిరత దాడి తర్వాత అలర్ట్ అయిన టీడీపీ అధికారులు భక్తుల భద్రత కోసం చర్యలు చేపట్టారు. అలిపిరి మెట్ల మార్గంలో నడిచి వెళ్ళే భక్తులకు ప్రత్యేక సూచనలు చేసింది. మెట్ల మార్గంలో నడిచి వెళ్తున్న భక్తులు గుంపులు, గుంపులుగా వెళ్లాలని మైక్‌ల ద్వారా విజిలెన్స్ అధికారులు భక్తులకు విజ్ఞప్తి చేసింది. భక్తుల భద్రత కోసం అవసరమైన చోట ఫెన్సింగ్ ఏర్పాటు చేశామని చెప్పారు అధికారులు.




మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..