Tirumala Museum: తిరుమల వైభవాన్ని చాటి చేప్పేలా 3 ఎకరాల్లో రూ. 145 కోట్లతో మ్యూజియం నిర్మాణం.. డిసెంబర్ కి పూర్తి

దాదాపు 3 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న విశాలమైన మ్యూజియాన్ని సందర్శకులను ఆకట్టుకునేలా ప్రపంచస్థాయి మ్యూజియంగా అభివృద్ధి చేస్తున్నట్లు టీటీడీ చెబుతోంది. శ్రీ వేంకటేశ్వర స్వామివారి మహిమను, ఆలయ పురాతన సంప్రదాయాలు, సంస్కృతిని, చారిత్రక ప్రాముఖ్యతను యాత్రికులకు తెలియ‌జేయ‌డ‌మే మ్యూజియం ప్ర‌ధాన లక్ష్యం కానుంది. శ్రీ‌వారి ఆల‌య సంద‌ర్శ‌న దివ్యానుభూతిని యాత్రికులకు అందించనుంది.

Tirumala Museum: తిరుమల వైభవాన్ని చాటి చేప్పేలా 3 ఎకరాల్లో రూ. 145 కోట్లతో మ్యూజియం నిర్మాణం.. డిసెంబర్ కి పూర్తి
Tirumala Museum
Follow us

| Edited By: Surya Kala

Updated on: Aug 12, 2023 | 7:32 AM

తిరుమల ఆలయ ప్రాశస్త్యాన్ని భక్తుల చాటి చెప్పేందుకు అంతర్జాతీయ ప్రమాణాలతో ఎస్వీ మ్యూజియం సిద్ధమవుతోంది. ఎన్నో దశాబ్దాలుగా తిరుమల ఆలయ శిల్పకళా వైభవం, శ్రీవారి సేవలు, చారిత్రక విషయాలతో ఆధ్యాత్మిక వినోదాన్ని విజ్ఞానాన్ని పంచనున్న మ్యూజియం రూ. 145 కోట్ల తో రూపు రేఖలు మారి పోతోంది. 3 ఎకరాల విస్తర్ణంలో 3 అంతస్థుల భవనంలో ఒక్కో అంతస్తులో ఒక్కో ఆసక్తికరమైన అంశాలను మ్యూజియం తెలియజేయనుంది. ఈ మేరకు పనులకు శ్రీకారం చుట్టిన టీటీడీ డిసెంబర్ నాటికి భక్తులకు  అందుబాటులోకి తీసుకురానుంది.

3 ఎకరాల్లో 3 అంతస్థుల మ్యూజియంలో 19 గ్యాలరీలు.

తిరుమల ఎస్వీ మ్యూజియం. ఇప్పుడు ఏకంగా రూ. 145 కోట్లతో ఆధునీకరణ పనులతో ఆకట్టుకోనుంది. మ్యూజియంలోని 3 అంతస్థులోని గ్యాలరీలు శ్రీవారి భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతితోపాటు విజ్ఞానాన్ని కలిగించేలా ఉండబోతోంది. ఈ మేరకు చేపట్టిన పనులకు టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి పూజలు చేసి ప్రారంభించగా భ‌క్తుల‌కు దివ్యానుభూతి క‌ల్పించేలా టీటీడీ మ్యూజియం అభివృద్ధి జరుగుతోంది. తిరుమ‌ల ఎస్వీ మ్యూజియంలోకి అడుగుపెట్టే భ‌క్తుల‌కు సాక్షాత్తు శ్రీ‌వారి ఆల‌యంలో ఉన్నామ‌నే ఆధ్యాత్మిక అనుభూతి క‌లిగేలా మ్యూజియం ప‌నులు పూర్తి కానున్నాయి.

టిసిఎస్‌, మ్యాప్ సంస్థ‌ల అధికారులు, టీటీడీ తో సమన్వయం తో ఈ పనులు జరుగుతుండగా ఈవో ధర్మారెడ్డి ప్రత్యేక చొరవ కనబరుస్తున్నారు. మ్యూజియంలోని ఒక‌టో జోన్‌లో ఆల‌య అనుభూతి క‌ల్పించే ప‌నులు, రెండో జోన్‌లో అన్న‌మ‌య్య గ్యాల‌రీ, ధ్యాన‌మందిరం, స్వామివారి ఆభ‌ర‌ణాలు, నాణేలు, పురాత‌న వ‌స్తువులు హోలోగ్రామ్ టెక్నాల‌జీతో ప్ర‌ద‌ర్శించే ఏర్పాటు జరుగుతున్నాయి. ఆభ‌ర‌ణాల 3డి ఇమేజింగ్ ద్వారా భ‌క్తులు తాము స్వామివారి నిజ‌మైన ఆభ‌ర‌ణాలు చూస్తున్నామ‌నే అనుభూతి క‌ల్పించాల‌న్న ఆలోచనలో ఉన్న టీటీడీ ఈ మేరకు అంతర్జాతీయ ప్రమాణాలతో ఫాలో అవుతోంది. మూడో జోన్‌లో సాక్షాత్తు శ్రీ‌మ‌హావిష్ణువు క‌ళ్ల‌కు క‌ట్టిన‌ట్టు క‌నిపించేలా ఉండబోతోంది.

ఇవి కూడా చదవండి

దాదాపు 3 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న విశాలమైన మ్యూజియాన్ని సందర్శకులను ఆకట్టుకునేలా ప్రపంచస్థాయి మ్యూజియంగా అభివృద్ధి చేస్తున్నట్లు టీటీడీ చెబుతోంది. శ్రీ వేంకటేశ్వర స్వామివారి మహిమను, ఆలయ పురాతన సంప్రదాయాలు, సంస్కృతిని, చారిత్రక ప్రాముఖ్యతను యాత్రికులకు తెలియ‌జేయ‌డ‌మే మ్యూజియం ప్ర‌ధాన లక్ష్యం కానుంది. శ్రీ‌వారి ఆల‌య సంద‌ర్శ‌న దివ్యానుభూతిని యాత్రికులకు అందించనుంది. రూ.145కోట్ల ప్రాజెక్టును చేపట్టేందుకు ముందుకు వచ్చిన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, మ్యాప్ సిస్టమ్స్ సంస్థ‌లు మొత్తం 19 గ్యాలరీలతో మ్యూజియంను ఆధునీకరిస్తుండగా ఇందులో ఐదింటిని బెంగళూరుకు చెందిన మ్యాప్‌ సిస్టమ్స్ రూ.20 కోట్లతో, మిగిలిన 14 గ్యాలరీలను టిసిఎస్‌ రూ. 125 కోట్లతో అభివృద్ధి చేస్తున్నాయి.

డిసెంబర్ నాటికి పనులు పూర్తి

ఈ ఏడాది డిసెంబర్ నాటికి పనులు పూర్తి కానుండగా అంత‌ర్జాతీయ ప్ర‌మాణాల‌తో మ్యూజియం అభివృద్ధి ప‌నులు జ‌రుగుతున్నాయి. గ్రౌండ్ ఫ్లోర్ లో తిరువీధులు, తిరుమల ఆలయ అనుభూతి, వాహన సేవలు, స్వామివారి సేవలు, సప్తగిరుల గ్యాలరీలు ఉంటాయి. శ్రీ వేంకటేశ్వరుడి రాతి విగ్రహాలు, కాంస్య విగ్రహాలు, దారు విగ్రహాలు, అన్నమయ్య రాగి రేకులు, పురాతన నాణేలను ఈ గ్యాలరీలో భక్తులు ఆకట్టుకునేలా ఏర్పాటు కానున్నాయి. ఇక ఫస్ట్ ఫ్లోర్ లో శ్రీవారి ఆలయ శిల్పకళా వైభవం, భక్తాగ్రేసరులు, వారి సేవలు, యుద్ధ పరికరాలు, సంగీత వాయిద్యాలు, పూజా సామగ్రి గ్యాలరీలు వంటి అనేక అద్భుతాలు భక్తులను ఆకట్టుకునేలా ఏర్పాటు చేయ నుండగా రెండో ఫ్లోర్‌లో విరాట్ పురుషుడు, బ్రహ్మ, మహేశ్వరులు, ఋగ్వేదం యజుర్వేదం గ్యాలరీలు, మూడో ఫ్లోర్‌లో బ్రహ్మాండ గ్యాలరీ ఏర్పాటు కానుంది.

మ్యూజియం పైభాగంలో 17 పెద్ద గోపురాలుండగా ఇందులో తాళ్లపాక అన్నమయ్య, మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ, పురందరదాస, రామానుజాచార్యులుశంకరాచార్యులు, మధ్వాచార్యులు వంటి భక్తాగ్రేసరులతో పాటు రామాయణం, మహాభారతం, భగవద్గీత లాంటి మహాగ్రంథాలకు సంబంధించిన ఆసక్తికరమైన అంశాలతో కూడిన ప్రదర్శన ఆకట్టుకో నుంది. మ్యూజియం ఆధునీకరణ పనుల వివరాలు తెలుసుకున్న టీటీడీ చైర్మన్ భూమన మ్యూజియం నిర్మాణ ప్రణాళిక, డిజైన్‌ను పరిశీలించారు. స‌నాత‌న ధార్మిక అంశాల‌ను భ‌విష్య‌త్ త‌రాల‌కు అందించేందుకు మ్యూజియం ఎంత‌గానో దోహ‌ద‌ప‌డుతుంద‌న్నారు టీటీడీ ధర్మకర్తల మండలి చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..