Andhra Pradesh: తల్లి చెంతలేని ఆ పసిబిడ్డ పరిస్థితి చూసి తల్లడిల్లిన కానిస్టేబుల్.. వెంటనే
తన బిడ్డకాని బిడ్డను చేతుల్లోకి తీసుకుంది ఆ కానిస్టేబుల్. లాలించింది. పసివాడిని ఎత్తుకొని గుండెలకు హత్తుకుంది...ఓదార్చింది. పాలుపట్టి తల్లి ప్రేమను పంచి.. ప్రపంచాన్ని మురిపించింది.

ఆమె కన్న తల్లి కాదు. కనీసం పరిచయస్తురాలైన పొరుగింటావిడ కూడా కాదు. పరీక్షా ప్రాంగణంలో విధులు నిర్వర్తిస్తోన్న ఓ మహిళ. కానీ ఎవరో బిడ్డ గుక్కపెట్టి ఏడుస్తుంటే తట్టుకోలేకపోయింది. తల్లి చెంతలేని ఆ పసిబిడ్డ పరిస్థితి చూసి…తల్లడిల్లిపోయింది. తన బిడ్డకాని బిడ్డను చేతుల్లోకి తీసుకుంది. లాలించింది. పసివాడిని ఎత్తుకొని గుండెలకు హత్తుకుంది…ఓదార్చింది. పాలుపట్టి తల్లి ప్రేమను పంచి.. ప్రపంచాన్ని మురిపించింది.
ఉద్యోగం జీవన్మరణ సమస్య. అందుకే పసికందుని సైతం వదిలి పరుగు పరుగున కానిస్టేబుల్ ఉద్యోగాలకు హాజరయ్యారు వందలాది మంది పసిబిడ్డల తల్లులు. అలాగే అన్నమయ్య జిల్లా రాజంపేటలోని అన్నమాచార్య ఇంజనీరింగ్ కళాశాలలో ఓ తల్లి కానిస్టేబుల్ పరీక్ష రాసేందుకు తన కన్న బిడ్డను భర్త చేతికి అప్పగించి పరీక్షా కేంద్రానికి పరుగులు తీసింది. కానీ తల్లి అలా వెళ్లిందో లేదొ … ఆ బిడ్డ ఏక బిగిన బోరున ఏడ్వటం మొదలుపెట్టాడు. పసిబిడ్డను తండ్రి దగ్గర వదిలి, కానిస్టేబుల్ పరీక్షకు హాజరయ్యింది ఓ తల్లి. ఆకలితో గుక్కపట్టి ఏడుస్తున్న బాబును తండ్రి సముదాయించలేక ఇబ్బంది పడుతుంటే చూసింది అక్కడే విధులు నిర్వర్తిస్తోన్న మరో మహిళా పోలీసు అమరావతి. ఆమెలోని మాతృహృదయం పొంగిపొర్లింది. పసిబిడ్డను అక్కున చేర్చుకుంది… కొద్దిసేపు పోలీసు విధులను పక్కనపెట్టి బాబుకు అమ్మగా మారిపోయింది. పసివాడిని లాలించింది. పాలుపట్టి పసిబిడ్డను పడుకోబెట్టింది.
ఎక్కడో ఆఫ్గనిస్తాన్‌లో పసిబిడ్డను లాలించి ప్రపంచం దృష్టిని ఆకర్షించింది ఓ మహిళా ఆర్మీ అధికారి. కానీ కళ్ళెదుటే మాతృత్వాన్ని చాటుకుంది ఓ సాధారణ కానిస్టేబుల్. ఈ ఘటన ఎందరినో ఆకర్షించింది. ఏడుస్తున్న ఎవరో పాపాయికి పాలుపట్టి లాలించిన ఆ తల్లిపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఖాకీలో కేవలం కాఠిన్యం మాత్రమే కాదు కన్నతల్లి ప్రేమలోని మాధుర్యం కూడా ఉంటుందని ప్రపంచానికి చాటి చెప్పింది ఆ తల్లి అమరావతి. కర్తవ్య నిర్వహణలో ఉన్న మహిళా కానిస్టేబుల్ చూపించిన మానవీయతను అంతా కొనియాడారు. మాతృత్వం మూర్తీభవించిన ఈ మహిళను పై అధికారులు సైతం ప్రశంసించారు.
రాజంపేట మండలం మన్నూరు పోలిస్టేషన్ లో కానిస్టేబుల్ గా విధులు నిర్వర్తిస్తుంది అమరావతి. తన సాధారణ విదులు కూడా ఆమె చిత్తశుద్దితో నిర్వర్తిస్తుంది. తనకు అప్పగించిన పనులు సమర్ధ వంతంగా నిర్వహిస్తూ అందరి మన్ననలు పొందుతోంది అమ్మకాని అమ్మ అమరావతి.
