Chicken Price Hike: చిక్కన్నంటున్న చికెన్ ముక్క.. ముద్ద దిగేదెలా అంటున్న నాన్‌వెజ్ ప్రియులు!
Chicken Price Hike: నాన్‌వెజ్ ప్రియులకు చికెన్ ధరలు రోజురోజుకూ షాకిస్తున్నాయి. ప్రస్తుతం మార్కెట్‌లో కేజీ చికెన్ ధర రూ. 320కి చేరడంతో మాంసాహార ప్రియులు ముద్ద దిగడం లేదు. గత కొన్ని వారాలుగా ఉత్పత్తి తగ్గడం, పెరిగిన డిమాండ్ కారణంగానే ధరలు కూడా పెరిగాయని వ్యాపారులు అంటున్నారు. సంక్రాంతి నేపథ్యంలో ఈ ధరలు మరింత పెరిగే అవకాశం ఉందంటున్నారు, దీంతో నాన్‌వెజ్ ప్రియులు దిగాలు చెందుతున్నారు.

చాలా మంది ముక్కలేకుంటే ముద్దదిగదు.. కొందరు వారంలో నాలుగైదు సార్లు నాన్‌వెజ్ తింటే.. మరికొందరకీ కనీసం వారానికి ఒక్కసారైనా ఇంట్లో ముక్కలు ఉండాల్సిందే. కానీ అలాంటి వారికి ఇప్పుడు చికెన్ ధరలు షాక్ ఇస్తున్నాయి. గత కొన్ని రోజులుగా భారీగా పెరుగుతున్న చికెన్ ధరలు ఈ ఏడాది ప్రారంభంలోనే ట్రిపుల్ సెంచరీ కొట్టగా.. తాజాగా మరోసారి భారీగా పెరిగాయి. దీంతో ప్రస్తుతం మార్కెట్‌లో కేజీ చికెన్ ధర రూ.320కి చేరింది. దీంతో తినేదెలానయ్యా అని నాన్‌వెజ్ ప్రియులు వాపోతున్నారు.
చికెన్ రేట్లు పెరిగిన తీరు!
గత ఏడాది కార్తిక మాసం సమయంలో కేజీ స్కిన్‌లెస్ చికెన్ రూ.240 ఉండగా.. డిసెంబర్ చివరి వారం నాటికి ఇది కేజీపై రూ.40 పెరిగి రూ.280కు చేరింది. ఇక న్యూ ఇయర్‌లోకి అడుపెట్టగానే ఈ రేట్లు మరోసారి షాక్ ఇచ్చాయి. కొత్త సంవత్సరంలో ఏకంగా చికెన్ ధర ట్రిపుల్ సెంచరీ కొట్టేసింది. అంటే జనవరి మొదటి వారంలో కేజీ చికెన్ రూ.300కు చేరగా.. అది కాస్త రెండో వారికి వచ్చేసరికి రూ.320 అయ్యింది. దీంతో మాంసాహార ప్రియలకు ముద్ద దిగడం కష్టంగా మారింది. భారీగా పెరిగిన ధరలతో వారానికి ఒక్కసారైనా చికెన్ తినాలనుకునే వారు.. కూరగాయలతో సరిపెట్టుకుంటున్నారు.
రేట్ల పెరుగుదలకు కారణం ఇదేనా?
అయితే గత ఏడాదిలో బర్డ్‌ఫ్లూ వంటి రోగాల కారణంగా భారీగా కోళ్ల మృత్యువాతను ఎదుర్కొన్నారు పౌల్ట్రీ నిర్వాహకులు, ఆ తర్వాత వ్యాధులు తగ్గి కాస్త ఊరట లభించినా, వాటి మేత ధరలు పెరగడంతో నిర్వహణ భారం పెరిగి చాలా మంది కోళ్ల పెంపకాన్ని ఆపేశారు. దీంతో సుమారు 1 నుంచి రెండు శాతం మేర కొళ్ల పెంపకం తగ్గిపోయింది. ఇక ఉత్పత్తి తగ్గినా, తినే వాళ్లు తగ్గకపోవడంలో మార్కెట్‌లో డిమాండ్ పెరిగింది. దీంతో ఇంటిగ్రేషన్ కంపెనీలు ధరలు భారీగా పెంచినట్టు వ్యాపారులు చెబుతున్నారు.
పెరిగిన డిమాండ్
కార్తీక మాసంలో చికెన్‌కు డిమాండ్ తగ్గినప్పటికీ.. ఆ తర్వాత వచ్చిన క్రిస్‌మస్, న్యూ ఇయర్ నేపథ్యంలో డిమాండ్ భారీగా పెరిగింది. ముఖ్యంగా డిసెంబర్ చివరి వారంలో చికెన్ అమ్మకాలు భారీగా పెరిగాయి. అటు న్యూ ఇయర్ సందర్భంలో సైతం అమ్మకాల్లో అదే జోరు కనిపించింది. దీంతో మార్కెట్‌లో మాంసం కొరత ఏర్పడింది. ఇక సప్లయ్ తగ్గి డిమాండ్ పెరగడంతో చికెన్ సరఫరా కంపెనీలు రేట్లు పెంచేశాయ్. ఇదిలా ఉండగా మరో వారం రోజుల్లో సంక్రాంతి పండుగ నేపథ్యంలో రాబోయే రోజుల్లో చికెన్ ధరలు మళ్లీ పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
