Sankranti: సంక్రాంతికి ఇంటికెళ్లేవారికి ఉపశమనం.. అధిక ఛార్జీల వసూలుకు చెక్.. రవాణాశాఖ కీలక డెసిషన్
సంక్రాంతికి ఇంటికెళ్లేవారికి ఊరటనిచ్చేలా తెలంగాణ రవాణాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రైవేట్ బస్సుల్లో అధిక ఫీజులు చేయకుండా అడ్డుకట్ట వేసేందుకు ప్రయత్నాలు చేయనుంది. అందులో భాగంగా ప్రైవేట్ బస్సుల యజమానులకు వార్నింగ్ ఇచ్చింది. అధిక ఫీజులు వసూలు చేస్తే చర్యలు తీసుకుంటామని ప్రకటించింది.

సంక్రాంతికి తెలుగు రాష్ట్రాల్లో ప్రయాణికుల రాకపోకలు ఎక్కువగా ఉంటాయి. పండుగ సందర్భంగా ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి ప్రయాణం సాగిస్తూ ఉంటారు. స్నేహితులు, బంధువుల ఇంటికి వెళ్లడం లేదా పండుగ సెలవులు రావడంతో పర్యాటక ప్రదేశాలకు వెళ్లడం లాంటివి చేస్తుంటారు. ఇక విద్య, ఉద్యోగ, వ్యాపార పనుల రీత్యా ఇతర ప్రాంతాల్లో నివసించే వాళ్లు తమ సొంతూళ్లకు చేరుకుంటారు. ఇక సంక్రాంతికి హైదరాబాద్ మొత్తం దాదాపు ఖాళీ అవ్వనుంది. నగరంలో ఉండే విద్యార్థులు, ఉద్యోగులు పండక్కి తమ సొంత ప్రాంతాలకు వెళతారు. దీంతో ప్రయాణికులతో రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు కిక్కిరిసి కనిపిస్తాయి. ఎక్కడబట్టినా ఫుల్ రద్దీతో సందడి వాతావరణం కనిపిస్తూ ఉంటుంది.
అయితే పండగ రద్దీని దృష్టిలో పెట్టుకుని ప్రైవేట్ ట్రావెల్స్ ప్రజల నుంచి దండుకునేందుకు రెడీ అవుతున్నాయి. అధిక ఛార్జీలు వసూలు చేసి ప్రజల నుంచి ఉన్నదంతా ఊడ్చేందుకు సిద్దమవుతున్నాయి. ఇప్పటికే ఆర్టీసీ బస్సులు, రైళ్లు అన్నీ బుక్ అయిపోయాయి. ఇక ప్రత్యేక రైళ్లు, బస్సుల్లో కూడా బుకింగ్స్ కంప్లీట్ అయ్యాయి. దీంతో టికెట్లు దొరకనివారు తప్పనిసరి పరిస్థితుల్లో ప్రైవేట్ ట్రావెల్స్‌ను ఆశ్రయిస్తున్నారు. దీనిని అదునుగా చేసుకుని ప్రైవేట్ ట్రావెల్స్ యజమానులు వేలకు వేలకు ముక్కుపిండి ప్రయాణికుల నుంచి దోచేస్తున్నాయి. అధిక ఛార్జీలు ఉన్నా తప్పనిసరి పరిస్థితుల్లో ప్రయాణికులు ప్రైవేట్ బస్సుల్లో టికెట్లు బుక్ చేసుకుంటున్నారు. సాధారణ రోజుల్లో కంటే రెండు, మూడింతలు ఎక్కువగా ఛార్జీలు వసూలు చేస్తున్నారు.
ఈ క్రమంలో ప్రైవేట్ ట్రావెల్స్ యాజమానులను తెలంగాణ రవాణాశాఖ హెచ్చరించింది. అధిక ఛార్జీలు వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామంటూ వార్నింగ్ జారీ చేసింది. ప్రైవేట్ బస్సుల్లో ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తామని, పట్టుబడితే చట్టపరంగా చర్యలు ఉంటాయని తెలిపింది. సరుకు రవాణా చేసే బస్సులను సీజ్ చేస్తామంటూ స్పష్టం చేసింది. నిబంధనల ప్రకారం ఛార్జీలు వసూలు చేయాలని, అంతకుమంచి ప్రయాణికుల నుంచి తీసుకుంటే చర్యలు ఉంటాయంటూ రవాణాశాఖ హెచ్చరించింది. అటు 2025-26 ఆర్ధిక సంవత్సరంలో వచ్చిన ఆదాయ వివరాలను వెల్లడించింది. లైఫ్ ట్యాక్స్ ద్వారా రూ.3613 కోట్లు రాగా.. గ్రీన్ ట్యాక్స్ వల్ల రూ.57 కోట్లు వచ్చింది. ఇక తనిఖీల ద్వారా రూ.181 కోట్లు వచ్చినట్లు రవాణాశాఖ పేర్కొంది.
