AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pawan Kalyan: గెలుపే లక్ష్యంగా వ్యూహాలు.. పిఠాపురం నుంచే పవన్‌ ఎన్నికల ప్రచారం.. ఫుల్ షెడ్యూల్ ఇదే..

సార్వత్రిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తున్నారు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్.. ఎన్నికల టైం దగ్గరపడుతుండడంతో ప్రచారంలో దూకుడు పెంచుతున్నారు. ఈనెల 30న పిఠాపురం నుంచి సమర శంఖం పూరిస్తున్నారు. పిఠాపురం కేంద్రంగానే పవన్ కల్యాణ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుడుతున్నారు.

Pawan Kalyan: గెలుపే లక్ష్యంగా వ్యూహాలు.. పిఠాపురం నుంచే పవన్‌ ఎన్నికల ప్రచారం.. ఫుల్ షెడ్యూల్ ఇదే..
Pawan Kalyan
Shaik Madar Saheb
|

Updated on: Mar 26, 2024 | 11:25 AM

Share

సార్వత్రిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తున్నారు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్.. ఎన్నికల టైం దగ్గరపడుతుండడంతో ప్రచారంలో దూకుడు పెంచుతున్నారు. ఈనెల 30న పిఠాపురం నుంచి సమర శంఖం పూరిస్తున్నారు. పిఠాపురం కేంద్రంగానే పవన్ కల్యాణ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుడుతున్నారు. మూడు విడతలుగా పవన్‌ ప్రచారం ఉండేలా పర్యటన షెడ్యూల్‌ రూపొందిస్తున్నారు పార్టీ నేతలు. ప్రతి విడతలో జనసేన పోటీ చేసే నియోజకవర్గాలకు వెళ్లేలా షెడ్యూల్‌ రూపొందించనున్నారు. ప్రచారంలో భాగంగా పవన్ కల్యాణ్ ఈనెల 30న పిఠాపురం వెళ్తారు. తొలిరోజు శక్తిపీఠమైన శ్రీ పురూహూతిక అమ్మవారిని పవన్‌ దర్శనం చేసుకోనున్నారు. అక్కడ వారాహి వాహనానికి పూజలు చేసిన అనంతరం దత్తపీఠాన్ని సందర్శిస్తారు. ఆ రోజు నుంచి మూడు రోజుల పాటు నియోజకవర్గంలోనే ఉంటారు. ఈ క్రమంలో పార్టీ నేతలతో అంతర్గత సమావేశాలు నిర్వహిస్తారు. క్రియాశీల కార్యకర్తలతో మండలాల వారీగా సమావేశాలు ఉంటాయని పవన్‌ రాజకీయ కార్యదర్శి పి. హరిప్రసాద్ ప్రకటనలో తెలిపారు.

కూటమి భాగస్వాములైన టీడీపీ, బీజేపీ నేతలతోను పవన్ భేటీలకు ఏర్పాట్లు చేస్తున్నారని.. పిఠాపురం నుంచే రాష్ట్రంలోని ఇతర నియోజకవర్గాలకు వెళ్లాలని పవన్‌ నిర్ణయం తీసుకోవడంతో అందుకు తగిన విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ క్రమంలోనే పిఠాపురం నియోజకవర్గంలో బంగారు పాప దర్గా సందర్శన, క్రైస్తవ పెద్దలతో సమావేశంతో పాటు సర్వమత ప్రార్థనల్లో పవన్‌ పాల్గొంటారు. ఉగాది వేడుకలను సైతం పవన్‌ పిఠాపురంలోనే నిర్వహించుకోనున్నారు.

ఆ నాలుగు స్థానాలపై కసరత్తు..

ఇదిలాఉంటే.. ఇప్పటికే 18 అసెంబ్లీ, ఒక పార్లమెంట్ స్థానంలో అభ్యర్థులను ప్రకటించిన జనసేన అధినేత పవన్ కల్యాణ్.. పెండింగ్ స్థానాలపై కసరత్తు చేస్తున్నారు. మూడూ అసెంబ్లీ, ఒక పార్లమెంట్ స్థానంలో అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. అవనిగడ్డ, పాలకొండ, విశాఖ సౌత్ అసెంబ్లీ స్థానాలు, మచిలీపట్నం పార్లమెంట్ పై కొనసాగుతున్న సందిగ్ధత కొనసాగుతోంది. ఆయా ప్రాంతాల నేతలతో ఇప్పటికే భేటీ అయిన పవన్ కల్యాణ్.. పలుమార్లు చర్చలు నిర్వహించారు. ఇవాళ, రేపట్లొ ఫైనల్ చేసి ఎన్నికల ప్రచారానికి పవన్ బయలుదేరనున్నారని తెలుస్తోంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..