AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP TDP: చిచ్చు రేపుతున్న టీడీపీ మూడో జాబితా.. ఆ జిల్లాల్లో అసంతృప్తి జ్వాలలు

టీడీపీ మూడో జాబితా జిల్లాలో శ్రీకాకుళం, పాతపట్నం నియోజకవర్గాల్లో మంటలు రేపింది. రెండు నియోజకవర్గాల్లో ఊహించని విధంగా అభ్యర్థులను మార్చడం ఇందుకు అసలు కారణం. శ్రీకాకుళం నియోజకవర్గంలో గొండు శంకర్‌కు, పాతపట్నం నియోజకవర్గంలో మామిడి గోవిందరావుకు పార్టీ అధిష్టానం టిక్కెట్లు కేటాయించడంలో అసంతృప్తి జ్వాలలు ఎగిసిపడ్డాయి.

AP TDP: చిచ్చు రేపుతున్న టీడీపీ మూడో జాబితా.. ఆ జిల్లాల్లో అసంతృప్తి జ్వాలలు
Ap Tdp
Balu Jajala
|

Updated on: Mar 25, 2024 | 10:06 PM

Share

టీడీపీ మూడో జాబితా జిల్లాలో శ్రీకాకుళం, పాతపట్నం నియోజకవర్గాల్లో మంటలు రేపింది. రెండు నియోజకవర్గాల్లో ఊహించని విధంగా అభ్యర్థులను మార్చడం ఇందుకు అసలు కారణం. శ్రీకాకుళం నియోజకవర్గంలో గొండు శంకర్‌కు, పాతపట్నం నియోజకవర్గంలో మామిడి గోవిందరావుకు పార్టీ అధిష్టానం టిక్కెట్లు కేటాయించడంలో అసంతృప్తి జ్వాలలు ఎగిసిపడ్డాయి. శ్రీకాకుళం సీటు కచ్చితంగా తనకే వస్తుందని మాజీ ఎమ్మెల్యే గుండా లక్ష్మీదేవికి భావించారు. కానీ ఆమె స్థానంలో గొండు శంకర్‌కు టికెట్ ఇచ్చింది టీడీపీ హైకమాండ్. మరోవైపు పాతపట్నం సీటు తనకు వస్తుందని భావించిన మాజీ ఎమ్మెల్యే కలమట వెంకటరమణ విషయంలోనూ ఇదే జరిగింది. ఆయనకు బదులుగా మామిడి గోవిందరావుకు టీడీపీ సీటు దక్కింది.

శ్రీకాకుళం, పాతపట్నంలో టికెట్ రాని ఇద్దరు నేతలు.. ఏపీ టీడీపీ అధ్యక్షుడు, టీడీపీ సీనియర్ నేత అచ్చెన్నాయుడుపై మండిపడుతున్నారు. ఆయన వల్లే తమకు టికెట్ రాలేదనే ఆరోపిస్తున్నారు. టికెట్ రాకపోవడంతో తమవర్గం నేతలతో సమావేశమైన గుండా లక్ష్మీదేవి.. అచ్చెన్నాయుడిపై విమర్శలు గుప్పించారు. పార్టీ కోసం తాము ఎంతో చేశామని.. అలాంటి తమను పక్కనపెట్టడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. పాతపట్నంలో మాజీ ఎమ్మెల్యే కలమట వెంకటరమణ కూడా అచ్చెన్నాయుడుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ కోసం ఎన్నో ఏళ్ల నుంచి తాము కష్టపడ్డామని.. అలాంటి తనకు ఈ విధంగా జరగడాన్ని కార్యకర్తలు జీర్ణించుకోలేకపోతున్నారని అన్నారు.

తనను ఎదగనీయకుండా చేయడానికే అచ్చెన్నాయుడు ఈ రకంగా చేశారని ఆరోపించారు. చంద్రబాబుకు లేనిపోనివి చెప్పి తనకు టికెట్‌ రాకుండా చేశారని కలమట వెంకటరమణ మండిపడ్డారు. రామ్మోహన్ నాయుడుపై కూడా అచ్చెన్నాయుడు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. ఈసారి రామ్మోహన్‌ నాయుడు ఎంపీగా గెలిస్తే కేంద్రంలో మంత్రి పదవిని పొంది తనను మించిపోతాడన్న భయం అచ్చెన్నాయుడుకు ఉందన్నారు. రామ్మోహన్ నాయుడు ఇప్పటికైనా కళ్ళు తెరవాలని సూచించారు. మరోవైపు జిల్లా టీడీపీలోని అసమ్మతిపై ఎంపీ రామ్మోహన్ నాయుడు స్పందించారు. జరుగుతున్న పరిణామాలన్నీ చంద్రబాబు దృష్టిలో ఉన్నాయన్నారు. పార్టీ అందరినీ కలుపుకొని వెళ్లాలని భావిస్తోందని అన్నారు. రామ్మోహన్ నాయుడుని ఓడించాలని మాజీ ఎమ్మెల్యే కలమట అనలేదని… అదంతా వైసీపీ కుట్ర అని అన్నారు.