Andhra Pradesh: మద్యం మత్తులో డ్రైవర్.. హాస్టల్‌కు వెళ్లేందుకు ఆటో ఎక్కిన విదేశీ యువతి.. చివరకు..
Visakhapatnam News: దేశం కాని దేశానికి వచ్చి విద్యను అభ్యసిస్తుంది ఓ విదేశీ యువతి. రోజువారీ కార్యకలాపాల కోసం ఆటో ఎక్కింది. ఒంటరిగా ఆమెను చూసిన ఆటో డ్రైవర్.. అడ్వాంటేజ్ తీసుకుందాం అనుకున్నాడో.. ఏమోగానీ అసభ్యకర ప్రవర్తన మొదలుపెట్టాడు.
Visakhapatnam News: దేశం కాని దేశానికి వచ్చి విద్యను అభ్యసిస్తుంది ఓ విదేశీ యువతి. రోజువారీ కార్యకలాపాల కోసం ఆటో ఎక్కింది. ఒంటరిగా ఆమెను చూసిన ఆటో డ్రైవర్.. అడ్వాంటేజ్ తీసుకుందాం అనుకున్నాడో.. ఏమోగానీ అసభ్యకర ప్రవర్తన మొదలుపెట్టాడు. దీంతో ఆ యువతి.. ఆటోను ఆపి దిగిపోయింది. అయినా ఆమెను విడిచి పెట్టలేదు. వెంబడిస్తూ తనకు డబ్బులు చెల్లించాలని వెంటపడ్డాడు. స్థానికుల సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆటో డ్రైవర్ను పట్టుకున్నారు. ఓ నైజీరియన్ యువతి.. విశాఖలో విద్యను అభ్యసిస్తోంది. ఎంవిపి కాలనీలోని ఓ హాస్టల్లో ఉంటూ చదువుకుంటోంది. అయితే.. టీటీడీ కళ్యాణమండపం సమీపంలో ఓ జిమ్ కు వెళ్ళిన ఆ యువతి.. అక్కడ నుంచి హాస్టల్ కు వెళ్లేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలో ఆటోను ఆపి ఎక్కింది. ఆటో ఎక్కిన తర్వాత ఆమె పట్ల డ్రైవర్ సురేష్ అసభ్యకరంగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు.
నెమ్మదిగా డ్రైవ్ చేస్తూ ఆమెను తాకే ప్రయత్నం చేశాడు. దీంతో ఆ యువతి భయంతో గట్టిగా అరచి కిందకు దిగిపోయింది. అయినప్పటికీ ఆమె వెంట పడ్డాడు ఆటో డ్రైవర్ సురేష్. స్థానికులు గుర్తించి మందలించారు. అయితే తాను ఆ యువతని బీచ్ రోడ్ లో ఎక్కించుకున్నారని తనకు 250 రూపాయలు చెల్లించాల్సిందేనని చెప్పుకొచ్చాడు ఆటో డ్రైవర్. ఆమెతో వాదిస్తూ ఉన్నాడు. దీంతో భయపడిన ఆ విదేశీ యువతి స్థానికంగా ఉన్న ఓ ఫార్మసీ వద్దకు వెళ్లిపోయింది.
అయినప్పటికీ ఆ ఆటో డ్రైవర్ వెంట పడుతుండడంతో స్థానికులు విషయాన్ని పోలీసులకు సమాచారం అందించారు. రంగంలో దిగిన ఎంవీపి పోలీసులు.. ఆటో డ్రైవర్ సురేష్ ను అదుపులోకి తీసుకున్నారు. బాధిత యువతి ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన నిందితుడు సురేష్ ను అరెస్టు చేశామని టీవీ9 తో చెప్పారు ద్వారకా ఏసిపి మూర్తి. ఆ సమయంలో ఆటో డ్రైవర్ సురేష్ మద్యం మత్తులో ఉన్నట్టు ఉన్నాడని ఏసిపి అన్నారు.
ప్రశాంత నగరానికి మారుపేరుగా ఉన్న విశాఖలో.. ఇలా విదేశీ యువతి పట్ల ఆటో డ్రైవర్ అసభ్య ప్రవర్తన స్థానికంగా కలకలం రేపింది. భయాందోళనకు గురి చేసింది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..