AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Prakasam District: వేటపాలెం జీడిపప్పు పరిశ్రమకు 150 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర.. ప్రభుత్వ గుర్తింపు దక్కని వైనం

ఎంతటి రుచికరమైన వంటల్లోనైనా జీడిపప్పు పడితే ఆ టేస్టే వేరప్పా అంటారు ఫుడ్‌ లవర్స్‌. జీడిపప్పు తగిలిస్తే ఆ రుచి, వాసన వేరే లెవల్లో ఉంటుంది... అంతటి మధురమైన రుచి కలిగిన జీడిపప్పు తయారీదారులకు, కార్మికులకు మాత్రం చేదెక్కుతోంది. ప్రస్తుతం జీడిపప్పు పరిశ్రమ పరిస్థితి కొనబోతే కొరివి... అమ్మబోతే అడవి..

Prakasam District: వేటపాలెం జీడిపప్పు పరిశ్రమకు 150 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర.. ప్రభుత్వ గుర్తింపు దక్కని వైనం
Vetapalem Cashew Industry
Fairoz Baig
| Edited By: Srilakshmi C|

Updated on: Sep 07, 2023 | 2:14 PM

Share

చీరాల, సెప్టెంబర్ 7: ఎంతటి రుచికరమైన వంటల్లోనైనా జీడిపప్పు పడితే ఆ టేస్టే వేరప్పా అంటారు ఫుడ్‌ లవర్స్‌. జీడిపప్పు తగిలిస్తే ఆ రుచి, వాసన వేరే లెవల్లో ఉంటుంది… అంతటి మధురమైన రుచి కలిగిన జీడిపప్పు తయారీదారులకు, కార్మికులకు మాత్రం చేదెక్కుతోంది. ప్రస్తుతం జీడిపప్పు పరిశ్రమ పరిస్థితి కొనబోతే కొరివి… అమ్మబోతే అడవి అన్నట్టుగా తయారైంది.

చీరాల ప్రాంతంలో వస్త్ర వ్యాపారం తరువాత వేటపాలెం జీడిపప్పు చాలా ఫేమస్‌… పలాస జీడిపప్పుకంటే వేటపాలెం జీడిపప్పే ది బెస్ట్‌ అంటారు కూడా. అలాంటి వేటపాలెంలో వేలాది మంది కార్మికులు, వందలాది మంది వ్యాపారులు ఇక్కడ జీడిపప్పు పరిశ్రమల్లో ఉపాధి పొందుతున్నారు. 150 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర కలిగిన వేటపాలెం జీడిపప్పు పరిశ్రమకు ప్రభుత్వాల వల్ల ఎటువంటి గుర్తింపు నోచుకోలేదు. అయినా సరే స్తానికంగా పలువురికి ఉపాధి మార్గంగా ఉన్నంతలోనే చిన్నతరహాపరిశ్రామిక వేత్తలు పరిశ్రమను అభివృద్ధి చేస్తూ ముందుకు వెళుతున్నారు. త వందేళ్ళుగా లేని జీడిపప్పు కష్టాలు రెండుమూడేళ్ళుగా కోరోనా తరువాత విజృంభించాయి. జీడిపంట పండించే రైతులు ఆక్వా కల్చర్‌వైపు మొగ్గు చూపడంతో వేటపాలెం పరిసర ప్రాంతాల్లో జీడిపంట లేక ఇతర ప్రాంతాల నుంచి జీడిగింజలు దిగుమతి చేసుకోవాల్సిన దుస్థితి దాపురించింది. ఇలా దిగుమంతి చేసుకోవడం వల్ల రవాణా ఖర్చులు పెరిగిపోయాయి. మార్కెట్‌లో ఇతర ప్రాంతాల వ్యాపారులతో పోటీ పడలేక వేటపాలెం జీడిపప్పు ఉత్పత్తిదారులు నష్టాలబాట పడుతున్నారు. ఈ పరిస్థితి నుంచి గట్టెక్కేందుకు వేటపాలెంలో పరిశ్రమలన్నింటిని ఒక క్లస్టర్‌ కింద చేర్చి రాయితీలు, సౌకర్యాలు కల్పించాలని పరిశ్రమ యజమానులు, వ్యాపారులు కోరుతున్నారు.

అంతర్జాతీయంగా, జాతీయంగా నెలకొన్న మాంద్యం ప్రభావం జీడి పరిశ్రమపై కూడా పడింది. ప్రజల కొనుగోలుశక్తి పడిపోవడంతో జీడిపప్పు వినియోగం తగ్గింది. ఎగుమతులు, దేశీయ వినియోగం తగ్గిపోవడంతో డిమాండ్‌ కరువై జీడి పరిశ్రమలు మూతబడుతున్నాయి. వీటిపై ఆధారపడిన వ్యాపారులు, కార్మికులు ఉపాధి కోల్పోతున్నారు. మార్కెట్‌లో ఇతర ప్రాంతాల వ్యాపారులతో వేటపాలెం జీడిపప్పు వ్యాపారులు పోటీ పడలేక స్థానికంగా విక్రయించుకోవాల్సి వస్తుంది. దీంతో ఎగుమతులు చేయలేక జీడిపప్పు ఉత్పత్తిని తగ్గించేశారు. గత 150 సంవత్సరాలుగా ఎంతో ప్రసిద్ది చెందిన వేటపాలెం జీడిపప్పు ప్రాశస్త్యం పూర్తిగా తగ్గిపోవడంతో గతంలో 30 పరిశ్రమలు ఉంటే నేడు వాటిలో కొన్ని మూత పడ్డాయి. మరికొన్ని నష్టాలబాటలో ఉన్నాయి.

ఇవి కూడా చదవండి

మహిళలదే కీలకపాత్ర …

జీడి పప్పు తయారీలో మహిళలే కీలకంగా వ్యవహరిస్తుంటారు. జీడి పిక్కలను తోటల నుంచి సేకరించినప్పటి నుంచి పిక్కలను ప్రొసెసింగ్‌ వరకు మహిళలే కీలకంగా పనిచేస్తారు. పురుషులు కేవలం జీడి పిక్కలను ఆర బోయడం, ఎండ బెట్టడం, ప్రొసెసింగ్‌ యూనిట్లకు చేర్చే పనులు చేపడతారు. పిక్కలను బాయిలింగ్‌ చేసిన తరువాత కటింగ్‌కు తరలిస్తారు. అక్కడే మహిళల నైపుణ్యం మనకు తెలుస్తుంది. ఒక్కో పిక్కను కటింగ్‌ యంత్రాలపై కట్‌ చేస్తారు. పిక్కలో ఉన్న జీడి పప్పు విరిగిపోకుండా జాగ్రత్తగా తీయడంలో మహిళల నైపుణ్యం ప్రత్యేకమైంది.. పప్పు విరిగిపోతే మార్కెట్‌ తగ్గే అవకాశం ఉండడంతో ఇక్కడే మహిళలు అత్యంత జాగ్రత్తగా సున్నితంగా పిక్కను బయటకు తీయడంలో ప్రధానపాత్ర పోషిస్తారు. ఇంటిల్లిపాదీ ఇళ్లలోనే జీడి పప్పు ఒలిచే పనిలో నిమగ్నమవుతారు. దీనివల్ల ఒక్కో మహిళ రోజుకు ఎంతోకొంత ఆదాయం సంపాదిస్తున్నారు. ఒక్కో పరిశ్రమలో పనిచేసే మహిళల్లో ఒకరిని ఎంపికచేసి మేస్త్రీగా గుర్తిస్తారు. ఆమె చెప్పినట్లు ఇతర మహిళా కార్మికులు పనిచేయాల్సి ఉంటుంది. వారు ఉదయం జీడి పప్పు ఇచ్చిన నుంచి ప్రొసెసింగ్‌ చేసిన తరువాత తిరిగి ఇచ్చేంత వరకు మేస్త్రీదే బాధ్యత. కుటుంబ పోషణలోనూ ఇక్కడి మహిళలే పైచేయిగా నిలుస్తున్నారు. అయితే ప్రస్తుతం వేటపాలెంలో జీడిపప్పు పరిశ్రమ నష్టాల్లో ఉండటంతో తమకు ఉపాధి కరువైందని మహిళలు వాపోతున్నారు… గతంలో జీడిపప్పు పరిశ్రమల్లోనే పనిచేసి తమ పిల్లలకు పెళ్ళిళ్లు కూడా చేశామని, అయితే ఇప్పుడు పనులు లేకపోవడంతో ఆదాయం తగ్గి కుటుంబ పోషణే భారంగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఆదుకునే ఆపన్న హస్తం కోసం…

ఒక్క వేటపాలెం ప్రాంతంలోనే 30 జీడిపప్పు పరిశ్రమలుండేవి. ఆర్థిక మాంద్యం ప్రభావంతో నష్టాలు రావడంతో వాటిలో 10 పరిశ్రమలు మూతబడ్డాయి. మిగిలిన 20 పరిశ్రమల్లో కార్మికులను సగానికి తగ్గించేశారు. దీంతో బాపట్ల జిల్లాలోని 5,500 మంది జీడి కార్మికుల ఉపాధిపై కోతపడింది. వేటపాలెంలో 50 షాపులుండగా, ముగ్గురు వ్యాపారులు తీవ్ర నష్టాలను చవిచూసి ఐపి పెట్టాల్సిన దుస్థితి దాపురించింది… ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే మొత్తం షాపులతో పాటు పరిశ్రమలుకూడా మూతపడే ప్రమాదముందని పరిశ్రమ యజమానులు, వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక వేటపాలెం జీడీ పరిశ్రమను ఆదుకొనేందుకు ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపాలని కోరుతున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.